కేసీఆర్‌కు ఉత్తమ్‌ శుభాకాంక్షలు! 

Uttam Kumar Reddy Setires On CM KCR Rest Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని, ఇక్కడ తనకేమీ ఇబ్బంది ఉండదని, ప్రజలే నష్టపోతారని కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఉత్తమ్‌ ఈ రకంగా స్పందించారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు.

శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..  కేసీఆర్‌ నియంతృత్వ పాలనతో ప్రజలు, నాయకులు విసిగిపోయారని, కేసీఆర్‌ పాలన నుంచి విముక్తి కలిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ప్రజల్లో ఉన్న ముసుగు తొలిగిపోయిందని, దోచుకోవడానికే అధికారాన్ని కోరుకుంటున్నారని ప్రజలకు అర్థమైందన్నారు. ప్రజలు దృష్టి మరల్చడానికే కేసీఆర్ కూటమిపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట చరిత్రలో నిలిచిపోయే రోజని, తమ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. సోనియా సభకు, టీజేఎస్‌, టీడీపీ, సీపీఐ క్యాడర్‌లను ఆహ్వానించామన్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ కూడా పాల్గొంటారని తెలిపారు.

త్వరలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు.. కేటీఆర్‌ అమెరికాకు వెళ్తారని జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఎదురుచూస్తున్న వారికి గ్రాంట్‌ను రూ. 50 వేలు ఒకేసారి చెల్లిస్తామని, ఆ తర్వాత డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కట్టిస్తామన్నారు. 30 రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని, పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపని, సమాన వేతనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 28 న ఖమ్మం, తాండూరులో బహిరంగసభలు ఉంటాయన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎందుకు ఇవ్వలేకపోయారో మురళీధర్రావు చెప్పాలని, ఈసారి ఒక్క సీటు కూడా బీజేపీకి రాదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top