‘మహా’ సీఎం ఉద్ధవ్‌!

Uddhav Thackeray will be Maharashtra’s Chief Minister - Sakshi

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్పష్టీకరణ

ఈ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీ, సేనల్లో ఏకాభిప్రాయం ఉందని వెల్లడి

మూడు పార్టీల మధ్య నేడు కూడా కొనసాగనున్న చర్చలు

న్యూఢిల్లీ/ సాక్షి, ముంబై: మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే సస్పెన్స్‌ వీడింది. శివసేన నేతృత్వంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందన్న స్పష్టత వచ్చినప్పటికీ.. శివసేన తరఫున ముఖ్యమంత్రి ఎవరవుతారనే విషయంలో ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేనా? లేక ఆయన కుమారుడు, తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే సీఎం అవుతారా? అనే విషయంలో శుక్రవారం వరకు సందిగ్ధత నెలకొంది.

కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మధ్య ముంబైలో శుక్రవారం జరిగిన చర్చల అనంతరం ఆ సందిగ్ధతకు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ తెర దించారు. సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రేనే ఉంటారని స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ మూడు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని వెల్లడించారు. ‘సంకీర్ణ ప్రభుత్వ నేత ఎవరనే విషయం పెండింగ్‌లో లేదు. ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంపై ఏకాభిప్రాయం ఉంది’ అన్నారు. ఈ మూడు పార్టీల మధ్య చర్చలు నేడు(శనివారం) కూడా కొనసాగనున్నాయి.

చర్చల ప్రక్రియ శుక్రవారం ముగుస్తుందని, ఆ తరువాత  సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ మూడు పార్టీలు కలిసి అధికారిక ప్రకటన చేస్తాయని తొలుత అంతా భావించారు. కానీ చర్చించాల్సిన విషయాలు కొన్ని ఉన్నందున, మూడు పార్టీల నేతల భేటీ శనివారం కూడా కొనసాగుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ తెలిపారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అనేక విషయాల్లో ఒక అంగీకారానికి వచ్చామని చర్చల్లో పాల్గొన్న  కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

ముంబైలోని నెహ్రూ సెంటర్‌లో జరిగిన ఈ చర్చల్లో శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రేలతో పాటు.. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే, సంజయ్‌ రౌత్, సుభాష్‌ దేశాయి, కాంగ్రెస్‌ నుంచి అహ్మద్‌ పటేల్, మల్లిఖార్జున్‌ ఖర్గే, కేసీ వేణుగోపాల్, అవినాశ్‌ పాండే, బాలాసాహెబ్‌ తోరట్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌ పటేల్, జయంత్‌ పాటిల్, అజిత్‌ పవార్‌ పాల్గొన్నారు. చర్చలు సంతృప్తికరంగా జరిగాయని, త్వరలో వివరాలు మీడియాకు వివరిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పారు.

ఉద్ధవ్‌ ఠాక్రేనే సీఎం అవుతారని శరద్‌ పవార్‌ చెప్పారని శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండేతో విలేకరులు ప్రస్తావించగా.. ‘ఆ విషయం ఈ రోజు చర్చల్లో ప్రస్తావనకు రాలేదు’ అని తెలిపారు. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నికయిన విషయం తెలిసిందే. కాగా, ఉద్ధవ్‌ ఠాక్రేనే సీఎం కావాలని పవార్‌ పట్టుబడుతున్నారని ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ చెప్పారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఉద్ధవ్‌ ఠాక్రేనే అన్నారు. చర్చల అనంతరం సంజయ్‌ రౌత్, సుభాష్‌ దేశాయి, ఆదిత్య ఠాక్రేలతో శివాజీ పార్క్‌లోని మేయర్స్‌ బంగళాలో ఉద్ధవ్‌  సమావేశమయ్యారు.

మిత్రపక్షాలతో కాంగ్రెస్‌– ఎన్సీపీ భేటీ
శివసేనతో చర్చలకు ముందు..  మిత్రపక్షాల నేతలతో కాంగ్రెస్‌– ఎన్సీపీ నాయకులు చర్చలు జరిపారు. సమాజ్‌వాదీ పార్టీ, సీపీఎం, స్వాభిమాన్‌ ప„Š , పీజంట్స్‌ వర్కర్స్‌ పార్టీ, జనతాదళ్‌ తదితర పార్టీల ప్రతినిధులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ‘శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మా మిత్రపక్షాలు ఆమోదం తెలిపాయి’ అని ఆ తరువాత ఎన్సీపీ నేత జయంత్‌పాటిల్‌ తెలిపారు. కాంగ్రెస్, ఎన్సీపీ, ఇతర మిత్ర పక్షాలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ) ముసాయిదాను రూపొందించా యని, దీనిపై పార్టీల అగ్ర నేతలు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్‌ చౌహాన్‌ వెల్లడించారు.  ‘మా మద్దతు కావాలంటే శివసేన కొన్ని విధానాలను మార్చుకోవాల్సి ఉంటుంది. మతవాదాన్ని నిర్మూలించేందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. దళితులు, మైనారిటీలు, రైతులకు అనుకూలంగా  ప్రభుత్వం ఉండాలి’ అని ఎస్పీ నేత అబూ అజ్మీ స్పష్టం చేశారు.

ఇంద్ర పదవి ఇస్తామన్నా..
బీజేపీతో మళ్లీ పొత్తుకు అవకాశాలు లేవని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు. ‘ఇంద్రుడి సింహాసనం ఇస్తామన్నా బీజేపీకి మద్దతివ్వం’ అని స్పష్టం చేశారు. శివసేనతో పొత్తుకు బీజేపీ మళ్లీ ప్రయత్నిస్తోందన్న వార్తలపై ఆయన పై విధంగా స్పందించారు.

అవకాశవాద పొత్తు: బీజేపీ
కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల పొత్తు అవకాశవాద రాజకీయమని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ విమర్శించారు. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకే సైద్ధాంతిక విభేదాలున్నప్పటికీ.. ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. వారి ప్రభుత్వం ఆర్నెల్లు మించి సాగదన్నారు. 

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top