మళ్లీ తెరపైకి ‘కొత్త జిల్లా’

There are some demands across the state - Sakshi

     32వ జిల్లాగా నారాయణపేట 

     సీఎం కేసీఆర్‌ ఎన్నికల హామీ 

     రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని డిమాండ్లు

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్‌ ముందుకు వచ్చే అవకాశముంది. 2014 ఎన్నికల్లో ఈ అంశం టీఆర్‌ఎస్‌కు బాగా కలసి వచ్చింది. ఎన్నికల హామీకి అనుగుణంగానే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. తాజాగా నారాయణపేటను 32వ జిల్లాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆదివారం నారాయణపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. కేసీఆర్‌ తాజా హామీపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. జిల్లాల పునర్విభజనవేళ తలెత్తిన కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్లు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.

తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్‌ చేసిన సత్తుపల్లి, మిర్యాలగూడ, ములుగు, రామగుండం ప్రజల్లో కేసీఆర్‌ ప్రకటన ఆశలు రేపింది. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేపడతామని టీఆర్‌ఎస్‌ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి రాగానే కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, పలు ప్రాంతాల ప్రజల డిమాండ్లతో ఈ సంఖ్య 31కి పెరిగింది. 2016 అక్టోబర్‌ 11న రాష్ట్రంలో 31 జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. సత్తుపల్లి, మిర్యాలగూడ, ములుగు, రామగుండంలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని అప్పట్లో ఆ ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేసినా ఆచరణకు నోచుకోలేదు. ఉద్యమాలు చేసినా అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించలేదు. 

జిల్లా కుదింపు ప్రచారానికి తెర! 
ఒకవైపు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం మళ్లీ డిమాండ్‌లు తెరమీదికి వస్తుండగా మరోవైపు జిల్లాలను కుదిస్తారని జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. కేసీఆర్‌ తాజా ప్రకటనతో ఈ ప్రచారానికి ఇక ఫుల్‌స్టాప్‌ పడినట్లేనని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను కలిపి వరంగల్‌గా మారుస్తారని ఆ ప్రాంతంలోని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు అంతర్గతంగా చెబుతూ వస్తున్నారు. సీఎం కేసీఆర్‌ 32వ జిల్లా ప్రకటనతో ఆ ప్రతిపాదనలకు ముగింపు పలికినట్లయింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top