గెహ్లాట్‌తో ఉత్తమ్‌ బృందం భేటీ

Uttam kumar reddy meeting with Gehlot - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, శిక్షణ ఇన్‌చార్జి అశోక్‌ గెహ్లాట్‌తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వం లోని బృందం శనివారం ఢిల్లీలో సమావేశమైంది. పార్టీ సంస్థాగత స్వరూపం బలోపేతంపై క్షేత్రస్థాయి అంశాలను ఆయనకు వివరించింది. వివిధ స్థాయిల్లో కమిటీల పటిష్ట నిర్మాణం, పార్టీ శ్రేణులకు విడతలవారీగా శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు, ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించే జన్‌ ఆక్రోశ్‌ ర్యాలీకి తెలంగాణ నేతలను ఆహ్వానించడం వంటి అంశాలను ఈ భేటీలో చర్చించారు.

కమిటీలన్నింటిపై నెల రోజుల్లో నివేదికలను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి, గెహ్లాట్‌కు ఉత్తమ్‌ సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, తెలంగాణలో ఇసుక విధానాన్ని పార్టీ నేత నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్దూ ఇటీవల ప్రశంసించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆ విధానంలోని లోపాలు గెహ్లాట్‌కు నేతలు వివరించినట్లు సమాచారం. గెహ్లాట్‌తో భేటీ అయి న వారిలో మల్లు రవి, ఎమ్మెల్యే సంపత్‌ కుమార్, దాసోజు శ్రవణ్‌ కుమార్, కటకం మృత్యుంజయం ఉన్నారు.  

ఇసుక మాఫియాపై మీ పోరు కొనసాగించండి
ఉత్తమ్‌కు రాహుల్‌గాంధీ అభినందన లేఖ
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అభినందిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ లేఖ రాశారు. ఇటీవల పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ తెలంగాణ పర్య టన సందర్భంగా రాష్ట్రంలో ఇసుక విధానం బాగుందని వ్యాఖ్యానించిన అంశాన్ని లేఖ రూపంలో రాహుల్‌ దృష్టికి ఉత్తమ్‌ తీసుకెళ్లగా దానికి వివరణ ఇస్తూ శనివారం ఆయన మరో లేఖ రాశారు. సిద్ధూ వ్యాఖ్యలను పార్టీ పరంగా తీసుకోవద్దని, తెలంగాణ ప్రభుత్వ అక్రమాలపై టీపీసీసీ ఉద్యమాన్ని కొనసాగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top