తిరుగుబాటు..!

Telangana ZPTC And MPTC Nominations Process - Sakshi

మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీల్లో తిరుగుబాటుకు ఆజ్యం పోస్తున్నాయి. ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి సెగల రగిలేందుకు కారణమవుతోంది. అధిష్టానం నుంచి అనుమతి లేకుండా కొందరు నాయకులు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీపడుతున్నారు. ఒకరికి టికెట్‌ కేటాయిస్తే.. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు లేదా ముగ్గురు రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్, బీజేపీల్లో ఇలాంటి తిరుగుబాటు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని నాయకులు ఆందోళన చెందుతున్నారు.

సిరిసిల్ల: టీఆర్‌ఎస్‌లో అసమ్మతి కాస్త ఎక్కువగా ఉండగా.. ముస్తాబాద్‌ మండలంలో బీజేపీలోనూ రెబల్స్‌ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌లోనూ ఒకటిరెండు చోట్ల రెబల్స్‌ బెడద ఉంది. ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్దీ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ నచ్చిన పార్టీలోకి వెళ్లే వెసులుబాటు ఉంటుందనే ధీమాతో అన్ని పార్టీల్లోనూ అసమ్మతి అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అధిష్టానం వద్దన్నా..
పార్టీ అధిష్టానం వద్దని వారించినా చాలామంది అభ్యర్థులు ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తున్నారు. వీర్నపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ తరఫున గుగులోల్‌ కళావతి పోటీ చేస్తుండగా, మాజీ ఎంపీపీ భానోత్‌ శాంతాబాయి రెబల్‌గా బరిలో నిలిచారు. ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పందిర్ల నాగరాణి పోటీలో ఉండగా ఆమెపై చేకుట మమత పోటీలో నిలిచారు. ఇద్దరూ గులాబీ కండువాలతోనే ప్రచారం చేయడం విశేషం. ఇక్కడ నాగరాణికి మద్దతుగా జెడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య ప్రచారం చేస్తుండగా.. మమతకు మద్దతుగా ఎల్లారెడ్డిపేట సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. నారాయణపూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా లద్దునూరి రేణుక పోటీ చేయగా.. ఆమెపై ఎస్‌కే నజీమా ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు.

రాచర్ల గొల్లపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తీగల ప్రకాశ్‌ పోటీ చేయగా.. రెబల్‌ అభ్యర్థిగా ల్యాగల శ్రీనివాస్‌రెడ్డి పోటీలో ఉన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జి.మంజుల పోటీ చేయగా.. రెబల్‌ అభ్యర్థిగా కృష్ణమూర్తిగౌడ్‌ పోటీలో ఉన్నారు. నాగంపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగు దేవయ్య పోటీ చేయగా.. రెబల్‌ అభ్యర్థిగా నాగభూషణం పోటీలో ఉన్నారు. వీర్నపల్లి మండలం వన్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా భానోత్‌ కమల పోటీ చేయగా.. తిరుగుబాటు అభ్యర్థిగా భానోత్‌ పద్మ ఉన్నారు. రంగంపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పంబాల రేణుక పోటీ చేయగా తిరుగుబాటు అభ్యర్థిగా భానోత్‌ విజయ పోటీ చేశారు. వీర్నపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పెడ్తనపల్లి శేఖర్‌ పోటీ చేయగా.. రెబల్‌ అభ్యర్థిగా జోగినపల్లి నర్సింగరావు పోటీ చేస్తున్నారు.

ముస్తాబాద్‌ మండలం చీకోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పడిగె సరిత పోటీ చేయగా.. ఆమెపై ఇద్దరు రెబల్స్‌ కొంపెల్లి బాలమణి, వీరబోయిన విజయ పోటీకి దిగారు. పోత్గల్‌లో బీజేపీ అభ్యర్థిగా తన్నీరు శోభ పోటీలో ఉండగా.. అదే పార్టీకి చెందిన ఎంపెల్లి రేణుక, కోల లత పోటీ చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా అన్నమేని రజిత పోటీ చేయగా.. రెబల్‌గా మామిండ్ల ఉప పోటీలో ఉన్నారు. తెర్లుమద్దిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బైకి దుర్గవ్వ పోటీలో ఉండగా.. రెబల్‌గా కొమ్మట సుమలత, లకావత్‌ కొమురవ్వ పోటీ చేస్తున్నారు. ముస్తాబాద్‌లో బీజేపీ అభ్యర్థిగా కొండ యాదగిరి పోటీలో ఉండగా.. ఆయనపై తిరుగుబాటు అభ్యర్థిగా తాండ్ర రాంగోపాల్‌ బరిలో నిలిచారు. మద్దికుంట బీజేపీ అభ్యర్థిగా గూడ బాల్‌రెడ్డి పోటీ చేయగా.. ఆయనపై యెల్ల శ్రీకాంత్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా ఉన్నారు. పోత్గల్‌ –1లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేసుగాని రాజయ్య పోటీ చేయగా. ఆయనపై రెబల్‌ అభ్యర్థిగా తలారి రాణి పోటీ చేశారు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ మూడు పార్టీల అభ్యర్థులకు తిరుగుబాటు అభ్యర్థులు ముచ్చెమటలు పుట్టిస్తున్నారు.

తిరుగుబాటు అభ్యర్థులపై అధిష్టానం ఆరా..
సిరిసిల్ల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో అధిష్టానాన్ని ధిక్కరించి పోటీచేసిన అభ్యర్థులపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆరా తీస్తోంది. టీఆర్‌ఎస్‌ బీ–ఫామ్స్‌ ఇచ్చిన అభ్యర్థులకు కాకుండా.. ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న పార్టీ శ్రేణులపై పెద్దలు దృష్టిసారించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఈ ప్రాంతంలోని స్థానిక సంస్థల ఎన్నికల తీరుపై ముఖ్యనాయకులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం.

పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలోనూ తిరుగుబాటు అభ్యర్థులు ఉండడంతో ఆ పార్టీల జిల్లా నాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. మూడు ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ తగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాలపై అసమ్మతి ప్రభావం ఏ మేరకు ఉంటుందో అంతు చిక్కడం లేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top