వేగమందుకున్న కాంగ్రెస్‌ కమిటీల కసరత్తు

Training of Congress Committees - Sakshi

ఢిల్లీ పెద్దలకు జాబితా అందజేసిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌

 ప్రచార కమిటీకి భట్టి, మేనిఫెస్టో కమిటీకి రేవంత్‌ పేర్లు సిఫారసు

డీకే అరుణ, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహ, వీహెచ్, పొన్నాలకు కమిటీల్లో కీలక బాధ్యతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు స్పష్టంగా కనబడుతుండటంతో వేగం పెంచిన కాంగ్రెస్‌ పార్టీ, వివిధ కమిటీలను భర్తీ చేసే ప్రక్రియ చేపడుతోంది. ఇప్పటికే అధిష్టానం సూచనల మేరకు పలుదఫాలుగా వడపోతల అనంతరం తుది జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాను గురువారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలకు అందజేశారు. గురువారం ఢిల్లీ పర్యటనకు ఒకరోజు ముందే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, రాష్ట్ర పరిశీలకులు బోసురాజు, సలీమ్‌ అహ్మద్, శ్రీనివాస్‌కృష్ణన్‌లతో ఓ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యి సమన్వయ, ప్రణాళిక, వ్యూహరచన కమిటీ, అభ్యర్థుల వడపోత కమిటీకి ఎవరెవరిని నియమించాలన్న పేర్లపై చర్చించారు. అరవై మంది సీనియర్‌ నేతలకు వివిధ కమిటీల్లో అవకాశం కల్పించేలా జాబితా రూపొందించారు.

శుక్రవారం నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మానస సరోవర్‌యాత్రకు వెళ్లనున్న నేపథ్యంలో గురువారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన కుంతియా, ఉత్తమ్‌లు జాబితాను అధిష్టాన పెద్దలకు అందజేశారు. ప్రాథమిక సమాచారం మేరకు ప్రచార కమిటీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీకి రేవంత్‌రెడ్డి పేర్లను సిపార్సు చేసినట్లుగా సమాచారం. ఇందులో మేనిఫెస్టో, ప్రచార కమిటీల్లో డీకే అరుణ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు వంటి వారికి ప్రాధాన్యం ఇవ్వనుండగా, సమన్వయ, ప్రణాళిక, వ్యూహరచన కమిటీల చైర్మన్లుగా దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బలరాం నాయక్, వి.హన్మంతరావు, గీతారెడ్డి, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి తదితరుల పేర్లున్నట్టు ప్రచారం జరుగుతోంది.

వీరిలో ఏ పదవులకు ఎవరిని సూచించారో వెల్లడవ్వలేదు. దీంతో తమకు సముచిత ప్రాధాన్యమివ్వాలంటూ సీనియర్లు మళ్లీ ఢిల్లీ బాట పట్టే అవకాశం ఉంది. అయితే అభ్యర్థుల ఎంపిక కమిటీకి మాత్రం ఇంకా ఎవరి పేర్లను సూచించలేదని తెలుస్తోంది. అత్యంత ముఖ్యమైన కమిటీ అయినందున దీనిపై అన్ని వర్గాలతో చర్చించి తుది నిర్ణయానికి రావాలనే భావనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

త్వరలోనే కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటు: ఉత్తమ్‌
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో త్వరలోనే కార్యవర్గ, అనుబంధ, ప్రచార, మేనిఫెస్టో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ఇదే విషయమై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి గురువారం ఢిల్లీలో పార్టీ ముఖ్యులతో సమావేశమై చర్చించారు. ముఖ్యంగా ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాతో కలసి కొన్ని పేర్లను అధిష్టానానికి ప్రతిపాదించినట్టు తెలిసింది.

ఇక ముందస్తు ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులు ఉండాలా? వద్దా? అన్న విషయాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టనున్న ప్రగతి నివేదన సభకు దీటుగా మరో సభ ఏర్పాటు చేయడం, దానికి సోనియా గాంధీని ఆహ్వానించడంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. కమిటీల నియామకంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమావేశం అనంతరం ఉత్తమ్‌ తెలిపారు. మరోవైపు ప్రచార కమిటీ బాధ్యతలను ఇతరులకు అప్పగించారని వస్తున్న వార్తలను ఏఐసీసీ కార్యదర్శి వీహెచ్‌ ఖండించారు. ప్రచార కమిటీ బాధ్యతలను తనకు అప్పగించకపోతే కఠిన నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top