ఫైనల్‌ టీమ్‌

TRS And BJP Announce Candidates in Lok Sabha Election - Sakshi

లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్, బీజేపీ

గులాబీ సైన్యం  హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమ ప్రచార అస్త్రాలంటున్న అభ్యర్థులు

గ్రేటర్‌లో అందరూ కొత్తవారే..

సాక్షి,సిటీబ్యూరో: లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. మహానగరం పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల స్థానాలకు గులాబీ బాస్, సీఎం కేసీఆర్‌ గురువారం అభ్యర్థులను ప్రకటించారు. వారికి బీ–ఫారాలను సైతం అందజేశారు. సికింద్రాబాద్‌ స్థానానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ యాదవ్, హైదరాబాద్‌ సెగ్మెంట్‌కు పుస్తె శ్రీకాంత్, మల్కాజిగిరికి మర్రి రాజశేఖర్‌రెడ్డి, చేవెళ్లకు డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. రాజకీయ నేపథ్యం, గెలుపు గుర్రాలే ప్రాతిపదికగా టికెట్ల కేటాయింపు జరిగినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్‌ అభ్యర్థి సాయికిరణ్‌ మంత్రి తలసాని కుమారుడు   కావడం.. మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌కు జంటనగరాల్లో మాస్‌ ఫాలోయింగ్‌ ఉండడంతో ఆయనకు టికెట్‌ దక్కేందుకు కలిసి వచ్చింది. హైదరాబాద్‌ సెగ్మెంట్‌కు పుస్తె శ్రీకాంత్‌ను పార్టీ అధిష్టానం పేరు ప్రకటించడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పురానాపూల్‌లోని శ్రీకాంత్‌ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మల్కాజ్‌గిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డికి మంత్రి మల్లారెడ్డి సమీప బంధువుకావడంతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్‌ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయడం, పార్టీ కేడర్‌కు నిరంతరం అందుబాటులో ఉండడం వంటి అంశాలు కలిసి వచ్చాయి.

చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి సైతం రెండు దశాబ్దాలుగా గుర్తింపు పొందిన పారిశ్రామికవేత్తగా, వేలాదిమందికి ఉపాధి కల్పించడంతో పాటు సామాజిక సేవలందించిన వ్యక్తిగా మంచి పేరుంది. ఆయన రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు. టీఆర్‌ఎస్‌ పార్టీ టికెట్లు దక్కిన నేతలు మంచి ముహూర్తం చూసుకొని నేడో,రేపో నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరు ముగ్గురికి టీఆర్‌ఎస్‌ లోక్‌సభ టికెట్లు దాదాపుగా ఖరారవుతాయని గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా కొన్ని పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ.. అందరి అంచనాలకు తగ్గట్టుగానే అభ్యర్థుల ఎంపిక జరగడం విశేషం. అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటనతో మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న మహానగర లోక్‌సభ ఎన్నికల రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారనుంది.  ఇటీవల నియోజకవర్గ సన్నాహక సమావేశాలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పార్టీ నేతలు, కేడర్‌లో జోష్‌ నింపారు. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టంతో ఎన్నికల ప్రచారాలు, అగ్రనేతల రోడ్‌షోలు, బహిరంగ సభలు, ర్యాలీలతో గులాబీ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు తమ వైపే ఉన్నారని.. మహానగరం పరిధిలోని ఈ మూడు స్థానాల్లో తమ విజయం నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ నేతలు ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. ప్రస్తుతం తమ దృష్టి మెజార్టీ పైనేనంటున్నారు.

సికింద్రాబాద్‌ అభ్యర్థి
పేరు: తలసాని సాయికిరణ్‌ యాదవ్‌
తల్లిదండ్రులు: తలసాని శ్రీనివాస్‌యాదవ్, స్వర్ణ యాదవ్‌ (తండ్రి సనత్‌నగర్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి)
పుట్టిన తేదీ: మే 13, 1986  
విద్య: ఎంబీఏ (ఆస్ట్రేలియా)
సోషల్‌ యాక్టివిటిస్‌: ఆశాకిరణ్‌ ఫౌండేషన్‌ తరుఫున అనాథలకు చేయూత, లైంగిక దాడుల్లోని బాధితులకు షెల్టర్‌ కల్పించి వారు స్వతంత్రంగా జీవించేందుకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ అందిస్తున్నారు. తలసాని సాయి సేవాదళ్‌ పేరుతో అన్నదానం, ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ  
రాజకీయ ప్రవేశం: 2014లో తన తండ్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రికి మద్దతుగా ప్రచారం.  

హైదరాబాద్‌  అభ్యర్థి
పేరు: పుస్తె శ్రీకాంత్‌
విద్యార్హత: బీకామ్, ఎల్‌ఎల్‌బీ
కుటుంబం: భార్య, ఇద్దరు కుమారులు
నివాసం: పురానాపూల్, చార్మినార్‌
రాజకీయ నేపథ్యం: 1990లో రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ చార్మినార్‌ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా, పురానాపూల్‌ డివిజన్‌ టీడీపీ అధ్యక్షుడిగా, నగర టీడీపీ బీసీసెల్‌ ఉపాధ్యక్షుడిగా, టీడీపీ నగర ఉపాధ్యక్షుడిగాను బాధ్యతలు నిర్వహించారు.  
∙2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడాదికి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. నాలుగేళ్లుగా పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు.  
కుటుంబ నేపథ్యం: శ్రీకాంత్‌ తండ్రి పుస్తె బాబూరావు గతంలో టీడీపీ తరఫున చార్మినార్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తల్లి ఉమాదేవి కూడా పురానాపూల్‌ డివిజన్‌ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

మల్కాజిగిరి అభ్యర్థి
అభ్యర్థి: మర్రి రాజశేఖరరెడ్డి
పుట్టిన తేదీ: 17.09.1969  
విద్యాభ్యాసం: బీకామ్‌
తల్లిదండ్రులు: మర్రి అరుంధతి,మర్రి లక్ష్మణ్‌రెడ్డి
భార్య: మమత
సంతానం: ధీరన్‌రెడ్డి, శ్రేయారెడ్డి
నివాసం: ఫ్లాట్‌ నెంబర్‌ 48, సౌజన్య కాలనీ, బోయిన్‌పల్లి
కంటోన్మెంట్‌: మర్రి లక్ష్మణ్‌రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి మర్రి రాజశేఖరరెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో బోయిన్‌పల్లి వ్యాప్తంగా గురువారం ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. మల్కాజిగిరి మాజీ ఎంపీ, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడిగా నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులైన రాజశేఖరరెడ్డి గత ఐదేళ్లుగా ప్రత్యక్ష, పరోక్షంగా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మామ మల్లారెడ్డికి దన్నుగా ఉండే రాజశేఖరరెడ్డికి మల్కాజిగిరి వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గత పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మల్లారెడ్డి గెలుపునకు ఆయన విశేష కృషి చేశారు. మర్రి లక్ష్మణ్‌రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శిగా ఐదు ఇంజినీరింగ్‌ కాలేజీలు, వర్ధమాన్, సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనూ వ్యాపార భాగస్వామిగా కొనసాగుతున్నారు. సెయింట్‌ మార్టిన్స్, సీఎంఆర్‌ స్కూల్స్‌ నిర్వహణ బాధ్యతలు కూడా ఈయనే నిర్వర్తిస్తున్నారు.

చేవెళ్ల అభ్యర్థి
పేరు:డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి
తల్లిదండ్రులు: జి. రాజిరెడ్డి(లేట్‌), చంద్రకళ
పుట్టినతేది:18–9–1964
భార్య: సీత,
పిల్లలు: పూజ ఆకాంక్ష, రాజ్‌ ఆర్యన్‌రెడ్డి
స్వస్థలం: వరంగల్‌
విద్యార్హతలు: బీవీఎస్సీ,ఎంవీఎస్సీ
(రాజేంద్రనగర్‌ వ్యవసాయవిశ్వవిద్యాలయం)
అనుభవం: ఎస్‌ఆర్‌ హ్యాచరీస్‌ అధినేత, సామాజిక సేవ చేసిన వ్యక్తిగా గుర్తింపు
చేవెళ్లతో అనుబంధం: గత 35 ఏళ్లుగా అనేక పౌల్ట్రీ పరిశ్రమలు స్థాపించి వేలాదిమందికి ఉపాధి కల్పించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top