కారు.. సూపర్‌ జోరు!

TRS at top in the Election Campaign - Sakshi

     ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌

     ప్రత్యర్థి పార్టీల కంటే ఒక అడుగు ముందే

     అక్టోబర్‌ 9లోపు పూర్తికానున్న తొలి దశ ప్రచారం

     ప్రకటించని అభ్యర్థులపైనా పార్టీ అధినేత కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అందకుండా ముందంజలో ఉంటోంది. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించిన అధినేత కేసీఆర్‌ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పడకముందే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాన్ని పూర్తి చేసేలా కేసీఆర్‌ ప్రణాళిక రూపొందించారు. అభ్యర్థు లు నియోజకవర్గాల్లో ప్రచారంలో ఉండాలని ఆదేశిం చారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ప్రచార తీరుపై రోజూ సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచార సరళిపై సమాచారం సేకరించేందుకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేశారు. పలు అంశాలపై రోజువారీ  నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఆయా అభ్యర్థులకు అవసరమైన ప్రచార వ్యూహాన్ని సూచిస్తున్నారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ బతుకమ్మ పండుగ (అక్టోబర్‌ 9) లోపు ఓ దశ ప్రచారాన్ని పూర్తి చేయాలని అభ్యర్థులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో టీఆర్‌ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పూర్తిగా పాల్గొం టారని కేసీఆర్‌ భావిస్తున్నారు. బహిరంగ సభల వేది కగా అభ్యర్థులను ప్రజలకు మరోసారి పరిచయం చేయనున్నారు. నాలుగేళ్ల పాలనలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించనున్నారు. మరోసారి టీఆర్‌ఎస్‌ను దీవించాలని కోరనున్నారు. ఉమ్మడి జిల్లా బహిరంగసభలను దసరాలోపు పూర్తి చేసే అవకాశం ఉంది. అనంతరం కొత్త జిల్లాల కేంద్రాల్లో, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

మిగిలిన స్థానాల పరిస్థితి..
- మేడ్చల్‌ అసెంబ్లీ టికెట్‌ ప్రస్తుత ఎంపీ మల్లారెడ్డికి ఖరారైంది. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సింగరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్‌ టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.
మల్కాజిగిరి టికెట్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావుకు ఖరారైంది. తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి తన కోడలు విజయశాంతికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. 
దానం నాగేందర్‌కు గోషామహల్‌ టికెట్‌ ఖరారైంది. తనకు ఖైరతాబాద్‌ టికెట్‌ కావాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్‌కు పలుసార్లు చెప్పా రు. కేసీఆర్‌ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఖైరతాబాద్‌ టికెట్‌ పీజేఆర్‌ కూతురు విజయారెడ్డికి ఖరారైంది. దానంకు ఖైరతాబాద్‌ టికెటిస్తే గోషామహల్‌లో నందకిశోర్‌ బిలాల్‌కు అవకాశం దక్కనుంది.
వరంగల్‌ తూర్పు నియోజకవర్గం తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ కాంగ్రెస్‌లో చేరారు. గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక నాయకుడు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ గుండు సుధారాణి, తూర్పు టికెట్‌కై ప్రయత్నిస్తున్నారు. కొండా సురేఖ కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉంటే ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది.
ముషీరాబాద్‌ అభ్యర్థిగా ముఠా గోపాల్‌ పేరు దాదాపు ఖరారైంది. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడి టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ముఠా గోపాల్‌ వైపు మొగ్గు చూపుతోంది. 
అంబర్‌పేట టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గడ్డం సాయికిరణ్, కాలేరు వెంకటేశ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు.
వికారాబాద్‌ అభ్యర్థిత్వం కోసం టి.విజయ్‌కుమార్, ఎస్‌.ఆనంద్‌ పోటీ పడుతున్నారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు కోరుతున్నారు.
హుజూర్‌నగర్‌లో నల్లగొండ ఎంపీ సుఖేందర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి శంకరమ్మ, శానంపూడి సైదిరెడ్డిలలో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించనుంది.
కోదాడలో నియోజకవర్గ ఇన్‌చార్జి కె.శశిధర్‌రెడ్డి, వేనేపల్లి చందర్‌రావు, చందర్‌రావు కూతురు టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేరును పరిశీలిస్తోంది.
చొప్పదండిలో టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ పేరును టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తోంది. తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 
జహీరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మాణిక్‌రావు, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. 
చార్మినార్, మలక్‌పేటలో ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా ఉన్న ముఖీద్‌చంద్, చవ్వా సతీశ్, అజంఅలీ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

సభలకు ముందే పెండింగ్‌ జాబితా..
అభ్యర్థులను ప్రకటించని 14 స్థానాల్లో సరైన అభ్యర్థుల ఎంపిక కోసం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించే బహిరంగసభల్లోపే పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరో మూడు రోజుల్లో వీరి పేర్లను సైతం వెల్లడించనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల కూటమిలోని అభ్యర్థుల సామాజిక వర్గాల లెక్కలకు అనుగుణంగా అభ్యర్థులను ప్రకటించే పరిస్థితి ఉంటే టీఆర్‌ఎస్‌ పెండింగ్‌ జాబితా ఆలస్యం కానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top