సన్నబియ్యం.. సొంత ఇల్లు! 

Uttam Kumar Reddy Released Congress Manifesto - Sakshi

సొంతింటి కల సాకారానికి రూ.5 లక్షల సాయం 

ఇందిరమ్మ లబ్ధిదారులకు అదనంగా రూ.2 లక్షలు 

తెల్లకార్డుపై ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రేషన్‌ 

బీపీఎల్‌ కుటుంబాలకు ఏటా ఆరు సిలిండర్లు ఫ్రీ 

ఎస్సీ, ఎస్టీల గృహావసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

వివరాలు వెల్లడించిన ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌ : ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ దూకుడు మరింత పెంచింది. రాష్ట్ర ప్రజలపై హామీల వర్షం కురిపించింది. ‘ప్రజాకర్ష’మేనిఫెస్టో ప్రతిపాదనలు ప్రకటించింది. రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యం తీసేసి.. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారందరికీ సన్నబియ్యం ఇస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అదనంగా గది నిర్మాణం కోసం రూ.2 లక్షలు ఇస్తామని, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తామని, నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, ఇళ్ల పథకం కింద ఇప్పటివరకు లబ్ధి చేకూరని వారికి సొంత ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు సాయం చేస్తామని చెప్పారు.

పార్టీ మేనిఫెస్టో తయారీ కోసం సీనియర్‌ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం బుధవారం గాంధీభవన్‌లో జరిగింది. సమావేశంలో ఉత్తమ్‌తోపాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రులు శ్రీధర్‌ బాబు, సునీతా లక్ష్మారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సీనియర్‌ నేత పి.వినయ్‌కుమార్, పలువురు డీసీసీ అధ్య క్షులు, ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల మేనిఫెస్టో కోసం తీసుకున్న పలు నిర్ణయాలను ఉత్తమ్‌ వెల్లడించారు. 

ప్రకటించిన హామీలివే 
ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదితోపాటు ఇతర అవసరాలను నిర్మించుకునేందుకు రూ.రెండు లక్షలు మంజూరు 
రాష్ట్రంలో అర్హులైన అందరికీ రూ.ఐదు లక్షలతో కొత్తగా ఇళ్ల నిర్మాణానికి నిధులు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా మరో లక్ష. వీలున్నచోట ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం. 
తెల్లరేషన్‌ కార్డులున్న వారికి మనిషికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం. గతంలో అమ్మ హస్తం పేరుతో ఇచ్చిన 9 రకాల నిత్యావసరాల పంపిణీ. 
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత రేషన్‌. రేషన్‌ డీలర్ల కమీషన్‌ క్వింటాల్‌కు రూ.100కు పెంపు. 
ఎస్సీ, ఎస్టీలకు గృహావసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. 
ప్రార్థనా మందిరాలు, దేవాలయాలకు ఉచితంగా విద్యుత్, విద్యుత్‌ చార్జీల తగ్గింపు. 
బీపీఎల్‌ (దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న) కుటుంబాలకు ఏడాదికి ఆరు వంట గ్యాస్‌ సిలిండర్లు ఉచితం. 
ఏడో తరగతి నుంచి ఇంటర్‌ చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లు. 
18 ఏళ్లు నిండిన వారందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా. 
అన్ని రకాల వ్యాధులకు రూ.5 లక్షల వరకు ఉచిత సేవలు. 
గల్ఫ్‌ ఎన్నారైల కోసం రూ.500 కోట్ల ఫండ్‌. గల్ఫ్‌లో కార్మికులు చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా. 
కౌలు రైతులూ రైతులుగా గుర్తింపు. 
రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్ల సమస్యల పరిష్కారంపై యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ. 
హైదరాబాద్‌కు ప్రత్యేక మేనిఫెస్టో.. ప్రతి నియోజకవర్గానికి ఓ మేనిఫెస్టో. 
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు. 
గతంలో ఇచ్చిన హామీలు.. రూ.రెండు లక్షల రైతు రుణమాఫీ, యువతకు నిరుద్యోగ భృతి, పింఛన్ల రెట్టింపు, మహిళా సంఘాలకు ప్రోత్సాహకాల అమలు. 

కేసీఆర్‌ కుటుంబానికి.. తెలంగాణ ప్రజలకు: ఉత్తమ్‌ 
రానున్న ఎన్నికలు టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ కాదని, తెలంగాణ ప్రజలకు, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య జరుగుతాయని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకుంటే.. కేసీఆర్‌ కుటుంబం ప్రజలను అణచివేసి నియంత పాలన సాగిస్తోందని విమర్శించారు. నేటితో టీఆర్‌ఎస్‌ పీడ విరగడ అవుతుందని మండిపడ్డారు. తెలంగాణ బడ్జెట్‌ను బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేలా టీఆర్‌ఎస్‌ పాలిస్తే, తాము బడ్జెట్‌ను ప్రజలకు పంచి పెడతామని, ఆ కోణంలోనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు జీవన్‌ రెడ్డి నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను పీసీసీ ఆమోదించిందని చెప్పారు. ఈ హామీలపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని, కావాలంటే లెక్కలు చెప్పేందుకు కూడా తాము సిద్ధమని ఉత్తమ్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top