కేసీఆర్‌లా మాట తప్పం.. 

Uttam Kumar Reddy comments on KCR Govt - Sakshi

చెబుతున్న హామీలన్నీ పక్కాగా నెరవేరుస్తాం: ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను వంచించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిందని, ప్రస్తుతం చేస్తున్న వాగ్ధానాలనూ అమలు చేస్తామని, కేసీఆర్‌లా మాట తప్పమని స్పష్టం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌ నుంచి రెండు దఫాలుగా ఉత్తమ్‌ టెలి కాన్ఫరెన్స్‌లో దాదాపు 20 వేల మంది బూత్‌ కమిటీ అధ్యక్షులతో మాట్లాడారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని, కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, మీరంతా వాటికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీకి బూత్‌ కమిటీలు కీలకమైనవని, క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలే పార్టీకి గట్టి పునాదులన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ ఎంత విస్తృతంగా పనిచేస్తే ఎన్నికల్లో అంత మంచి ఫలితాలు వస్తాయని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయం అని అన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి నెరవేర్చలేదన్నారు. దళిత, గిరిజన కుటుంబాలకి మూడెకరాలు భూమి, అర్హులైన అందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ముస్లింలకు, గిరిజనులకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి సీఎం కేసీఆర్‌ మాట తప్పారన్నారు.  

మాట నిలబెట్టుకునే సత్తా ఉంది... 
కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ మాదిరి కాదని, హామీలు ఇస్తే నెరవేర్చి తీరుతుందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. గతంలో ఉచిత విద్యుత్, బకాయిల రద్దు, రుణమాఫీ వంటి అనేక హామీలు ఇచ్చి పక్కాగా అమలు చేసిందని గుర్తుచేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. దాదాపు 40 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూర్చే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

వడ్డీతో సహా బదులిస్తాం..
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుర్మార్గ పాలన సాగిస్తున్నారని, ప్రజలకు హక్కులు లేకుండా చేశారని ఉత్తమ్‌ ఆరోపించారు. ఎవరైనా మాట్లాడితే వారిని బెదిరింపులకు గురి చేసి, జైల్లో పెడుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు జులుం చూపిస్తే తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. 

ఉత్తమ్‌ చెప్పిన మరిన్ని వివరాలు.. 
- ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.
సామాజిక పింఛన్లు పొందుతున్న అందరికీ నగదును రెట్టింపు చేస్తాం.
వృద్ధులు, వితంతవులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత, బీడి కార్మికులకు రూ.వెయ్యి పింఛన్‌ను 2 వేలు, వికలాంగుల పింఛన్‌ను రూ.3 వేలకు పెంచుతాం.
వృద్ధాప్య పింఛన్‌ వయో పరిమితిని 65 నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తాం.
ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం.
వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టు బాటు ధరలు కల్పించి, రూ.5 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధులను ఏర్పాటు చేస్తాం.  
వరి, మొక్కజొన్నలకు క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, మిర్చికి రూ.10 వేలు తగ్గకుండా చూస్తాం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top