టీఆర్‌ఎస్‌ నేతలు టచ్‌లో ఉన్నారు

Uttam kumar reddy about trs leaders - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో కొత్తగా చేరినవారెవరికీ ఎన్నికల్లో టికెట్లు ఖరారు కాలేదని, అభ్యర్థుల గెలుపు అవకాశాలను బట్టి ఎన్నికల సమయంలో నిర్ణయాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో తనను కలసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరినవారికి టికెట్లు ఖరారు అయినట్టుగా ప్రచారం జరుగుతోందని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా, టికెట్లు ఎవరికీ ఖరారు చేయలేదన్నారు.

రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌లో చేరిన వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయ రమణారావు వంటివారికి కచ్చితంగా అవకాశం దక్కుతుందన్నారు. మిగిలిన వారికి అప్పటి పరిస్థితిని బట్టి, గెలుపు అవకాశాలను బట్టి ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే టికెట్లపై ఎవరికీ, ఎలాంటి వాగ్దానమూ చేయలేదన్నారు. నల్లగొండలో టీడీపీ నేత భూపాల్‌రెడ్డి చేరుతానని చెప్పినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం చెప్పారని ఉత్తమ్‌ వెల్లడించారు. అందుకే భూపాల్‌రెడ్డిని కాంగ్రెస్‌లోకి వద్దని చెప్పినట్టుగా వివరించారు.  

మధ్యవర్తులను పంపుతున్నారు..  
కాంగ్రెస్‌ పార్టీలో చేరుతామని టీఆర్‌ఎస్‌ నాయకులు చాలామంది మధ్యవర్తులను పంపిస్తున్నారని ఉత్తమ్‌ వెల్లడించారు. మాజీమంత్రి కొండా సురేఖ కూడా మధ్యవర్తిని పంపారని, రెండు నియోజకవర్గాలకు టికెట్లు అడిగారని ఆయన చెప్పారు. స్థానిక పార్టీ నేతలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పానని, ఆ తరువాత ప్రభుత్వం నుంచి ఒక కాంట్రాక్టు పని దక్కడంతో కొండా సురేఖ చేరిక అంశం అక్కడితో ఆగిపోయిందని అన్నారు. ప్రస్తుతానికి ఆ ప్రస్తావన లేదన్నారు. పార్టీలోని ప్రతీ అంశంపై రాహుల్‌ గాంధీ సునిశితంగా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నారని చెప్పారు.  

జగదీశ్‌రెడ్డి పోటీ చేసినా ఇబ్బంది లేదు  
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 119 మంది బలమైన అభ్యర్థులు ఉన్నారని, కచ్చితంగా అధికారంలోకి వస్తామని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనపై టీఆర్‌ఎస్‌ దృష్టిని కేంద్రీకరిస్తుందని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డిని పోటీకి పెట్టినా తనకు ఇబ్బందిలేదన్నారు. గతంలో జగదీశ్‌రెడ్డి తనపై పోటీచేసి 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, మరోసారి పోటీచేసినా అదే పరిస్థితి పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.   

రేవంత్‌ పదవిని రాహుల్‌ నిర్ణయిస్తారు
రేవంత్‌రెడ్డికి పార్టీలో సముచితస్థానం ఉంటుందన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంటా లేదా ప్రచార కమిటీ చైర్మనా అనేది రాహుల్‌ గాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్‌ చెప్పారు. రాహుల్‌ గాంధీ ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, ఏఐసీసీ పూర్తిస్థాయి కమిటీ, టీపీసీసీల పునర్వ్యవస్థీకరణ వంటివి జరుగుతాయన్నారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు.

రాహుల్‌ గాంధీతో భారీ బహిరంగసభను వరంగల్‌లో ఈ నెల 19 లేదా 20న నిర్వహిస్తామన్నారు. 2003లో సోనియా గాంధీతో వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో సభను నిర్వహించామని, ఆ తరువాత పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ సెంటిమెంటుతోనే అదే మైదానంలో రాహుల్‌ గాంధీతో సభను నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గర్జనగా వరంగల్‌ సభను నిర్వహిస్తామని చెప్పారు. వరంగల్‌ సభకు ముందుగానే కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు.

పర్యావరణాన్ని విధ్వంసం చేస్తోంది
♦ ప్రభుత్వంపై ఉత్తమ్‌ ఫైర్‌
♦ రుణమాఫీపై సీఎం రైతులను మోసగిస్తున్నారని ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ చట్టాలను పట్టించుకోకుండా పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. పీసీసీ కిసాన్‌సెల్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి «అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన కిసాన్‌సెల్‌ విస్తృతస్థాయి సమావేశం లో ఆయన మాట్లాడుతూ సాగు ప్రాజెక్టులు, సెజ్‌లకోసం ప్రభుత్వం తీసుకుంటున్న భూముల విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులను తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమె త్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మా సిటీ వంటివాటిలో పర్యావరణ నిబంధనలు పాటించకుండానే పనులు చేస్తున్నారని విమర్శించారు. తాము అభివృద్ధికి అడ్డుకాదని, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సమగ్ర పాజెక్టు నివేదికలు పూర్తి చేయకుండానే పనులు చేయడం చట్టాల ఉల్లంఘన కాదా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

రుణమాఫీ విషయంలో సీఎం  పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రైతులను మోసగిస్తున్నారని విమర్శించారు. రుణ మాఫీ ఒకేసారి చేయకుండా, రైతులను అప్పుల ఊబిలోకి దించారన్నారు. వడ్డీమాఫీ చేయకుండా కుంటిసాకులతో మోసగిస్తున్నా రని, దీనిపై పోరాడతామన్నారు. ఇదిలా ఉండగా రంగారెడ్డి జిల్లాకు చెందిన టీడీపీ, ఇతర పార్టీల నుంచి దాదాపు 200 మంది నేతలు ఉత్తమ్, షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఉత్తమ్‌తో మంద కృష్ణ భేటీ
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చిన మంద కృష్ణ దాదాపు గంటకుపైగా ఉత్తమ్‌తో సమావేశమయ్యారు. ఎస్సీల వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ఉత్తమ్‌ని కోరినట్టుగా మంద కృష్ణ వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top