ఎవరి ధీమా.. వారిదే!

TRS And Congress Parties Target MLC Elections - Sakshi

ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అస్త్రశస్త్రాలు

పోటాపోటీగా క్యాంప్‌లు నిర్వహించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు

శిబిరాల నుంచి నేడు జిల్లాకు రానున్న సభ్యులు

ఇక్కడి నుంచి రేపు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు

క్యాంపుల్లోనే సభ్యులకు మాక్‌ పోలింగ్‌ నిర్వహణ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విజయంపై ఎవరి ధీమా వారికి ఉన్నా ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా అత్యంత జాగ్రత్త వహిస్తున్నాయి. పోలింగ్‌కు ఒక్క రోజే సమయం ఉండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే సభ్యులను శిబిరాలను తరలించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు వారిని గురువారం జిల్లాకు తీసుకొచ్చేందుకు   ఏర్పాట్లు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ సవాల్‌గా తీసుకుంది. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అస్త్రశస్త్రాలను సంధిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనుభవంతో ఆ పార్టీ నాయకులు మరింత సీరియస్‌గా పనిచేస్తున్నారు. స్వల్ప మెజార్టీతో చేవెళ్ల లోక్‌సభ స్థానం దక్కడాన్ని అనుభవ పాఠంగా తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితులు ఎమ్మెల్సీ ఎన్నికలో రాకుండా, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రణాళికను అమలు చేస్తున్నారు. అధికార పార్టీ తమ చేతిలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని చెబుతున్నప్పటికీ ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకుండా జాగ్రత్తపడుతోంది.

ఎమ్మెల్యేలకు బాధ్యతలు
చాలా మంది ప్రాదేశిక సభ్యులను టీఆర్‌ఎస్‌ పార్టీ బెంగళూరులో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు తరలించిన విషయం తెలిసిందే. నియోజకవర్గాల వారీగా మొత్తం పదిచోట్ల శిబిరాలు నిర్వహించి సభ్యులకు ఆతిథ్యం ఇచ్చినట్లు సమాచారం. వీరందరినీ గురువారం రాత్రి జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. జిల్లాకు చేరుకోగానే నగర శివారుల్లోని హోటళ్లు, రిసార్టులకు తరలించనున్నట్లు సమాచారం. అక్కడ విశ్రాంతి తీసుకున్నాక శుక్రవారం ఉదయం పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్తారని వినికిడి. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటు హక్కు వినియోగించుకునే సభ్యులను.. ఆయా ప్రాంతాలకు తరలించే బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక.. కాంగ్రెస్‌ కూడా అధికార పార్టీకి దీటుగా క్యాంప్‌లను నిర్వహిస్తోంది. పార్టీ గెలుపు కోసం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ శిబిరంలోని సభ్యులు గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం జిల్లాకు చేరుకుంటారని తెలిసింది.  

తటస్థ సభ్యులపై గురి
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌యేతర పార్టీల సభ్యులు, స్వతంత్ర సభ్యుల సంఖ్య భారీగానే ఉంది. వీరందరిపై అధికార పార్టీ, విపక్ష కాంగ్రెస్‌ గురి పెట్టాయి. ఓటుహక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య 812. ఇందులో 592 మంది ఎంపీటీసీలు, 33 మంది జెడ్పీటీసీలు ఉండగా.. వీరిలో సాంకేతికంగా టీఆర్‌ఎస్‌ చేతిలో 153 మంది, కాంగ్రెస్‌ సభ్యులు 233 మంది ఉన్నారు. వీరితోపాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పోగా.. మిగిలిన వారంతా టీడీపీ, బీజేపీ, ఇతర చిన్నా చితక పార్టీలు, స్వతంత్ర కలిపి 239 మంది ఉంటారు. వీరందరినీ తమవైపు తిప్పుకుంనేందుకు ఇరు పార్టీలు శాయశక్తులు ప్రయత్నించాయి. ఇటీవల కొంత మంది పార్టీలు మారినా.. ఓటు మాత్రం చేజారకుండా జాగ్రత్తలు వహిస్తున్నాయి. సభ్యుల డిమాండ్‌ మేరకు వారికి ‘లబ్ధి’ చేకూర్చేందుకు వెనకాడడం లేదు. అయితే చివరికి ఎవరికి ఓటు వేస్తారో చూడాలి.

మాక్‌ పోలింగ్‌ పూర్తి
దాదాపు వారం రోజుల పాటు శిబిరాల్లో ఉన్న సభ్యులు విందుతో పాటు వినోదాన్ని ఆస్వాదించారు. ఇదే సమయంలో వారికి పోలింగ్‌పై అవగాహన కల్పించడానికి మాక్‌ పోలింగ్‌ నిర్వహించినట్లు తెలిసింది. ఇరు పార్టీల శిబిరాల్లో ఈ శిక్షణ కొనసాగింది. సాధారణ పోలింగ్‌తో పోల్చితే ఎమ్మెల్సీ పోలింగ్‌ విధానం భిన్నంగా ఉంటుంది. బ్యాలెట్‌ పేపర్లపై నిర్దిష్ట విధానంలో అంకెలు వేస్తేనే అవి చెల్లుబాటవుతాయి. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఓటు వృథా అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించిన అభ్యర్థులు మాక్‌ పోలింగ్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top