అవిశ్వాసంతో ఉపయోగం లేదు

There is no use with no confidence motion says chandrababu - Sakshi

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, విజయవాడ: అవిశ్వాసం వల్ల ఉపయోగం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన సోమవారం పోలవరం పర్యటనకు వచ్చిన సందర్భంగా విలేకరులతోనూ... విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన  ‘మాదిగ మహాసభ’లో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ అవిశ్వాసంపై స్పందించారు. ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌  అవిశ్వాస తీర్మానానికి సిద్ధం అన్నారు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేస్తూ.. అవిశ్వాస తీర్మానం పెట్టాలనడానికి జగన్‌కి తలాతోక లేదని విమర్శించారు. అవిశ్వాస తీర్మానం పెట్టడం చిట్టచివరి చర్యగా ఉండాలన్నారు. మనకు 54 మంది ఎంపీలు ఉంటే తప్ప అవిశ్వాసం పెట్టలేమని, అలాంటప్పుడు అవసరమైతే కొన్నిపార్టీ  ఎంపీల సహకారం తీసుకుని న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాడాలని చెప్పారు.

పోరాడి సాధించుకోవాలి తప్ప, ఈ సమయంలో రాజీనామాలు చేసి వస్తే, పార్లమెంట్‌లో పోరాడే వ్యక్తులు కూడా ఉండరన్నారు. అవిశ్వాస తీర్మానం చేస్తే మెజార్టీ ఎవరికి ఉందో తెలుసుకోవాలనీ, మెజార్టీ ఉన్నాక అవిశ్వాసం పెడితే ఆరునెలలు ఆ విషయంపై అసలు మాట్లాడే అవకాశమే ఉండదన్నారు. తాను లీడ్‌ తీసుకుంటాననీ దీనికి ప్రతిపక్షం సహకరించాలని కోరారు. అంతేకానీ నేను వస్తాను... మీరు నా వెనుక రండి అనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

రాష్ట్రానికి కేంద్రం ఎంతో మేలు చేసిందని, ఎన్నో నిధులను ఇచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారనీ, అయితే విభజన సమయంలో పార్లమెంటులోనూ, రాజ్యసభలోనూ ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేసిందా? అని ప్రశ్నించారు. అలాగని జాతీయ పార్టీ బీజేపీని వదిలేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడిన విధంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రధాని రాష్ట్రం వస్తే ఫలితం ఉండదని, ప్రజలు ఇంకా ఎక్కువ అపార్థం చేసుకుంటారని చెప్పారు. త్వరలో ప్రత్యేక హోదా కోసం పనిచేస్తున్న అందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top