ఈ పరిహారం సరిపోదయ్యా.. 

Titli Cyclone affected farmers says their problems to YS Jagan - Sakshi

ఎకరాకు రూ.లక్ష విలువైన పంట చేతికొచ్చేది.. ప్రభుత్వం రూ.12 వేలే ఇస్తోంది 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన తిత్లీ తుపాను బాధిత రైతులు 

హుద్‌హుద్‌ వచ్చినప్పడు అసలే పట్టించుకోలేదు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి బృందం, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘రైతు ప్రభుత్వం అని చెబుతూనే మమ్మల్ని మోసం చేస్తున్నారన్నా.. పరిహారం పంపిణీలోనూ అన్యాయం చేశారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో తిత్లీ తుపాన్‌ బీభత్సం సృష్టించింది. వరి, అరటి పంటలు పూర్తిగా పాడయ్యాయి. వరి పంట సాగు చేసుకోవాలంటే ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతుంది. పరిహారం పంపిణీ చేసేందుకు సర్వే కూడా సక్రమంగా చేయలేదు. చాలా మంది నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. రికార్డుల్లో భూముల వివరాల్లేక మరి కొంత మంది రైతులు పరిహారం అందుకోలేకపోయారు. గతంలో హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఏమాత్రం స్పందించని ప్రభుత్వం.. నేడు  మీరొస్తున్నారని, మీరు నిలదీస్తారని భయపడి హడావుడిగా పరిహారం పంపిణీ చేసింది. ఎకరాకు రూ.12 వేలు మాత్రమే ఇచ్చారు.

ఈ పరిహారం మాకు ఏమాత్రం సరిపోదు’ అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ రైతులు వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 301వ రోజు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పాదయాత్ర సాగించారు. ఇటీవల తిత్లీ తుపాన్‌ రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాతో పాటు, విజయనగరం జిల్లా రైతులు కూడా తుపాన్‌ తాకిడికి తీవ్రంగా నష్టపోయారు. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. పంటలు కోల్పోయిన వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో గిజబ గ్రామానికి పాదయాత్రగా వచ్చిన జననేత వద్ద మాజీ సర్పంచ్‌ మరడాన సీతం నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఎం శంకరరావు, స్థానిక రైతులు వారి కష్టాలు ఏకరువుపెట్టారు.

గ్రామ శివారులోని రోడ్డు పక్కన తిత్లీ తుపాన్‌ కారణంగా పడిపోయిన అరటి పంటను చూడగానే, జననేత రోడ్డు దిగి అరటి తోటను పరిశీలించేందుకు వెళ్లారు. స్థానిక రైతులు వెంటనే పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. బాధిత రైతుల పట్ల సర్కారు వ్యవహరించిన తీరును వారు జననేతకు వివరించారు. ‘అయ్యా.. అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు సుమారు రూ.లక్ష ఆదాయం రావాల్సిన తోట పడిపోతే.. ప్రభుత్వం కేవలం ఎకరాకు రూ.12 వేలు మాత్రమే ఇచ్చింది. కనీసం రూ.25 వేలైనా ఇవ్వాలి. పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రాలేదు. దీంతో అప్పులపాలయ్యాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కష్టాలను ఓపికగా విన్న జగన్‌.. ధైర్యంగా ఉండాలని, ఈ ప్రభుత్వం న్యాయం చేయకపోతే మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  

ఊరూరా సమస్యలే..: ‘తోటపల్లి ప్రాజెక్టు పక్కనే ఉన్నా పొలాలకు సాగునీరు రావడం లేదు. గిజబ, బాసంగి, సింగనాపురం, కుదమ గ్రామాల రైతులం సాగునీరు లేక అవస్థలు పడుతున్నాం. ఈ గ్రామాలకు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసేందుకు మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రణాళికలు రచించారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఆ ప్రణాళికలను  కావాలనే అటకెక్కించింది. ఆదుకోవాలని ఎన్నిమార్లు కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. మీరు అధికారంలోకి రాగానే న్యాయం చేయాలి’ అని పలువురు రైతులు జననేతను కోరారు. తమ భూములను ఇళ్ల స్థలాల కోసం తీసుకుని పరిహారం ఇవ్వలేదని నందివానివలసకు చెందిన రెడ్డి లక్ష్మణ, గుళ్లు శివన్నాయుడు కుమారులు, సీతంనాయుడు తదితరులు వాపోయారు.   

జననేతకు జైకొట్టిన గిరిజనం 
గిరిజన ఖిల్లా కురుపాం ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ పట్ల ప్రజాభిమానం ఉవ్వెత్తున ఎగసి పడింది. పాదయాత్రలో దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు, యువకులు జగన్‌ను కలుసుకోవడానికి రావడంతో దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. ఈ నియోజకవర్గంలో సవర, జాతాపు, కొండదొర, గదబ జాతి ఏజెన్సీ గిరిజనులతో పాటు మైదాన ప్రాంత గిరిజనులు, తూర్పు కాపు, కొప్పుల వెలమ వంటి బీసీ కులాల వారు అధికం. గిరిజన సేవా సంఘం ప్రతినిధులు, సామాన్య గిరిజనులు జననేతను కలుసుకుని సమస్యలు చెప్పుకున్నారు. నాలుగున్నరేళ్లుగా గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా అన్యాయం చేసి, కేవలం నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఇప్పుడు స్థానం కల్పించడం వల్ల ఒరిగేదేమీ ఉండదన్నారు. అది కూడా ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడమేమిటని వారు ప్రశ్నించారు. మైదాన ప్రాంత గిరిజనుల సంక్షేమాన్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని వాపోయారు. జగన్‌ పాదయాత్ర దాదాపు రోజంతా తోటపల్లి రిజర్వాయర్‌ సమీప ప్రాంతంలోనే సాగింది. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి తాము భూములిచ్చినప్పటికీ సరైన పరిహారం ఇవ్వలేదని పలువురు రైతులు జగన్‌కు వివరించారు. కాగా, అరకు నియోజకవర్గంలోని అరకువ్యాలీ, హుకుంపేట, అనంతగిరి మండలాల్లోని టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి, వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.  

పంటంతా పోయినా పరిహారం రాలేదయ్యా.. 
అయ్యా.. మాది కొమరాడ మండలం తొడుం. నాగావళి నదికి భారీ వరదల కారణంగా రెండేళ్లుగా నా ఐదెకరాల భూమిలో పంట కొట్టుకుపోయింది. భూమి ఇసుక దిబ్బలుగా మారింది. వ్యవసాయం చేసుకునేందుకు ఎందుకూ పనికి రాకుండా పోయింది. ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం అందించలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తిననే కారణంతో నాపై కక్ష కట్టారు. అధికారులు కూడా టీడీపీ నాయకులు చెప్పిందే వింటున్నారు. మీరు అధికారంలోకి రాగానే నాలోంటళ్లందరికీ న్యాయం చేస్తారని నమ్ముతున్నాం.   
– చింతల సంగంనాయుడు, మాజీ సర్పంచ్‌ 

ఈ వంతెన ఎప్పుడు పూర్తి చేస్తారో.. 
అన్నా.. పూర్ణపాడు, లాబేసు గ్రామాల మధ్య దశాబ్ధాల కాలంగా వంతెన సమస్య ఉంది. మా నియోజకవర్గ నాయకులు ఎన్నికల సమయంలో వంతెన నిర్మాణానికి హామీలు ఇస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మరిచిపోతున్నారు. 2015లో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.9.98కోట్లు మంజూరు చేశారు. ఓ కాంట్రాక్టర్‌ రూ.7.82 కోట్లకు పనులు దక్కించుకున్నారు. 2017 జూన్‌ నెలాఖరుకు వంతెన నిర్మించి ఇస్తానన్నారు. ఇప్పటి వరకు 60 శాతం పనులు మాత్రమే అయ్యాయి. ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్‌కు రూ.6.38 కోట్లు చెల్లించింది. వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరాడ మండల కేంద్రానికి వెళ్లాలంటే వర్షం వస్తే 52 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. 
– డప్పుకోట అశోక్‌కుమార్, తులసివలస, కొమరాడ మండలం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top