వచ్చే ఆరు నెలలు ఎన్నికలే..

TRS chief KCR comments with new MLAs - Sakshi

పంచాయతీపై పక్కాగా ఉండాలి 

లోక్‌సభలో సత్తా చాటాలి 

కొత్త ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా వచ్చే ఎన్నికలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఎమ్మెల్యేలు ప్రత్యేక ప్రణాళికతో అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ వారే గెలిచేలా చూసుకోవాలన్నారు. తర్వాత సహకార, లోక్‌సభ ఎన్నికలు వస్తాయని... అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. వచ్చే ఆరు నెలలపాటు వరుసగా జరగనున్న అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేయాలని ఆదేశించారు. కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగింది.

టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత ఎన్నికకు ముందు కేసీఆర్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజలు మనకు మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రం సాధించినందుకు 2014లో అధికారం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన సాగించినందుకు మళ్లీ పెద్ద మెజారిటీతో గెలిపించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మనం నిబద్ధతలో పని చేయాలి. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తతో ఉండాలి. ఇంటింటికీ నల్లా నీళ్లు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ పథకం చేపట్టాం. ఇది పూర్తి కాకుండా ఓట్లు అడగవద్దని ప్రకటించాం. అయితే ప్రతిపక్షాల తీరుతో ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఏప్రిల్‌ 30 లోపు మిషన్‌భగీరథ పనులు పూర్తి కావాలి. ఈ పనులపై దృష్టి సారించాలి. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి’అని అన్నారు.  

‘పంచాయతీ’ని సవాల్‌ తీసుకోండి... 
‘అసెంబ్లీ ఎన్నికల్లో మనకు భారీ మెజారిటీ వచ్చింది. వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎమ్మెల్యేలుగా మీకు మొదట పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. వీటిని సవాల్‌గా తీసుకోవాలి. మీ ఎన్నికలుగా భావించి పార్టీ శ్రేణులను గెలిపించేలా చేయాలి. పంచాయతీ ఎన్నికలు ముగియగానే సహకార ఎన్నికలు ఉంటాయి. వాటిలోనూ మన ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలి. అనంతరం లోక్‌సభ ఎన్నికలొస్తాయి. దేశ రాజయకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ఈ ఎన్నికలు మనకు సవాల్‌ లాంటివి. రాష్ట్రంలోని 16 లోక్‌సభ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకునేలా పని చేయాలి. అందరం సమష్టిగా పని చేసి దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ బలం నిరూపించుకోవాలి. లోక్‌సభ ఎన్నికల తర్వాత గడువు ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు కూడా మనకు కీలకమే. ఇలా వరుసగా ఆరు నెలలపాటు ఎన్నికలే ఉంటాయి. అన్నింటిలోనూ కలసి పనిచేయాలి. పార్టీని విజయపథంలో నడిపించాలి.

టీఆర్‌ఎస్‌ కార్యాలయాలను అన్ని జిల్లాల్లో సత్వరంగా పూర్తి చేయాలి. 15 రోజుల్లో ఈ పనులు మొదలవ్వాలి. 4 నెల ల్లో పూర్తి చేయాలి. ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని వీలైనంత త్వరగా వీటి నిర్మాణం జరిగేలా చూడాలి. లోక్‌సభ ఎన్నికల్లోపు అన్ని జిల్లాల్లోనూ మన పార్టీ సొంత కార్యాలయాల నుంచి వ్యవహారాలు కొనసాగాలి. టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టండి. అలా అయితే అన్ని ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు సులువు అవుతుంది. కొత్త ప్రభుత్వంలో ప్రజల కోసం మరింత మేలు చేసేలా పాలన చేద్దాం. అధికారం రాగానే ఎవరూ లేనివి తెచ్చి పెట్టుకోవద్దు. అందరితో మునిపటిలాగే ఉండాలి. ముఖ్యంగా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారి జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓటమి మన పార్టీ నేతల స్వయంకృతాపరాధం. సొంత పార్టీ నేతల వైఖరితోనే పార్టీ ఓడిపోయింది.

ఒకరి తల ఒకరు నరుక్కుందామనుకున్నారు. అందరు తెగిపడ్డారు. ఇలాంటివి మన పార్టీ సంస్కృతి కాదు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి నిధుల విధానాన్ని మారుద్దాం. అందరినీ ఒకేలా చూసి ప్రతిపక్ష పార్టీల వారికి సమానంగా నిధులు ఇస్తే విమర్శలు చేశారు. ఇన్‌చార్జీ మంత్రుల ఆధ్వర్యంలోనే ఈ నిధులు ఉండేలా మారుద్దాం. అభివృద్ధి నిధుల విషయంలో ఎవరికీ అపోహలు వద్దు. సమన్వయంతో పని చేయండి’’అని సీఎం కేసీఆర్‌ అన్నారు.  

పార్లమెంటరీ పార్టీ భేటీ... 
టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ సమావేశం గురువారం సాయంత్రం 5కి ప్రగతిభవన్‌లో జరగనుంది. కేసీఆర్‌ అధ్యక్షతన అందరు ఎంపీలతో ఈ భేటీ జరుగుతుంది. లోక్‌సభ శీతాకాల సమావేశాల్లో టీఆర్‌ఎస్‌ అనురించే వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2కి తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఎన్నికల్లో విజయం కోసం పని చేసిన నేపథ్యంలో కేసీఆర్‌ ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహకవర్గ బాధ్యులకు కృతజ్ఞతలు తెలపనున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top