మీరే ఆదుకోవాలయ్యా.. 

Tenant Farmers Says there Problems with YS Jagan At Mudunuru Village - Sakshi

      గిట్టుబాటు ధర లేదు, రుణమాఫీ లేదు 

      దాన్యం అమ్మినా దైన్యమే 

      డబ్బు కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేక చస్తున్నాం 

      ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన కౌలు రైతులు 

      దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న సగర్లు, కుమ్మర్లు, మత్స్యకారులు 

      మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని జననేత హామీ

      2,100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన పాదయాత్ర  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘సార్‌.. నా పేరు జాలిపర్తి నాగేశ్వరరావు. మా ఊరు ఆకుతీగపాడు. నేనో కౌలు రైతును. పది ఎకరాలు ఊడుస్తుంటా (సాగు చేయడం). రుణమాఫీ కాలేదు.. కొత్త రుణాలూ లేవు. అప్పోసప్పో చేసి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేదు. మార్కెట్‌కు తీసుకెళ్తే 75 కిలోల వడ్ల బస్తాను పదొందలకిస్తావా.. 11 వందలకిస్తావా? అని దళారులు అడుగుతున్నారు. చివరకు ఏదో విధంగా ధాన్యాన్ని అమ్మినా డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మా డబ్బు మాకు రావడానికి అటు బ్యాంకులోళ్లనీ, ఇటు భూ యజమానుల్నీ బతిమిలాడుకోవాల్సి వస్తోందయ్యా.. మీరే ఏదో విధంగా మమ్మల్ని కాపాడాలి, గట్టున పడేయాలయ్యా..’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట ఆ రైతు వాపోయాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 168వ రోజు మంగళవారం వైఎస్‌ జగన్‌ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం దాటి ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రవేశించారు. పాదయాత్ర బోడపాడు క్రాస్‌ దాటి ముదునూరు చేరుకోబోతున్నప్పుడు పలువురు కౌలు రైతులు ధాన్యాన్ని రోడ్డు మీద పోసి వైఎస్‌ జగన్‌కు వారి దుస్థితిని వివరించారు.

రాష్ట్రంలో లక్షలాది మంది కౌలు రైతులున్నారని, వారికెవ్వరికీ పంట రుణాలు రావడం లేదని, రుణ అర్హత పత్రాలున్నా బ్యాంకులు అనేక ఆంక్షలు పెడుతున్నాయని వాపోయారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాగు చేసే భూమికి సంబంధించిన పట్టాదార్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ అనుసంధానం రైతు పేరిటే ఉండడంతో తమ వద్ద కొన్న ధాన్యానికి డబ్బును సైతం సంబంధిత రైతు (భూమి సొంతదారు) ఖాతాలోనే వేస్తున్నారన్నారు. ఆ నగదు తీసుకోవాలంటే సంబంధిత రైతు బ్యాంకు వద్దకు రావాలని, అదే సమయంలో బ్యాంకులో నగదు ఉండాలని, ఈ రెండూ కుదిరినా తమకు రోజుకు రూ. 5 వేలు, రూ.10 వేలకు మించి ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఎకరానికి రూ.40 వేలు ఖర్చు పెట్టి సాగు చేస్తే 35 నుంచి 40 బస్తాల మధ్య దిగుబడి వస్తోందని, అందులో 15 బస్తాలు కౌలుకు పోందన్నారు. డబ్బు చేతికందక ముందే ఎరువులు, పురుగు మందుల షాపుల వాళ్లు, అప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు తమ ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బుల్ని తమకే నేరుగా ఇచ్చేలా చూడాలని కోరారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. ‘కౌలు కార్డులు లేవు.. పంట రుణాలు లేవు, జీరో వడ్డీ రుణాలు లేవు, పావలా వడ్డీ రుణాలు లేవు, చివరకు బ్యాంకులోళ్లు డబ్బులు ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం ఉలకదు, పలకదు’  జగన్‌  విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి కచ్చితంగా మేలు చేస్తామని భరోసా ఇచ్చారు.  

అడుగడుగునా వినతులే.. 
పాదయాత్ర పెంటపాడు దాటిన తర్వాత రాష్ట్ర సగర (ఉప్పర్లు) సంఘం నేతలు వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమను ఉప్పర్లుగా కాకుండా సగర్లుగా పిలిచేలా ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం బీసీ–డి గ్రూపులో ఉన్న తమను బీసీ–ఏ గ్రూపులోకి మార్పించాలని విన్నవించారు. కుమ్మరి చక్రాన్నే నమ్ముకుని తరతరాలుగా కుండలు చేసుకుని బతుకుతున్న తమకు ప్రస్తుతం ఆదరణ లేదని, ప్రత్యామ్నాయం చూపించాలని శాలివాహన సంఘం నాయకులు కోరారు. చెరువుల్లో మట్టిని తవ్వుకునే హక్కు కల్పించాలని విన్నవించారు. స్థానిక సంస్థల్లో తమకూ ప్రాతినిధ్యం కల్పించాలని సంఘం నేతలు కె.ధర్మరాజు, ఎం.పురుషోత్తం, బి.చింతన్న తదితరులు విన్నవించారు. తమ ప్రభుత్వం వచ్చాక కుమ్మర్లకు ఒక ఎమ్మెల్సీ ఇస్తానన్న విషయాన్ని జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సమస్యలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేసి, తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  తమకు రుణాలు ఇప్పించి ఆదుకోవాలని, చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని మత్స్యకార మహిళలు కోరారు.  పెన్షన్లు ఇవ్వడం లేదని.. ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం లేదని, జన్మభూమి కమిటీలు వేధిస్తున్నాయని పలువురు జగన్‌కు ఫిర్యాదు చేశారు.    

ఆటోడ్రైవర్ల కృతజ్ఞతలు.. 
ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించిన వైఎస్‌ జగన్‌కు శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గకు చెందిన ఆటోడ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆటోడ్రైవర్ల సమస్యలను పట్టించుకుని సానుకూలంగా స్పందించిన ఏకైక నాయకుడు జగన్‌ ఒక్కరేనని కొనియాడారు. శ్రీశ్రీశ్రీ పెంటపోలమ్మ ఆటో యూనియన్‌ నాయకులు గొండు మోహనరావు, మల్లారెడ్డి శ్రీను, ఎం.మల్లేశ్వరరావు, ఎన్‌.పాపారావు నాయకత్వంలో వచ్చిన పలువురు ఆటోడ్రైవర్లు జగన్‌ను పెంటపాడు గ్రామ శివార్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గం పిప్పర శివార్లలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద పాదయాత్ర 2100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించింది. దీనికి గుర్తుగా జగన్‌ అక్కడ వేప మొక్కను నాటారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top