ఆధారాలతో వస్తా.. చర్చకు సిద్ధమేనా?

TJR Sudhakar Babu Challenge to Chandrababu Naidu - Sakshi

చంద్రబాబు, లోకేశ్‌కు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సవాల్‌

సాక్షి, అమరావతి:  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై వ్యక్తిగత ద్వేషంతో కుట్ర పన్ని సోషల్‌ మీడియాలో చంద్రబాబు, లోకేష్‌ విషప్రచారం చేయించారని ఆధారాలతో నిరూపిస్తానని, వారిది తప్పని తేలితే పెదబాబు, చినబాబు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా? అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు సవాలు  విసిరారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని నందమూరి బాలకృష్ణకు సంబంధించిన భవనంలో 2వేల మందిని నియమించుకుని సోషల్‌ మీడియాలో పదేపదే సీఎం వైఎస్‌ జగన్‌పైన, ఆయన కుటుంబసభ్యులు విజయమ్మ, భారతమ్మ, షర్మిలమ్మలపై కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టించింది చంద్రబాబేనని వాస్తవాలతోసహా నిరూపిస్తానన్నారు. దీనిపై చర్చకు రావాలని చంద్రబాబుకు ఆయన సవాలు విసిరారు. నాలుగు రోజుల గడువిస్తున్నానని, చంద్రబాబు చెప్పిన ప్రదేశానికి వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు.

స్థాయి తగదనుకుంటే తన కుమారుడు లోకేశ్‌ను పంపించాలన్నారు. తప్పు జరిగిందని తేలితే చంద్రబాబు, లోకేశ్‌ రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. సోషల్‌ మీడియాలోని పోస్టింగ్‌లపై చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి అసభ్యకరమైన పదాలు చదువుతుంటే ప్రజలు చెవులు మూసుకుంటున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవమని చెప్పిన చంద్రబాబు మహిళలను కించపరిచేలా ఉన్న పదాలను ఎలా పలికారన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టుందని, ఒకసారి డాక్టర్లకు చూపించుకోవాలని సుధాకర్‌బాబు సూచించారు. ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడడం, కొడుకు చేతగానివాడు కావడం, వయస్సు మీద పడడంతో మానసిక స్థితి దెబ్బతిని ఉండొచ్చన్నారు. గతంలో ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లిచేసుకున్నాడనే అక్కసుతో తన అనుకూల పత్రికా దన్నుతో ఎన్టీఆర్‌ను వెంటాడి, మానసిక క్షోభ పెట్టి చంపిన వ్యక్తి చంద్రబాబు అనేది బహిరంగ రహస్యమన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ను సైతం చంద్రబాబు వదల్లేదన్నారు. షర్మిలమ్మపై సోషల్‌ మీడియాలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు నైతికత ఏమైందని ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top