రాజకీయ చదరంగం.. ఆధ్యాత్మిక నగరం

Tirupati Politics History From 1955 to 2015 - Sakshi

అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గంగా తిరుపతి

శ్రీవారి చెంత నుంచే ఎన్నికల ఏర్పాట్లకు నేతల ఆసక్తి

సినీ ఉద్దండులు సైతం ఇక్కడి నుంచే గెలుపొందిన వైనం

ఈసారి తిరునగరిలో పాగా వేసేదెవరో ?

ఆధ్యాత్మిక నగరమైన తిరునగరి..శ్రీవేంకటేశ్వరుడి సన్నిధి కావడంతో పాటు రాజకీయాలకు ప్రధాన వేదికగా మారింది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరునగరి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మక ప్రాంతం కావడంతో రాజకీయాలు వాడీవేడిగా ఉంటాయి. ఇద్దరు సినీ ఉద్దండులు నందమూరి తారక రామారావు, చిరంజీవి రాజకీయ పార్టీలను స్థాపించడంతో పాటు వారి రాజకీయ ప్రస్థానాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టారు. అందులో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో ఆధ్యాత్మికతతో పాటు రాజకీయంగా తిరునగరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి.

చిత్తూరు, తిరుపతి తుడా : భక్తి పారవశ్యంతో నిండి.. పర్యాటక ప్రాంతంగా ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన తిరుపతి పట్టణం రాజకీయాలకూ ప్రధాన వేదికంగా నిలుస్తోంది. మొత్తం 27.44 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న తిరునగరిలో జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మూడుసార్లు ఉప ఎన్నికలు ఇక్కడే జరిగాయి. 1955లో ఏర్పడిన తిరుపతి నియోజకరవ్గం ఎప్పుడూ ప్రత్యేకతలతో అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, ఆరుసార్లు టీడీపీ, రెండుసార్లు పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ ఒకసారి గెలిచింది.

తిరునగరిలో పాగా వేసేదెవరో ?
రాష్ట్రంలో ప్రముఖ నగరమైన తిరుపతిలో రాజకీయాలు ఈసారి పాగా వేసేదెవరో అని జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. పార్టీలను పక్కన పెడితే ఆ పార్టీ ప్రకటించిన నవరత్నాలు గానీ, సీనియర్‌ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన తనయుడు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్తున్నారు. దీనికి తోడు నగర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

టీడీపీకి ఎదరుగాలి..
తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ సౌమ్యురాలనే పేరున్నా ఆమె అల్లుడే పెద్ద శాపంగా మారారు. పార్టీలో సీనియర్లను ఇబ్బందులకు గురి చేశారనే అపవాదును మూటగట్టుకున్నారు. నామినేటెడ్‌ పదవులు రాకుండా అడ్డుకోవడం, ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం చేయించారని పార్టీ వర్గాలే చెబు తున్నాయి. అల్లుడి వేధింపులు తట్టుకోలేక ఇటీవల సుగుణమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ నేతలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. అయినా పార్టీ పెద్దలు సుగుణమ్మ వైపు మొగ్గు చూపడంతో ముఖ్య నేతలంతా పార్టీని వీడుతున్నారు.  

అసెంబ్లీ విశేషాలు..
తిరుపతికి చెందిన ప్రముఖ విద్యవేత్త అగరాల ఈశ్వర్‌రెడ్డి 1967లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
1978లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి గెలుపొంది శాసన సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
తిరుపతి నుంచే సినీ నటుడు నందమూరి తారక రామారావు తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలెట్టారు. 1982లో టీడీపీని స్థాపించారు. ఆయన 1983 ఎన్నికల్లో తిరుపతి నుంచే మొదటిసారి పోటీ చేసి గెలిచారు. ఆపై ముఖ్యమంత్రి పీఠంపై కొలువుదీరారు. అదే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన తిరుపతి స్థానానికి రాజీనామా చేయడంతో తొలిసారి ఉప ఎన్నిక జరిగింది.
1983లో ఎన్‌టీఆర్‌పై అగరాల ఈశ్వరరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
2009లో తిరుపతి వేదికగా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచే మొదటిసారి పోటీ చేసి గెలిచారు.
అదే ఎన్నికల్లో చిరంజీవి అత్తగారి ఊరైన పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. కొంత కాలానికి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడంతో మరోసారి తిరుపతిలో ఉపఎన్నిక జరిగింది.
ఆ ఎన్నికల్లో భూమన కరుణాకర్‌రెడ్డి గెలుపొందారు.
2014లో టీడీపీ తరఫున గెలిచిన ఎం.వెంకట రమణ మొదటి ఏడాదే మృతి చెందడంతో మూడోసారి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉండడంతో ఆయన సతీమణి సుగుణమ్మ పోటీ చేసి గెలుపొందారు. ఎన్‌టీఆర్, చిరంజీవి రాజీనామాల కారణంగా రెండుసార్లు, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మృతి చెందడంతో ఒకసారి మొత్తం మూడుసార్లు ఉప ఎన్నికలు జరిగాయి.

ఇప్పటి దాకా ఎన్నికైన ఎమ్మెల్యేలు
1955లో    క్రిషికర్‌ లోక్‌పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డివారి నాథమునిరెడ్డి  సీపీఐ అభ్యర్థి కే.కృష్ణారెడ్డిపై 22,297 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
1962లో     ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డివారి నాథమునిరెడ్డి స్వతంత్ర అభ్యర్థి అగరాల ఈశ్వరరెడ్డిపై 4,993 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
1967లో     స్వతంత్రపార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అగరాల ఈశ్వర్‌రెడ్డి ఇండియన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జీఆర్‌ పాండ్రవేటిపై 34,226 ఓట్లతో విజయం సాధించారు.
1972లో    ఇండియన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి శిఖామణి స్వతంత్ర అభ్యర్థి పి.మునిరెడ్డిపై 14,833 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
1978లో    ఇండియన్‌ కాంగ్రెస్‌ ఐ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అగరాల ఈశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థి గురవారెడ్డిపై 1,927 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
1983లో    టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఎన్టీ రామారావు ఇండియన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అగరాల ఈశ్వరరెడ్డిపై 46,879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
1983లో    గెలిచిన తరువాత 1983లోనే మళ్లీ ఉప ఎన్నిక జరిగింది. టీడీపీ అభ్యర్థిగా కత్తుల శ్యామలమ్మ కాంగ్రెస్‌ అభ్య ర్థి రెడ్డివారి రాజశేఖరరెడ్డి మీద విజయం సాధించారు.
1985లో    కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మబ్బురామిరెడ్డి టీడీపీ అభ్యర్థి గురవారెడ్డిపై 2,867 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
1989లో    కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మబ్బురామిరెడ్డి టీడీపీ అభ్యర్థి కోలా రాముపై 19,343 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
1994లో    టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఏ.మోహన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మబ్బురామిరెడ్డిపై 34,595 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
1999లో    టీడీపీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.వెంకటరమణపై 13,082 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2004లో    కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.వెంకటరమణ టీడీపీ అభ్యర్థి ఎన్వీ ప్రసాద్‌పై 39,095 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2009లో    ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన కె.చిరంజీవి(సినీనటుడు) కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్‌ రెడ్డిపై 15,930 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2012    ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.వెంకటరమణపై 17,975 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2014లో    టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.వెంకటరమణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిపై 41,539 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
2015లో    టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఎం. సుగుణమ్మ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శ్రీదేవిపై గెలుపొందారు.

1955– 2015  వరకు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు

అగరాల ఈశ్వర్‌రెడ్డి
ఎన్‌టీ రామారావు
మబ్బురామిరెడ్డి
ఏ మోహన్‌
చదలవాడ కృష్ణమూర్తి
ఎం వెంకటరమణ
చిరంజీవి
భూమన కరుణాకర్‌రెడ్డి
ఎం సుగుణమ్మ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top