అష్టదిగ్బంధం

Trs Party Strategy to revanth reddy - Sakshi

రేవంత్‌ అనుయాయులపై టీఆర్‌ఎస్‌ దృష్టి

నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలందరినీ లాగేసిన వైనం

తాజాగా కాంగ్రెస్‌లోని అసంతృప్తులకు వల

ఇప్పటికే కారెక్కిన కాంగ్రెస్‌ కీలక నేత సలీం, మద్దూరు మండల అధ్యక్షుడు హన్మిరెడ్డి

నేడు కోస్గిలో రేవంత్‌ ‘కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనం’

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చుట్టూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహం పన్నుతోంది. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ను బలహీనం చేసేందుకు అధికార పార్టీ సామభేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీకి చెందిన ముఖ్యమైన నేతలకు గాలం వేసి గులాబీ కండువా కప్పేసింది. దీంతో ఆపరేషన్‌ టీడీపీ విజయవంతం కావడంతో.. కాంగ్రెస్‌పై దృష్టి సారించింది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించిన జిల్లా అధికార ప్రతినిధి సలీం పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. తనతో పాటు ముఖ్యమైన నేతలను కూడా కారెక్కించేశారు. ఇలా నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన ముఖ్యనేతలు రేవంత్‌ను కాదని పక్క చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ బుధవారం కోస్గి పట్టణంలో నిర్వహించతలపెట్టిన ‘కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనం’ ఆసక్తికరంగా మారింది.

ఉక్కిరిబిక్కిరి
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రచిస్తున్న వ్యూహాలకు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా రేవంత్‌ వెంట సొంత జిల్లా పాలమూరు ప్రాంతానికి చెందిన నేతలెవరూ వెళ్లలేదు. ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన లిస్టులో కొందరు టీడీపీ నేతలున్నట్లు ప్రచారం జరిగినా వారెవరూ పార్టీని వీడలేదు. పైగా రేవంత్‌ వెంట నడిచేది లేదంటూ ప్రకటనలు ఇచ్చారు. ఇది ఆయనకు మైనస్‌గా మారింది. ఇలాంటి పరిణామాలు ఓవైపు రేవంత్‌ను వెంటాడుతుండగా.. సొంత నియోజకవర్గ నేతలు ఆయనకు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇన్నాళ్లు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆయన వెంట నడిచిన వారు సైతం ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు.

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీడీపీకి చెందిన ముఖ్యమైన వారందరూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అంతేకాదు రేవంత్‌ చేరిన కాంగ్రెస్‌ నుంచి కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. కొడంగల్‌ నియోజకవర్గంలో అత్యంత కీలక నేతగా పేరొందిన జిల్లా అధికార ప్రతినిధి సలీం సైతం రేవంత్‌ చేరికను జీర్ణించుకోలేక పార్టీ మారారు. ఆయనతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాల నేతలను కూడా కారెక్కించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అందుకు అనుగుణంగా మద్దూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు హన్మిరెడ్డితో పాటు ఇతర నేతలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ప్రకటించారు.  

సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
కోస్గి: పట్టణంలోని పంచాక్షరి ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం జరగనున్న కాంగ్రెస్‌ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి కోరారు. ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, సంపత్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి గెలవాలని టీడీపీ నేతలపై చేసిన సవాల్‌పై ఆయన స్పందిస్తూ.. బీ–ఫాం ఇచ్చిన పార్టీ అధినేతకే స్పీకర్‌ ఫార్మాట్‌లో రేవంత్‌రెడ్డి రాజీనామ లేఖ ఇచ్చారని.. అధినేతే రాజీనామాను ఆమోదించాల్సి ఉందని తెలిపారు. కాగా, పార్టీ మారిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న రేవంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అనుచరులు భారీ ఏర్పాట్లు చేస్తుండగా తిరుపతిరెడ్డి పరిశీలించారు. సమావేశంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వార్ల విజయ్‌ కుమార్, నాయకులు రాఘవరెడ్డి, నరేందర్, రఘువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top