కింకర్తవ్యం..? 

Telangana ZPTC And MPTC Elections Congress Party - Sakshi

జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చేతులు ఎత్తేస్తోందా..? వరుస ఎన్నికలు, ప్రతికూల ఫలితాలతో.. నిర్లిప్తంగా ఉంటోందా..? గత జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో మెజారిటీ జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని, జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్‌ ఈసారెందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది..? సగటు కాంగ్రెస్‌ కార్యకర్తల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. 

సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత పోలింగ్‌కు నోటిఫికేషన్‌ కూడా వెలువడింది. రెండు రోజలుగా నామినేషన్లు స్వీకరిస్తున్నారు. దేవరకొండ డివిజన్‌లోని పది మండలాల జిల్లా పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు వచ్చే నెల 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కానీ, కాంగ్రెస్‌లో మాత్రం ఊహించినంతగా చురుకుదనం కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ పార్టీ నాయకత్వం ఇప్పటిదాకా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ అభ్యర్థి ఎవరో ప్రకటించలేకపోయింది. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే.. వచ్చే స్థానాల సంఖ్యను బట్టి అభ్యర్థిని ఖరారు చేసే వ్యూహంతో ఆ పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు. 31 జెడ్పీటీసీ స్థానాలున్న నల్లగొండ జిల్లా పరిషత్‌ పీఠాన్ని  దక్కించుకోవాలంటే.. ఏ పార్టీకి అయినా 16 స్థానాలు వస్తే చాలు.

నాయకుల వెనకడుగు !
వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జెడ్పీ పీఠాన్ని అత్యధిక పర్యాయాలు కైవసం చేసుకున్న చరిత్ర కాంగ్రెస్‌కే ఉంది. మధ్యలో రెండు పర్యాయాలు టీడీపీ మినహా అన్ని సార్లూ కాంగ్రెస్‌ చైర్మన్లే ఉన్నారు. గత ఎన్నికల్లో నల్లగొండ జెడ్పీ ఎస్టీలకు రిజర్వ్‌ కాగా, అప్పటికి దేవరకొండ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్‌కు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారి, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో జెడ్పీ చైర్మన్‌ మాత్రమే కాకుండా మెజారిటీ కాంగ్రెస్‌ జెడ్పీటీసీ  సభ్యులు గులాబీ పార్టీలోకి దూకారు. మొన్నటి ఎన్నికల ముందర జెడ్పీ చైర్మన్‌ బాలూనాయక్‌ తిరిగి సొంతగూటికి చేరారు. ముందస్తు ఎన్నికల్లో తిరిగి టీఆర్‌ఎస్‌ రెండో సారి అధికారంలోకి రావడం, జిల్లా పరిధి లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. నకిరేకల్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన చిరుమర్తి లింగయ్య ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు.

మొన్నటి పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కూడా పలువురు కాంగ్రెస్‌ నాయకులు ముఖ్యం గా మండల స్థాయిలో కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న పలువురు సీనియర్లు పార్టీని వీడారు. ఈ పరిణామాలతో జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు వెనకడుగు వేస్తున్నారని చెబుతున్నారు. దీంతో జెడ్పీ ప్రాదేశిక స్థానాలకు టికెట్లు అడిగే వారి పోటీ కూడా తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జెడ్పీ ఈసారి జనరల్‌ కేటగిరీకి రిజర్వు అయ్యింది. జనరల్‌ కేటగిరీలకు చెందిన వారే జెడ్పీ చైర్మన్‌ అవుతారన్న సాధారణ అభిప్రాయం కూడా ఉంది. దీంతో జెడ్పీటీసీ సభ్యుల పదవులకు పోటీ చేయాలన్న ఆలోచన కొందరికి ఉ న్నా.. చైర్మన్‌ పోస్టు విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలు ఖ ర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారడం, ఇ టీవలే సర్పంచులుగా పోటీచేసి ఖర్చు పెట్టడం వంటివి కూడా వెనకడుగు కారణంగా చెబుతున్నారు. జెడ్పీకంటే మండల అధ్యక్షులుగా ఎన్నిక య్యే అవకాశాలు ఉన్న వారు ఎంపీటీసీగా పోటీ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.

పరిశీలనలో ‘రఘువీర్‌’ పేరు
మరో వైపు నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌ రెడ్డి పేరును జెడ్పీ చైర్మన్‌ పోస్టు కోసం పరిశీలించారని, ఈ మేరకు ముఖ్య నాయకుల మధ్య చర్చ కూడా జరిగిందని అంటున్నారు. పెద్దవూర మండలం నుంచి ఆయనను జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాలన్న ఆలోచన చేశారని చెబుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ను కూడా పోటీ చేయాలనిని పీసీసీ నాయకత్వం కోరిందని పార్టీ వర్గాలు చెప్పాయి.

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడు మోహన్‌రెడ్డిని తెరపైకి తీసుకువస్తున్నారు. పార్టీ నాయకత్వం ఆదేశిస్తే తమ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. కోమటిరెడ్డి సొంత మండలం నార్కట్‌పల్లి జెడ్పీటీసీ స్థానం జనరల్‌ కేటగిరీకే రిజర్వు అయ్యింది. ఈ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి బండా నరేందర్‌ రెడ్డి పోటీ చేయనున్నారు. దీంతో ఈ స్థానాన్ని కీలంగా భావిస్తున్నారు. అధికార పార్టీ చైర్మన్‌ అభ్యర్థిపై పోటీ చేయడానికి కోమటిరెడ్డి కుటుంబం నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందా..? లేదా..? రఘువీర్‌ నిజంగానే జెడ్పీ చైర్మన్‌ రేసులో ఉంటారా..? అన్న అంశాలకు పీసీసీ నాయకత్వం టికెట్లు ఖరారు చేశాకే సమాధానం లభించేలా ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top