ఆందోళనలు..బుజ్జగింపులు

Tickets Issue In Congress Party - Sakshi

పార్టీలకు తలనొప్పిగా మారిన రెబల్స్‌

రంగంలోకి దిగిన అధిష్టానం

టికెట్‌ ఇవ్వాల్సిందేనంటూ పట్టు.. లేదంటే జంపింగ్‌లు

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఎన్నికల బరిలో నిలిపేందుకు తమ అభ్యర్థులను కొన్ని నియోజకవర్గాలు మినహా ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఆయా పార్టీల పెద్దలు తిరుగుబాటు దారులను బుజ్జిగించే యత్నాలు చేస్తున్నారు. అయితే తిరుగుబాటుదారులు తమకు టికెట్‌ కేటాయించాల్సిందేనని పట్టుబట్టడంతో పెద్దలకు తలనొప్పిగా మారారు. మరికొందరు పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఏమిటి ఆంతర్యం ఈయన పేరు తిప్పేస్వామి, మొళకాల్మూరు నుంచి బీజేపీ టికెట్‌ ఆశించిన ఈయనకు ఆ పార్టీ టికెట్‌ నిరాకరించడంతో మంగళవారం మైసూరులో సీఎం సిద్ధును కలవడానికి వచ్చిన దృశ్యం  

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఊరించి ఊరించి గత ఆదివారం రాత్రి 218 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే మరో 20 మంది ఆశావహులు తమకు టికెట్‌ రాలేదని ఆందోళనకు దిగారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం బీజేపీ 82 మంది అభ్యర్థులతో రెండోజాబితా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశించి నిరాశ చెందిన కమలనాథులు కూడా ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతికూల వాతావరణానికి దారి తీయకుండా ఉండేందుకు తిరుగుబాటుదారులకు సర్దిచెప్పేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.

కాంగ్రెస్‌ కల ఫలించేనా?
వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధించి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్‌ ఆశించి భంగపడ్డ వారికి అధికారంలోకి రాగానే ఉన్నత పదవులు కేటాయిస్తామని ఆశ చూపుతున్నారు. అయితే తాము ఎన్నికల బరిలోనే దిగుతామని తిరుగుబాటుదారులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తిరుగుబాటు దారులకు బుజ్జగింపులు చేస్తున్నారు. తిపటూరు నుంచి షడక్షరీ, కరికెరె నుంచి హెచ్‌జీ శ్రీనివాస్, మాయకొండ నుంచి శ్రీనివాసమూర్తి నాయక్, బ్యాడిగె నుంచి బసవరాజు నీలన్న శివన్న నవార్, ఆనేకల్‌ నుంచి మనోహర్‌ తహశీల్దార్, జగలూరు నుంచి రాజేష్, సిరిగుప్ప నుంచి బీఎం నాగరాజు కొల్లెగళ నుంచి జయన్న, కల్బుర్గి నుంచి బి.రామకృష్ణ టికెట్‌ ఆశించి భంగపడ్డ వారిలో ఉన్నారు. వారందరు రెండు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద, పలు ప్రాంతాల్లో రోడ్లపై బైఠాయించి ఆందోళన చేశారు. మరికొందరు సీఎం సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి ఆయనను కలిసి టికెట్‌ అభ్యర్థించారు. ఇంకొందరు రెబల్‌ అభ్యర్థులుగా బరిలో దిగుతామని హెచ్చరించారు. కాగా సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్‌ మాత్రం రెబల్‌ అభ్యర్థులుగా బరిలోకి దిగరాదని సూచించారు. పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

కమలంలోనూ అదే తీరు..
భారతీయ జనతా పార్టీ వారం రోజుల తేడాతో రెండు విడతల్లో మొత్తం 154 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను కేటాయించాల్సి ఉంది. అయితే టికెట్‌ రాని వారు ఇప్పటికే అమిత్‌షా, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఎస్‌ యడ్డూరప్ప నివాసానికి చేరుకుని మంతనాలు జరిపారు. కాగా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుబాటుదారులు బరిలో ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయని కమల పెద్దలు భావించి రెబల్స్‌ను బుజ్జగించే యత్నాలు చేస్తున్నారు.

పార్టీ మారే ఆలోచనలో..
కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు జేడీఎస్‌తో సన్నిహితంగా ఉన్నారని సమాచారం. ఒకవేళ జేడీఎస్‌ టికెట్‌ ఇస్తే కాంగ్రెస్, బీజేపీకి స్వస్తి పలికేందుకు కూడా పలువురు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ నుంచి తుమకూరు నగరానికి చెందిన సొగడు శివన్న, మొలబాగిలి మాజీ ఎమ్మెల్యే ఎ.నారాయణస్వామి, గదగ్‌ నుంచి శ్రీశైలప్ప జేడీఎస్‌ వైపు చూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్‌కు చెందిన ఎంవై గోపాలకృష్ణ బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top