ఉత్తమ్‌ లిస్ట్‌ హుష్‌!

Is Uttam Kumar Reddy Faces Critical Situation In Congress - Sakshi

పదవుల జాబితా పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం

పీసీసీలో ముదురుతున్న పదవుల గోల.. సంప్రదించలేదంటూ సీనియర్ల మండిపాటు

జాబితాలో అనామకులంటూ ఫిర్యాదులు.. దాంతో ప్రస్తుతానికి పక్కన పెట్టిన అధిష్టానం

సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  రాష్ట్ర కాంగ్రెస్‌లో పదవుల గోల ముదిరి పాకాన పడుతోంది. పార్టీ పదవులకు తన వర్గీయుల పేర్లతో పార్టీ అధిష్టానానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అందజేసిన జాబితా ప్రస్తుతానికి పెండింగ్‌లో పడింది. పదవుల భర్తీ విషయంలో తమను మాటమాత్రంగానైనా సంప్రదించలేదని, తమ సలహాలనూ ఉత్తమ్‌ పెడచెవిన పెట్టారని పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. పదవుల భర్తీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారంటూ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

రాహుల్‌తో సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు ఉత్తమ్‌ జాబితాలోని పేర్లను పార్టీ సీనియర్లకు వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్‌ ఇటీవల ఢిల్లీ వెళ్లి పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు కొన్ని కీలక పదవులకు కొందరి పేర్లు సూచిస్తూ జాబితా అందజేశారు. ఆ జాబితాలో అనామకులే ఎక్కువగా ఉన్నారని, పార్టీ పటిష్టతకు ఉపయోగపడని వారి పేర్లున్నాయని ఫిర్యాదులు వెళ్లడంతో దాన్ని రాహుల్‌ పెండింగ్‌లో పెట్టారు.

అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సీనియర్లతో కూడిన 50 మంది జాబితా ఇవ్వడంతో పాటు ఒక్కో పదవికి ఇద్దరు, ముగ్గురు పేర్లను సూచించాలని రాహుల్‌ ఆదేశించినట్టు సమాచారం. దాంతో పార్టీ పదవుల పంపకం ప్రస్తుతానికి వాయిదా పడిందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. కమిటీల్లో తమకు లేదా తమవారికి స్థానం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబు మంగళవారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలోనే ఉన్నారు. 

ఉత్తమ్‌ జాబితాలో ఉన్నదెవరు? 
పీసీసీకి ముగ్గురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లతో పాటు మేనిఫెస్టో కమిటీ, ఎన్నికల ప్రచార కమిటీలకు పేర్లు సూచిస్తూ అధిష్టానానికి ఉత్తమ్‌ జాబితా అందజేశారు. అందులో ఎవరి పేర్లున్నదీ అధికారికంగా తెలియకపోయినా పార్టీ వర్గాల్లో పలు పేర్లు జోరుగా ప్రచారమవుతున్నాయి. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య పేర్లు సిఫార్సు చేసినట్తు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ప్రచార, మేనిఫెస్టో, సమన్వయ, ప్రణాళిక, వ్యూహరచన కమిటీలతో పాటు వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల వడపోత కమిటీ చైర్మన్లుగా దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బలరాం నాయక్, వి.హన్మంతరావు, గీతారెడ్డి, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, దానం నాగేందర్‌ తదితరుల పేర్లున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఏ పదవులకు ఎవరిని సూచించారో వెల్లడవలేదు. దీంతో తమకు సముచిత ప్రాధాన్యమివ్వాలంటూ సీనియర్లు ఢిల్లీ బాట పట్టారు. 

ప్లానింగ్, వ్యూహ రచన కమిటీకి రేవంత్‌! 
టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ చేస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఉత్తమ్‌ జాబితాలో ఆయన పేరు లేదంటున్నారు. రాహుల్‌తో సన్నిహితంగా ఉండే ఓ నేత రేవంత్‌ విషయాన్ని రాహుల్‌ వద్ద ప్రస్తావించారని, సముచిత ప్రాధాన్యత ఇస్తామని పార్టీలో చేరేప్పుడు హామీ ఇచ్చామని ఆయన దృష్టికి తెచ్చారని తెలిసింది. అయితే, పార్టీపైనా, సీనియర్‌ నేతల గురించీ ఇటీవల మీడియాతో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను రాహుల్‌ దృష్టికి ఉత్తమ్‌ తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు, తనకు ప్రాధాన్యమివ్వకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ మట్టికొట్టుకుపోతుందని రేవంత్‌ అనడం తెలిసిందే. అధిష్టానం మాత్రం ఎన్నికల ప్రణాళిక, వ్యూహ రచన కమిటీకి రేవంత్‌ పేరును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించిందంటున్నారు. 21 లేదా 22న కమిటీల ప్రకటన ఈ నెల 21 లేదా 22న కమిటీల ప్రకటన వెలువడుతుందని ఏఐసీసీ వర్గాలు చెప్పాయి. రాజస్తాన్‌ పర్యటనలో ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ బుధవారం ఢిల్లీ వస్తారని, ఆ సాయంత్రం రాహుల్‌తో సమావేశమై కమిటీలకు పేర్లు ఖరారు చేస్తారని వెల్లడించాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top