‘మూడు’పై మమత మంత్రాంగం

Time for NDA government to pack up and go said by Mamata Banerjee - Sakshi

ఢిల్లీలో ఫ్రంట్‌ ఏర్పాటుపై   విపక్ష పార్టీల నేతలతో వరుస చర్చలు

బీజేపీని సాగనంపేందుకు సరైన సమయం: మమత

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించడమే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ రాజధానిలో పావులు కదుపుతున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేలా మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె మంగళవారం వివిధ పార్టీల నేతలతో వరుసగా చర్చలు జరిపారు.

బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్‌ ఏర్పాటును టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు కోరుతుంటే.. బీజేపీయే లక్ష్యంగా ముందుకెళ్లాలని మమత యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తో సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. సైద్ధాంతికంగా కలిసివచ్చే పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు సీనియర్‌ నాయకుడైన పవార్‌ కీలక పాత్ర పోషించాలని మమత కోరినట్లు తెలుస్తోంది.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌ సరైన రాజకీయ వ్యూహాలు అనుసరించేలా ఆ పార్టీపై ఒత్తిడి తేవాలని కూడా సూచించినట్లు సమాచారం. కాంగ్రెస్‌ నేత అశ్వినీ కుమార్, బీజేడీ నేత అనుభవ్‌ మొహంతీ, డీఎంకేకి చెందిన కనిమొళి, శివసేనకు చెందిన సంజయ్‌ రావత్, టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌ రెడ్డి, కవిత, కె.ప్రభాకర్‌ రెడ్డి, బాల్క సుమన్‌లతో మమతా బెనర్జీ భేటీ అయ్యారు.

సమాజ్‌వాదీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఆర్జేడీ నాయకురాలు మీసా భారతిని కలసి రాజకీయ పరిణామాలపై చర్చించారు. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మమత కలవాల్సి ఉన్నా ఆమె అనారోగ్యంతో ఉండడం వల్ల కుదరలేదు. బీజేపీ తిరుగుబాటు నేతలు శత్రుఘ్నసిన్హా, యశ్వంత్‌సిన్హా, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ శౌరీలను కూడా కలవనున్నారు.  

విపక్షాలు కలిసికట్టుగా పనిచేయాలి: మమత  
పార్టీల నేతలతో చర్చల అనంతరం ఆమె మాట్లాడుతూ.. నోట్ల రద్దు, బ్యాంకింగ్‌ కుంభకోణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, బీజేపీని సాగనంపేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. యూపీలో బీజేపీని ఓడించేందుకు ఎస్పీ, బీఎస్పీలు ఏకమవడాన్ని ప్రశంసించారు.

బీజేపీ ఓటమే లక్ష్యం
బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటుకు ముందు.. ఆయా పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకునే లక్ష్యంగానే మమతా బెనర్జీ ఢిల్లీ పర్యటన సాగింది. బీజేపీ, కాంగ్రెసేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై ఈ నెల 20న కోల్‌కతాలో మమతతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ చర్చించిన సంగతి తెలిసిందే. మూడో ఫ్రంట్‌ ఏర్పాటులో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సమదూరం పాటించాలని కేసీఆర్‌ భావిస్తుండగా.. తృణమూల్‌ మాత్రం బీజేపీయే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

బీజేపీని ఓడించాలంటే కూటమికి కాంగ్రెస్‌ సహకారం ఉండాలనే ఆలోచనలో తృణమూల్‌ ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సీనియర్‌ ఎన్సీపీ నేత ఒకరు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రమేయం లేని ఫ్రంట్‌వైపే మమత మొగ్గుచూపుతున్నారని చెప్పారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మమత సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top