టీఆర్‌ఎస్‌ను ప్రజలే బొందపెడతారు

Uttam kumar reddy commented over kcr - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్యే ప్రధాన ఎన్నికల పోటీ అని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ప్రభుత్వం రద్దుతో రాష్ట్రంలో కేసీఆర్‌ నిరంకుశ శకం ముగిసినట్లే అని, టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలే బొంద పెడతారంది. ఐదేళ్లు పాలించమని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండించింది. ఇది అప్రజాస్వామికం అని పేర్కొంది. గురువారం ప్రభుత్వ రద్దు అనంతరం కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ ఆర్సీ కుంతియా, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని నేతలు తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ బిల్లు పాస్‌ చేసి ప్రత్యేక రాష్ట్రం ఇస్తే అదేదో తానే పోరాడి సాధించానని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్, ఆయన కుటుంబం నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్రాన్ని బందిపోటు ముఠాలా దోచుకున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కేసీఆర్‌ ముందస్తుకు వెళ్లి మంచే చేశారని ఉత్తమ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆయన్ను ముందస్తుగా బొందపెట్టేందుకు అవకాశం కల్పించారన్నారు.

మైనారిటీ, ఎస్సీ, ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తామని, గిరిజనులకు, దళితులకు భూ పంపిణీ చేస్తామని, పేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని యువతను.. ఇలా అన్ని వర్గాలను కేసీఆర్‌ మోసం చేశారన్నారు.  ఎన్నికల కమిషన్‌తో మాట్లాడి ప్రభుత్వాన్ని రద్దు చేశానని చెబుతున్న కేసీఆర్‌ ఈ వ్యవహారంలో పెద్ద కుట్ర ఉందన్నారు. అసలు ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు ఆయన ఈసీతో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ఓటర్ల సవరణపై ప్రకటన చేసిన ఈసీ ఎన్నికల విషయంలో కేసీఆర్‌తో ఏం మాట్లాడిందని నిలదీశారు.  వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు.  ఇప్పటికే 70 మంది అభ్యర్థుల జాబితా సిద్ధంగా ఉందని, మానస సరోవరం యాత్ర నుంచి రాహుల్‌ రాగానే ప్రకటిస్తామని చెప్పారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top