తేజ్‌పూర్‌ బరిలో తెలుగోడు

Telugu Person in Tezpur Constituency - Sakshi

అస్సాం–మేఘాలయా కేడర్‌కు (1985) చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఎంజీవీకే భాను తేజ్‌పూర్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. పీవీ నరసింహారావు మంత్రివర్గంలో సహాయ మంత్రిగా పనిచేసిన పీవీ.రంగయ్య నాయుడు అల్లుడే భాను. ఆయన పూర్తి పేరు మద్దుకూరి గోపాల వెంకట కుమార భాను. తొమ్మిది నెలల క్రితం భాను అస్సాం అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీగా రిటైరయ్యారు. ఫిబ్రవరిలో ఆయన కాంగ్రెస్‌లో చేరగా తేజ్‌పూర్‌ నుంచి పోటీచేసే అవకాశం లభించింది. 1990లో ఆయన డెప్యుటేషన్‌పై సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ కంచుకోటగా భావించే తేజ్‌పూర్‌ నియోజకవర్గం పరిధిలోని సొనీత్‌పూర్‌ డిప్యూటీ కమిషనర్‌గా కూడా పదవీ బాధ్యతలు నిర్వహించారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మళ్లీ ఐదేళ్ల డిప్యుటేషన్‌పై వచ్చి ఆయనకు సెక్రటరీగా భాను పనిచేశారు. భాను సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా నవాబుపాలెం. ఆయన కేంద్ర పర్యాటక శాఖలో డైరెక్టర్‌గా కొన్నేళ్లు ఉన్నారు. భారత తేయాకు బోర్డు చైర్మన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉన్న భాను తేజ్‌పూర్‌లో సొంతిల్లు నిర్మించుకున్నారు. పదిహేనేళ్లు అస్సాం సీఎంగా పనిచేసిన తరుణ్‌ గోగోయ్‌కు అత్యంత సన్నిహితునిగా భానుకు పేరుంది. 2014 ఎన్నికల్లో తేజ్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రామ్‌ప్రసాద్‌ శర్మ ఎన్నికయ్యారు ఈసారి బీజేపీ తరఫున పల్లబ్‌ లోచన్‌ దాస్‌ పోటీచేస్తున్నారు. ఆయన మామ రంగయ్య నాయుడు 1991 ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top