మంత్రి కేటీఆర్‌ ఓ బచ్చా!

Uttam kumar reddy commented over ktr and kcr - Sakshi

సిరిసిల్ల బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

కేసీఆర్, కేటీఆర్‌కు కళ్లు నెత్తికెక్కినయ్‌

ఇసుక మైనింగ్‌తో అక్రమ సంపాదన..

సిరిసిల్ల: ‘రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు.. ఆయన ఓ బచ్చా.. ఓ లుచ్చా’అని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేటీఆర్‌ అత్యం త అవినీతిపరుడని, మిషన్‌ భగీరథ పనులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగించి రూ.40వేల కోట్లలో ఆరు శాతం కమీషన్‌ దండుకున్నారని ఆరోపించారు. ‘నా భార్య ఎమ్మెల్యేగా ఉన్న కోదాడకు వెళ్లి అక్కడ అబద్ధాలు చెప్పాడు. 

నేను మిలటరీలో పనిచేసి వచ్చిన. నాపై దిగజారుడు ఆరోపణలు మానుకోవాలి. తెలంగాణలో ఇసుక దందా సాగుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ బంధువులే ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు వారికి తొత్తులుగా మారాయి’అని ధ్వజమెత్తారు. నేరెళ్ల దళితులపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన ఎస్పీపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం సిగ్గులేకుండా వ్యవహరించిందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వారిని వదిలిపెట్టబోదని హెచ్చరించారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ నేరెళ్లకు వచ్చి దళితులను పరామర్శిస్తే కేసీఆర్, కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడారని, వాళ్లకు కళ్లు నెత్తికెక్కాయని అన్నారు. దళిత సమాజాన్ని అవహేళనగా మాట్లాడిన తండ్రీకొడుకులకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో కేటీఆర్‌ను ఓడిం చి కాంగ్రెస్‌ జైత్రయాత్రకు శ్రీకారంచుట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే.. రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీతోపాటు, పవర్‌లూమ్‌ పరిశ్రమకు ఉచితంగా కరెంట్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌ మోసగాడు: రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఓ దివానాగాడని, ఆయన రెండు పెగ్గులేస్తే ఫ్రంట్, బ్యాక్‌ ఏదీ తెలియదని అన్నారు. తెలంగాణ రాకముందు ‘ఆంధ్రోడి పెత్తనం ఏందీ’ అన్నారని, ఇప్పుడు ‘కేంద్రం పెత్తనం ఏంటీ’ అంటున్నారని, రేపు పీఎం అయితే.. ‘దేవుడి పెత్తనం ఏందీ.. నన్నే దేవుడిని చేయ్యండి.’అంటారని ఎద్దేవా చేశారు. సమావేశంలో షబ్బీర్‌అలీ, వి.హన్మంతరావు, భట్టివిక్రమార్క, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్‌యాదవ్, సంపత్‌కుమార్, కేకే మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తుందని పీసీసీ అధినేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రజాచైతన్య బస్సుయాత్రలో భాగంగా బుధవారంరాత్రి కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.

కేసీఆర్‌ కుటుంబ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఇద్దరు దళితులు ఆత్మాహుతికి పాల్పడితే అందుకు కారకులైనవారిపై ఇప్పటికీ చర్య లు లేవని విమర్శించారు. రాష్ట్రంలో ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల ఒత్తిళ్లతో కొన్ని ప్రధాన పత్రికలు, చానళ్లు వాటిని బయటకు రానీయడం లేదన్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top