ఒంటరిగానే వైఎస్సార్‌సీపీ పోటీ

Their is no Alliance with Jansena says Botsa Satyanarayana - Sakshi

వ్యవస్థలను నాశనం చేసే విచ్ఛిన్నకరశక్తి చంద్రబాబు

అవినీతి బయటపడకూడదనే ‘సేవ్‌ డెమొక్రసీ’ ముసుగు

కాంగ్రెస్‌తో టీడీపీది అపవిత్ర కలయిక

హాయ్‌ల్యాండ్‌పై తండ్రీకొడుకుల కన్ను

రాష్ట్రాన్ని క్రిమినల్‌ హబ్‌గా మార్చేశారు

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ 

జనసేనతో వైఎస్సార్‌సీపీ పొత్తు ప్రచారంపై ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. బీజేపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  కలిసిపోయాయని బాబు గోబెల్‌ ప్రచారం చేస్తున్నారని, జనసేన పార్టీతో పొత్తని కూడా ప్రచారం చేస్తుండడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం బొత్స మీడియాతో మాట్లాడారు. పవన్‌–జగన్‌లు సమావేశమయ్యారని.. ఈ భేటీలో 40 సీట్లకు బేరం జరిగిందని ఆదివారం విడుదల చేసిన ఓ లేఖలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు పేర్కొనడం దురదృష్టకరమన్నారు. ఏ రాజకీయ పార్టీతోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోదని ఆయన చెప్పారు.

ఈ విషయాన్ని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలుమార్లు స్పష్టంచేసిన సంగతిని గుర్తుచేశారు.  చంద్రబాబు నిరంతరం గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, విశాఖలో జరిగిన హత్యాయత్నం తరువాత వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌కు వచ్చి నేరుగా ఆసుపత్రికి వెళ్తే.. ఆయన తన ఇంటికి వెళ్లారని, బీజేపీ నేతలతో ఫోన్లో మాట్లాడిన తరువాతే ఆసుపత్రిలో చేరారని చంద్రబాబు దుష్ప్రచారం చేశారని బొత్స తీవ్రంగా మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసే విచ్ఛిన్నకర శక్తిగా ముఖ్యమంత్రి మారారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకు సిద్ధాంతాలు, విలువలతో సంబంధం లేకుండా ఎవరితో లాభమో వారితో అడుగులు వేస్తుంటారని ఎద్దేవా చేశారు. సీబీఐని రాష్ట్రంలోకి రావొద్దంటూ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చారో బాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన దోపిడీ, అవినీతిని కప్పిపుచ్చుకునే చంద్రబాబు ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో టీడీపీది అపవిత్ర కలయిక అని బొత్స అభివర్ణించారు. చంద్రబాబు దోపిడీపై రాష్ట కాంగ్రెస్‌ పార్టీ గత జూన్‌ 8న చార్జీషీటు విడుదల చేసిందని.. ఈ విషయం ఆ పార్టీ జాతీయ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో వారెలా జతకట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

అక్రమాలు బయటపడకూదనే జాతీయ నేతలతో భేటీలు
తన ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పలు అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే చంద్రబాబు జాతీయ పార్టీల నేతలతో కలసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ తిరుగుతున్నారని, ఇదంతా విచారణల నుంచి తప్పించుకునేందుకేనని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు తన పాలనలో రాష్ట్రాన్ని ఒక క్రిమినల్‌ హబ్‌గా మార్చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నిత్యం స్కాంలు, దోపిడీలు వెలుగుచూస్తున్నాయే తప్ప అభివృద్ధి కనబడటం లేదన్నారు. జాతీయ పార్టీలు ఇక్కడి వాస్తవాలు తెలుసుకుని జాగ్రత్తపడాలన్నారు. కాగా, సీబీఐ కేసులు పెట్టడం తప్పని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెబుతున్న చంద్రబాబు.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ కేసులను రద్దుచేయాలని కోరతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేసిన విమర్శలలో వాస్తవాలున్నాయని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే బాబు హయాంలో సీఎస్‌లుగా పనిచేసిన అజేయ కల్లం, ఐవైఆర్‌ కృష్ణారావులు చంద్రబాబు బండారాన్ని బయటపెడుతున్నారని బొత్స వివరించారు. వీరి బాటలోనే డీజీపీలుగా పనిచేసిన వారు కూడా బయటకు వచ్చి చంద్రబాబు దుర్మార్గాలను బయటపెట్టే అవకాశముందన్నారు. ఇదిలా ఉంటే.. చదరపు అడుగు నిర్మాణం ధర రూ.2వేల లోపు ఉంటే చంద్రబాబు రాజధానిలో తాత్కాలిక నిర్మాణాలకు రూ.11వేలుగా నిర్ణయించి దోపిడీ చేస్తున్నారన్నారు. అదొక స్విమ్మింగ్‌పూల్‌గా మారిందని అజేయ కల్లం చేసిన వ్యాఖ్యను బొత్స ఈ సందర్భంగా గుర్తుచేశారు. 

సీఎస్‌ల వ్యాఖ్యలపై ప్రజలు ఆలోచించాలి
కాగా, చంద్రబాబు హయాంలో పనిచేసిన ఇద్దరు నీతి, నిజాయతీ కలిగిన సీఎస్‌లు ఆయన అరాచకాల గురించి చెప్పడంపై ప్రజలు ఆలోచించాలని బొత్స కోరారు. కేంద్రం ఇచ్చిన ఉపాధి హామీ నిధులు రూ.20వేల కోట్లలో రూ.7వేల కోట్లు టీడీపీ నాయకులు, కార్యకర్తలు దోచుకుతిన్నారన్నారు. తమ పచ్చ మీడియా సంస్థకు ఈ నాలుగేళ్లల్లో రూ.700కోట్లు చెల్లించారన్నారు. రూ.450 కోట్ల భూమిని 45 లక్షలకే అప్పనంగా ఇచ్చారని.. విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.  ఐదు లక్షల మొబైల్‌ ఫోన్ల కొనుగోలులో రూ.150 కోట్లు కొట్టేశారని మాజీ సీఎస్‌ అజేయ కల్లం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులపై చంద్రబాబు, లోకేష్‌ల కన్నుపడిందన్నారు. నేడు హాయ్‌ల్యాండ్‌ తమ ఆస్తి కాదంటూ అగ్రిగోల్డ్‌ చెప్పడం వెనుక విలువైన హాయ్‌లాండ్‌ను తండ్రీకొడుకులు దోచేసేందుకు స్కెచ్‌ వేశారని ఎండగట్టారు. విశాఖ బీచ్‌ రిసార్టులు కూడా ఆ సంస్థవి కావని చెప్పే అవకాశం కూడా ఉందన్నారు. వీటిని కాజేసేందుకే చంద్రబాబు ఈ అంశంపై నోరువిప్పడంలేదని బొత్స మండిపడ్డారు. 

రోశయ్యను కలిసిన బొత్స, ఆనం
మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోమవారం మధ్యాహ్నం వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top