ప్రజల చూపు కాంగ్రెస్‌ వైపు

Uttam kumar reddy commented over trs - Sakshi

టీఆర్‌ఎస్‌ అంటేనే మండిపడుతున్నారు

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయం

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్‌ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌లంటే ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు. తెలంగాణ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆలంపల్లి రాంకోటి ఆదివారం గాంధీభవన్‌లో తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి కూడా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌ గాంధీభవన్‌కు వచ్చి ఉత్తమ్‌ను కలసి తాను పార్టీలో చేరతానని ప్రకటించారు.

సిద్దిపేట, వైరా, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గాంధీభవన్‌కు వచ్చి ఉత్తమ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఐదేళ్లు పాలించమని ప్రజలు అధికారమిస్తే ఎలాంటి కారణం చూపకుండా ప్రభుత్వం నుంచి వైదొలిగారని విమర్శించారు. ఇది ప్రజలను అవమానపర్చడం కాదా అని ప్రశ్నించారు.

దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి, ముస్లింలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు.. ఇలా అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను తరిమికొట్టడం ఖాయమని,  కేసీఆర్‌ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధమ న్నారు. కాగా, వైరా నుంచి వచ్చిన కార్యకర్తలు వైరా నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించవద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని  కోరారు.  ం

భారత్‌ బంద్‌ను జయప్రదం చేయండి
పెట్రోల్, డీజిల్‌ ధరలు సామాన్యులకు భారంగా మారాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించకుండా పాలకులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పాలకులపై ఒత్తిడికిగాను  సోమవారం నిర్వహించే భారత్‌బంద్‌ను విజయవంతం చేయా లని ఆయన కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్లతో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, ఉత్తమ్‌ సమావేశమయ్యారు. అనం తరం జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షులు, ముఖ్య నేతలతో మాట్లాడారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top