కేసీఆర్‌ మోసాలను వివరిస్తూ..

Uttam kumar reddy commented over kcr - Sakshi

ప్రజలకు బహిరంగ లేఖ రాస్తాం: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

కుల భవనాల పేరుతో మరో మోసం

సాక్షి, హైదరాబాద్‌: గత నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వైఫల్యాలను, ప్రజలకు కేసీఆర్‌ చేసిన మోసాలు, దోపిడీలను వివరిస్తూ బహిరంగ లేఖ రాయనున్నట్లు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. వారం, పది రోజుల్లో ఈ లేఖను విడుదల చేస్తామని చెప్పారు. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ సీనియర్లతో సమావేశం నిర్వహించారు.

అనంతరం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ కార్యనిర్వా హక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి, ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు అబద్ధాలు చెప్పడం, శంకుస్థాపనలు చేయడం సోకుగా మారిం దని ఉత్తమ్‌ విమర్శించారు. కులాలవారీగా ఆత్మ గౌరవ భవనాల పేరుతో బీసీలను మళ్లీ మోసం చేసేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతున్నారన్నారు.  

ఆ భవనాలేమయ్యాయి..
2015 డిసెంబర్‌ 24న బంజారా, ఆదివాసీ, జగ్జీవన్‌రామ్‌ భవనాలకు శంకుస్థాపన చేశారని, ఆ భవనా లు ఏమయ్యాయని కేసీఆర్‌ను ఉత్తమ్‌ ప్రశ్నించారు. అదే ఏడాది సెప్టెంబర్‌ 20న కేరళభవన్, డిసెంబర్‌ 24న క్రిస్టియన్‌ భవన్, 2017 డిసెంబర్‌ 29న గొల్లకురుమ భవన్, 2018 మార్చి 23న గౌడ భవన్, 2017 జనవరి 21న గ్లోబల్‌ ఇస్లామిక్‌ కల్చరల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని, ఇప్పటివరకు ఒక్క అడుగు ముందుకేయలేదని ఎద్దేవా చేశారు. ఆయా కులాల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ దెబ్బతీశారని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తానని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని, భూకంపం సృష్టిస్తానని అసెంబ్లీలో చెప్పి ఢిల్లీ వెళ్లి మోదీ కాళ్లు పట్టుకుని వచ్చారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో చేరిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌
ఎక్సైజ్‌ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ వెంకటేశ్‌ నేత గాంధీభవన్‌లో పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  

ఎప్పుడైనా మాదే విజయం
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తామే విజయం సాధిస్తామని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, 75 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందుతామని అన్నారు. ఎన్నికలపై క్లారిటీ వచ్చిన తర్వాత బస్సుయాత్ర, పొత్తుల విషయాల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. సీఎం ఎవరనేది ఎన్నికల తర్వాత అధిష్టానం నిర్ణయిస్తుందని, పీసీసీ అధ్యక్షులే సీఎంలు అవుతారనే ప్రస్తావన కూడా అనవసరమని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోంది ప్రగతి నివేదన సభ కాదని, ఆవేదన సభ అని, దానికి దీటుగా సమాధానమిస్తామని చెప్పారు.

క్షేత్రంలోకి వెళ్దాం... క్రియాశీలమవుదాం
కాంగ్రెస్‌ సీనియర్ల సమావేశంలో నిర్ణయం
గ్రామస్థాయిలో కేసీఆర్‌ వైఫల్యాలను ఎండగట్టాలి

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలు వస్తాయనే సంకేతాల నేపథ్యంలో దూకుడు పెంచాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో చురుకుగానే ఉన్నా.. ఇకపై మరింత వేగంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి క్రియాశీలం కావాలని నిర్ణయించింది.

మంగళవారం ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన పార్టీ సీనియర్ల సమావేశంలో నిర్ణయించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్కలతోపాటు పలువురు ముఖ్య నేతలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, టీఆర్‌ఎస్‌ నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ, ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై భేటీలో 3 గంటలకు పైగా చర్చించారు.

పోస్టర్లు, ఫ్లెక్సీలతో ప్రచారం
టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభను ధీటుగా ఎదుర్కోవాలని, ఇందుకోసం గ్రామస్థాయి నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గ్రామస్థాయిలో పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని, మండల, నియోజకవర్గాల స్థాయిల్లో పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందస్తు ఎన్నికలు వస్తే ప్రచారం కోసం పార్టీ అధినేత రాహుల్, సోనియా గాంధీలను ఆహ్వానించాలని తీర్మానించారు.

ప్రస్తు తం నిర్వహిస్తున్న బస్సుయాత్ర విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని, బస్సుయాత్రతోపాటు పొత్తుల అంశంపై ముందస్తు ఎన్నికల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థుల్లో కనీసం 50 మందిని ముందుగానే ప్రకటించాలనే అభిప్రాయాన్ని మెజార్టీ నేతలు వ్యక్తం చేశారు. ఇందుకోసం సెప్టెంబర్‌లో ఓ కమిటీ ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. గెలుపు అవకాశాలు, సామాజిక న్యాయం ప్రాతిపదికన అభ్యర్థుల ఖరారు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ మేనిఫెస్టో, ప్రచార కమిటీలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. కాగా సీనియర్‌ నేతలు డీకే అరుణ, జైపాల్‌రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు భేటీకి గైర్హాజరయ్యారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top