దేశం కోసం ఓటేయండి

There Is No PM Candidates In Congress And TRS Says K Laxman - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశానికి సుస్థిరాభివృద్ధి

తెలంగాణకు ఎవరూ ఇవ్వనన్ని నిధులు బీజేపీ ఇచ్చింది

కేంద్ర పథకాలపై కేసీఆర్‌ తన ముద్ర వేసుకున్నారు

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే మోదీ ఎజెండా

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కూటమికి ప్రధాని అభ్యర్థే లేరు

పూర్వం అసురులు కూడా యజ్ఞాలు చేశారు.. అంతమాత్రాన వాళ్లు మంచోళ్లా?

కుటుంబ పాలన కావాలో.. అభివృద్ధి కావాలో.. ప్రజలకు అర్థమైంది

మోదీ కోసం ఓటెయ్యాలి.. 17 చోట్ల గెలిపించాలి

‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌  

సాక్షి, హైదరాబాద్‌ : లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు వేసే ప్రతి ఓటు దేశం కోసమేనని, దేశ అభ్యున్నతి, సుస్థిర అభివృద్ధి ని కాంక్షించి ప్రజలంతా నరేంద్రమోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నిలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికలు సీఎం కోసమైతే, దేశ ప్రధాని కోసం జరిగేవి లోక్‌సభ ఎన్నికలు అన్న విషయంపై ప్రజల్లో సంపూర్ణ స్పష్టత వచ్చిందన్నా రు. కాంగ్రెస్‌ పార్టీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదని, ఈఎన్నికల్లో ప్రజలంతా మోదీవైపే ఉన్నారన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది చెప్పుకోలేని స్థితిలో ఉన్న పార్టీల ఎంపీలు గెలిచి సాధించేదేమీ ఉండదని లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 17 స్థానాలపై దృష్టి సారించి గెలిచేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్న కె.లక్ష్మణ్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..

సాక్షి: ఎన్నికల ప్రణాళిక ఏంటి? ఎలా ముందుకెళ్తున్నారు?
లక్ష్మణ్‌: దేశవ్యాప్తంగా మోదీకి అనుకూలంగా గాలి వీస్తోంది. ఇది తెలంగాణ అతీతం కాదు. ‘దేశం కోసం మోదీ.. మోదీ కోసం ప్రజలు’అనే ఆలోచనతో ప్రజలు స్పష్టంగా ఉన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు లోకసభ ఎన్నికలు. దేశ ప్రధానిని ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు. మొన్న జరిగినవి అసెంబ్లీ ఎన్నికలు. స్థానిక అంశాల ఆధారంగా.. ముఖ్యమంత్రి ఎవరుండాలనే అంశంపై జరిగిన ఎన్నికలు. కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఉంటాయి. ఈసారి వ్యూహాత్మకంగా సీట్ల సంఖ్యను పెంచుకుంటాం. ఓట్ల శాతాన్ని పెంచుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలిచాం. 7.5% మాత్రమే ఓట్లు వచ్చాయి. కాబట్టి ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళతాం. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యామ్నాయంగా బీజేపీని తీర్చిదిద్దుతాం. కాంగ్రెస్‌ పట్ల భ్రమలు తొలగిపోయాయి. అది పూర్తిగా క్షీణించిపోయింది. దేశంలో, రాష్ట్రంలో బతికి బట్టకట్టలేని పరిస్థితి. ప్రతిపక్ష పార్టీగా మొన్న గెలిపించినా అధికార గులాబీ పార్టీ కండువాలు కప్పుకున్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ 2023 లక్ష్యంగా ముందుకు వెళతాం.

సాక్షి: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడ్డారు. ఇప్పుడెలా గెలుస్తారని భావిస్తున్నారు?
లక్ష్మణ్‌: అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం జరిగిన ఎన్నికలు. పార్లమెంటు ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మా ముందు సరితూగలేనని భావించే.. కేసీఆర్‌ చాకచక్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. నిజంగా ఇప్పుడు రెండు ఒకేసారి జరిగితే 20–25 సీట్లు గెలిచే వాళ్లం. మోదీ చరిష్మా, 5ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధి, పనితీరు, తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలు, పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమాలు, రైతులకు పెట్టుబడి సాయం, వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి తీసుకున్న చర్యలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారికి ఆదాయపన్ను మినహాయింపు రెట్టింపు చేయడం, ఉద్యోగులకు, మధ్యతరగతి వారికి న్యాయం చేయడం, అసంఘితరంగ కార్మికులకు రూ.3వేల బోనస్‌ పథకం, ఎస్సీ, ఎస్టీ బీసీలకు వారికి నష్టం వాటిల్లకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించడం వంటి అంశాలన్నీ ప్రభావితం చేస్తాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేయడం వల్ల కేసీఆర్‌ బయట పడ్డారు. కేసీఆర్‌ చాకచక్యంగా ముందుకెళ్లారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో చంద్రబాబు పెత్తనం చెలాయించబోతున్నారు.. అందుకోసం మళ్లీ వస్తున్నారు అని చెప్పి ఓట్లు పొందారు. టీఆర్‌ఎస్‌ అవినీతి, కుటుంబ పాలన, రైతు వ్యతిరేక పోకడలు, నియంతృత్వ విధానాలను మేము ప్రచారంలో ప్రజల్లోకి తీసుకొస్తే.. ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్‌.. తెలంగాణ అస్తిత్వం అంశాన్ని ప్రజల్లోకి తెచ్చి ఓట్లు పొందారు. కానీ ఇపుడు పరిస్థితి అలా కాదు. ఈ ఎన్నికలు దేశం కోసం. సమర్థ నాయకుడు, సుస్థిర ప్రభుత్వం, సర్జికల్‌ దాడులు ప్రజలను ప్రభావితం చేశాయి. ప్రజలు దీటైన నాయకుడు ఉండాలని కోరుకుంటున్నారు. మా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ. మీ అభ్యర్థి ఎవరు? కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్నారు. కనీసం ఎంపీగా పోటీ చేయకుండా ప్రధాని ఎలా అవుతారు? ఆ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే చూసి నవ్వుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయరు? పోనీ మీ ప్రధాని అభ్యర్థి ఓవైసీనా, మాయావతినా, మమతా బెనర్జీనా? రాహుల్‌ గాంధీకి తోకపార్టీనా..? ఇక తోక పార్టీ రాజకీయాలు నడవవు. బలమైన పార్టీగా ప్రజలు బీజేపీని గుర్తించారు. బీజేపీకి పనితీరే ప్రధానం. ప్రజలు మావైపే మొగ్గు చూపుతారు.

సాక్షి: కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్న అపవాదును ఎలా అధిగమిస్తారు?
లక్ష్మణ్‌: సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. కేంద్ర పథకాలకు గులాబీరంగు వేస్తున్నారు. కేంద్రం రూ.29 సబ్సిడీ ఇస్తుంటే రెండు రూపాయలు జోడించి రూపాయికి కిలో బియ్యం పథకం నాదే అని చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నారు. రూ.45 వేల కోట్ల జాతీయ రహదారులు, ఏయిమ్స్, ట్రైబల్‌ యూనివర్సిటీ, రైల్వేస్‌ ఇలా అనేక కార్యక్రమాలకు రాష్ట్రానికి రూ.2.30 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం 5ఏళ్లలో ఇచ్చింది. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం కింద రూ.1.15 లక్షల కోట్ల నిధులను నేరుగా కేంద్రం ఇచ్చింది. 70ఏళ్లలో ఇన్ని నిధులు రాష్ట్రానికి ఎప్పడూ రాలేదు. ఇంత అభివృద్ధి జరుగలేదు. నరేంద్రమోదీ ఇచ్చారు. కేసీఆర్‌ కేంద్రమంత్రిగా యూపీఏలో ఉన్నపుడు కూడా ఇన్ని నిధులు తేలేదు. నేను చర్చకు సిద్ధం. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం. ఆ ప్రభుత్వానికి అనుబంధంగా ఉండే బీజేపీ ఎంపీలు ఇక్కడ గెలిస్తే తెలంగాణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. నిధులు రాబట్టడానికి, పథకాలు తేవడానికి, అభివృద్ధి చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇపుడు మాట్లాడుతున్న బుల్లెట్‌ ట్రైన్‌ రావాలంటే బీజేపీ ఎంపీలు గెలువాలి.

టీఆర్‌ఎస్‌ ఎంపీలు గెలిస్తే ఆ కుటుంబానికి బానిసలుగా మారుతున్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ప్రజలకు జవాబుదారీ కాదు. రాష్ట్రానికి జవాబుదారీ కాదు. ఒక కుటుంబానికి జవాబుదారీగా ఉంటున్నారు. బానిసలుగా మారుతున్నారు. ఇదే టీఆర్‌ఎస్‌ పార్టీలో అసలైన పరిస్థితి. కానీ కేటీఆర్‌ విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో జాతీయ పార్టీలు కూర్చోమంటే కూర్చుంటారు.. లెమ్మంటే లేస్తారు అంటున్నారు. మరి ఈరోజు మీ దగ్గర జరుగుతున్నదేంటి? మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు మీరు కూర్చోమంటే కూర్చుంటున్నారు. లెమ్మంటే లేవడం నిజంకాదా? మీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ను కాదని ఎవరికి టికెట్లు ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు, బడా వ్యాపారులకు టికెట్లు ఇవ్వలేదా? ఎంపీ టికెట్లను వేలం పాటలా మార్చారు. ఎవరు డబ్బు ఎక్కువ పెడితే వారికి సీట్లు ఇచ్చారు. తెలంగాణ సమాజం గమనిస్తోంది. తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడ పోయారు? ఉద్యమంలో త్యాగాలు చేసిన వారు ఎక్కడికెళ్లారు? తెలంగాణ ద్రోహులను, వ్యాపారులను, బడా పారిశ్రామికవేత్తలను తెరపైకి తెచ్చి టికెట్లు ఇచ్చి రాజకీయాలు చేస్తూ తెలంగాణను శాసిస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. సామాజిక న్యాయం ఏమైంది. చిన్న కులాలకు గుర్తింపు ఏదీ? వాటిని పూర్తిగా విస్మరించిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

సాక్షి: గెలుపు గుర్రాల కోసం చేసిన ప్రయత్నంలో సఫలం అయ్యారా?
లక్ష్మణ్‌: పార్టీ కోసం పని చేసే వారికి టికెట్లు ఇచ్చాం. సామాన్య కార్తకర్తలకు టికెట్లు ఇచ్చాం. చింతా సాంబమూర్తి సామాన్య కార్యకర్త. ఎస్‌ కుమార్‌ జర్నలిస్టు. వారికి టికెట్లు ఇచ్చాం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చాం. డబ్బుతో నిమిత్తం లేకుండా పని చేసే వారికి, గెలిచే అవకాశం చూసి టికెట్లు ఇచ్చాం. టీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీ బీజేపీనే. కాంగ్రెస్‌ కాదు. టీఆర్‌ఎస్‌ పట్ల కూడా భ్రమలు తొలగిపోతున్నాయి. నిజామాబాద్‌లో చూడండి. రైతులు నామినేషన్‌ వేశారు. కేసీఆర్‌ కూతురు కవిత పోటీ చేసే ప్రాంతంలోనే రైతులు ఆక్రోశంతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ రైతులను ఏవిధంగా మోసం చేసిందో అర్థం అవుతోంది. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరుస్తామన్నారు. ఏమైంది? ఎర్రజొన్న, పసుపు రైతులు ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి, సీఎం కుమార్తె ఎంపీగా ఉండి న్యాయం చేయలేకపోతే రైతులు నామినేషన్లు వేశారు. వాటిని చూసి అధికార పార్టీ బెంబేలెత్తిపోతోంది. టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టులాంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల్లో మూడు చోట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఓడించారు. సుధాకర్‌రెడ్డి, రవీందర్, చంద్రశేఖర్‌గౌడ్‌ను సీఎం సమర్థించినా గాలిలో కొట్టుకుపోయారు. టీఆర్‌ఎస్‌ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోండి. రేపు పార్లమెంటు ఎన్నికల్లో అసలు బండారం బయట పడుతుంది.

సాక్షి: ఎన్ని స్థానాలపై దృష్టి పెట్టారు? ఎన్నింటిలో గెలుస్తారు?
లక్ష్మణ్‌: మేం పోటీ చేస్తున్నది 17 స్థానాలు. వాటిన్నింటిపైనా సమాన దృష్టి పెట్టాం. గెలవాలనే దృక్పథంతోనే పోటీ చేస్తున్నాం. అభ్యర్థులు ఎవరైనా మోదీ చరిష్మాతో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాం. మోదీ చేపట్టిన కార్యక్రమాలే మా అభ్యర్థులను గెలిపిస్తాయి. అవినీతిరహిత పాలన, అభివృద్ధి, పెద్దనోట్ల రద్దు,దేశం ఆదాయం పెంపు, జీఎస్‌టీ, బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇలాంటివన్నీ ప్రభావితం చేస్తాయి. అన్ని వర్గాల ప్రజలూ మా వెన్నంటి ఉంటారు.

సాక్షి: కేసీఆర్‌ను కాదని బీజేపీకే ఎందుకు ఓటేయాలి?
లక్ష్మణ్‌: మీరు వేసే ఓటు దేశం కోసం.. రాష్ట్రం కోసం కాదు. ప్రధానిగా ఎవరు ఉండాలనే దాని కోసం. మోదీకి సరితూగే వారు ఎవరు లేరు. ఏ కుటుంబంలో లేరు. 5ఏళ్ల మోదీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి చేశారు. 70ఏళ్ల స్వతంత్ర భారతంలో 6.20 కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తే మోదీ ఈ ఐదేళ్లలోనే 10కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడారు. ప్రభుత్వంలోనూ మహిళలకు పెద్ద పీట వేశారు. రక్షణ, విదేశాంగ శాఖల బాధ్యతలను ఇద్దరు మహిళలకు అప్పజెప్పారు. ఇపుడు వేసే ఓటు దేశం కోసం అనేది గుర్తించాలి. అన్ని వర్గాల ప్రజలు మా వెన్నంటి ఉంటారు. ఈరోజు టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మజ్లిస్‌ అభివృద్ధి చెందుతుంది. మజ్లిస్‌ ప్రాపకం కోసం మోదీని, లక్ష్మణ్‌ను, బీజేపీని కేసీఆర్‌ తిడుతున్నారు. మేము అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. కానీ కేసీఆర్‌ హిందుత్వ అజెండాను ముందుకు తీసుకువచ్చి హిందువులను అవమానపరిచేలా, కించపరిచేలా తిడుతున్నారు. హిందువులు.. బొందువులు అంటున్నారు. మోదీకంటే అసలైన హిందువు నేనే అంటున్నారు.

మోదీ కంటే అసలైన హిందువో కాదో కానీ అసదుద్దీన్‌కంటే కంటే అసలైన ముస్లింవు నువ్వు. యజ్ఞాలు, యాగాలు చేశాననంటున్నావు. ఎవరికోసం చేశావు. నీ స్వార్థం కోసం కాదా? యువజరాజు పట్టాభిషేకం కోసం చేశావు. నీ కూతురిని కేంద్రమంత్రిని చేయడానికి చేశావు. పూర్వం అసురులు కూడా యజ్ఞాలు, యాగాలు చేశారు. రావణాసురుడు కూడా చేశారు. ఆయన నీకంటే గొప్ప శివభక్తుడు. కానీ ఆయన స్వార్థం కోసం చేశాడు. నీవు అలాగే చేస్తున్నావు. యజ్ఞాలు చేసినంత మాత్రాన అసలైన హిందువు అనుకుంటే పొరపాటు. హిందు ధర్మానికి పాటుపడే అర్చకుల జీతభత్యాలు ట్రెజరీ ద్వారా ఇవ్వమంటే ఇవ్వని నీవు హిందువు ఎట్లవుతావు? కొండగట్టులో 65 మంది చనిపోతే హైదరాబాద్‌లో ఉండి, వెళ్లని నీవు ఎలా హిందువు అవుతావు? భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి ఆనవాయితీగా సీఎం వెళ్లాల్సి ఉన్నా నీవు వెళ్లకుండా నీ మనవడిని పంపితే ఎలా హిందువు అవుతావు? అజ్మీర్‌ దర్గాకు స్వయంగా షేర్వానీ వేసుకొని, టోపీ పెట్టుకొని వెళ్లి చాదర్‌ సమర్పించిన నీవు ఎలా హిందువు అవుతావు? ఎన్నికల కోసం, ఓట్ల కోసం బూటకపు హిందువుగా చెప్పుకుంటున్నావు. కాబట్టి మీరు చెప్పే మాటలను ప్రజలు నమ్మరు. ఈ ఎన్నికల్లో మోదీనే ప్రజలు గెలిపిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top