వీడిన సస్పెన్స్‌

Telangana TRS And BJP Lok Sabha Candidates Announced List - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: లోక్‌సభ అభ్యర్థుల ఖరారుపై ఎట్టకేలకు సస్పెన్స్‌ వీడింది. గుళాబీ దళపతి, సీఎం కేసీఆర్‌ గురువారం సాయంత్రం పలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 17 స్థానాలకు 16 చోట్ల పోటీలో అభ్యర్థులను బరిలో దింపుతున్న కేసీఆర్‌... వరంగల్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌కే మళ్లీ అవకాశం కల్పించారు. మహబూబాబాద్‌ విషయమై సిట్టింగ్‌ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్‌ను మార్చుతారన్న ప్రచారం ఉంది. అయితే బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్‌చార్జిలతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు.

ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ సీతారాంకు సర్వే రిపోర్టులు ప్రతికూలంగా ఉండటం వల్ల అభ్యర్థి ఎవరైనా అందరూ పని చేయాలంటూ ‘మార్పు’పై కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో 16 స్థానాలకు అ«ధికారికంగా ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. వరంగల్‌కు దయాకర్, మహబూబాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే మాలోతు కవితలను అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ రెండు స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్టీ ఇన్‌చార్జిలను సంప్రదించి అట్టహాసంగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి ఓరుగల్లు...
వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్, 1993 తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉంది. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు పీడీఎఫ్‌ అభ్యర్థి పెండ్యాల రాఘవరావుపై 3,613 ఓట్లతో ఓటమి చెందగా, ఆ తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. 1957లో ఎస్‌ఏ.ఖాన్, 1962లో బీఏ.మీర్జా, 1967లో ఆర్‌.సురేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. 1971లో టీపీఎస్‌కు చెందిన ఎస్‌బీ.గిరి కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎస్‌.రెడ్డిపై గెలుపొందగా, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎస్‌బీ.గిరి 1977లో బీఎల్‌డీ అభ్యర్థి జంగారెడ్డిపై మరోసారి విజయం సాధించారు. అనంతరం 1979 ఉప ఎన్నికల్లో బీఎం.రావు కాంగ్రెస్‌(ఐ) నుంచి, 1980లో కమాలోద్దీన్‌ అహ్మద్‌ కాంగ్రెస్‌(ఐ) నుంచి గెలిచారు. 1984లో టీడీపీ నుంచి పోటీ చేసిన డాక్టర్‌ టి.కల్పనాదేవి కాంగ్రెస్‌ అభ్యర్థి కమాలోద్దీన్‌ అహ్మద్‌ను ఓడించారు.

ఆ తర్వాత 1989, 1991లలో వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆర్‌.సురేందర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థులు కల్పనాదేవి, ఎస్‌.యతిరాజారావులపై గెలుపొందారు. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆజ్మీరా చందూలాల్‌ ఓడించారు. 1998లోనూ టీడీపీ నుంచి చందూలాల్‌ గెలుపొందగా, 1999లో టీడీపీ టికెట్‌ దక్కించుకున్న బోడకుంటి వెంకటేశ్వర్లు విజయం సాధించారు. 2004లో డి.రవీంద్రనాయక్‌ (టీఆర్‌ఎస్‌), 2008 ఉప ఎన్నికలో ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీడీపీ), 2009లో సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్‌) ఎంపీలుగా గెలుపొందారు. 2014లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి 3,92,574 ఓట్లతో విజయం సాధించారు.

ఆ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కడియం శ్రీహరి ఎంపీగా రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పసునూరి దయాకర్‌ 4,59,403 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్, టీడీపీలకు కంచుకోటగా ఉన్న వరంగల్‌ నుంచి వరుసగా రెండుసార్లు భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్‌ఎస్‌... వచ్చే నెల 11న జరగనున్న ఎన్నికల్లో ఓరుగల్లు కోటపై మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు వ్యూహం రూపొందిస్తోంది. 2009కు ముందు హన్మకొండ లోక్‌సభ స్థానంగా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్‌ ఒకసారి, కాంగ్రెస్‌(ఐ) నాలుగుసార్లు, టీడీపీ రెండుసార్లు, బీజేపీ ఒకసారి, టీఆర్‌ఎస్‌ రెండుసార్లు గెలిచాయి. దేశానికి ప్రధానిగా సేవలు అందించిన పీవీ.నరసింహారావు ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గం 2009లో రద్దయింది.

గిరిజనుల రాజకీయ వాటా మానుకోట...
1960వ దశకంలో రెండు టర్మ్‌లు లోక్‌సభ నియోజకవర్గంగా ఉన్న మహబూబాబాద్‌ 2009లో తిరిగి ఏర్పడింది. అప్పట్లో జనరల్‌గా ఉన్న ఈ నియోజకవర్గం ప్రస్తుతం గిరిజనులకు రిజర్వు అయింది. భద్రాచలం బదులుగా ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రొఫెసర్‌ సీతారాంనాయక్, కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్‌పై 34,992 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. సీతారాంనాయక్‌కు 3,20,569  ఓట్లు రాగా, బలరాం నాయక్‌కు 2,85,577 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసిన బి.మోహన్‌లాల్‌కు 2,15,904 ఓట్లు లభించాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్, రెండుచోట్ల కాంగ్రెస్, రెండుచోట్ల టీడీపీలు మెజార్టీ సాధించాయి.

డోర్నకల్‌లో కాంగ్రెస్‌కు 24,646, ఇల్లెందులో 12,460, నర్సంపేటలో 23,677, ములుగులో 14,421 ఓట్ల అధిక్యత లభించింది. పినపాకలో టీడీపీకి 3849, భద్రాచలంలో 37,597 ఓట్ల మెజార్టీ రావడం విశేషం. అయితే పినపాకలో శాసనసభకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటేశ్వర్లు, భద్రాచలం సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలవడం విశేషం. నర్సంపేటలో ఇండిపెండెంటుగా దొంతి మాధవరెడ్డి శాసనసభకు ఎన్నికయ్యారు. మహబూబాబాద్‌లో ఇద్దరు గిరిజనులు ఒక్కోసారి గెలువగా, రెడ్డి నేత ఒకసారి, ఇతర సామాజిక వర్గానికి చెందిన మరొకరు రెండుసార్లు ఎన్నికయ్యారు. బలరాం నాయక్‌ గత లోక్‌స¿¶భకు ఎన్నికై కేంద్రంలో మంత్రి పదవి పొందారు.

మహబూబాబాద్‌ ఏర్పాటుకు ముందు ఖమ్మం జిల్లాతో పాటు పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో కలిపి తెలంగాణ, ఆంధ్ర పాంతాలకు వారధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009లో రద్దయింది. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మూడుసార్లు గెలుపొందగా, సీపీఐ మూడుసార్లు, సీపీఎం ఒకసారి గెలుపొందాయి. అయితే కమలకుమారి, మిడియం బాబురావు కోస్తాకు చెందినవారు కాగా, మిగిలిన వారు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. కాంగ్రెస్‌ నేత రాధాబాయి అనందరావు నాలుగుసార్లు, సీపీఐ నేత సోడె రామయ్య మూడుసార్లు, కాంగ్రెస్‌ నేత కమలకుమారి రెండుసార్లు గెలువగా, టీడీపీ పక్షాన విజయకుమారి ఒకసారి, సీపీఎం తరఫున బాబురావు ఒకసారి గెలుపొందారు. ఇది మొదటి నుంచి ఎస్టీలకు రిజర్వుడ్‌ కావడంతో ఐదుగురు గిరిజన నేతలు పన్నెండుసార్లు గెలుపొందారు. వీరిలో కమలకుమారికి కేంద్రంలో మంత్రిగా చేసే అవకాశం వచ్చింది. 

బీజేపీ అభ్యర్థులు ఖరారు..
హన్మకొండ: లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్‌ నియోజకవర్గ అ«భ్యర్థిగా చింత సాంబమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన అధిష్టానం.. మహబూబాబాద్‌ నుంచి హుస్సేన్‌నాయక్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం గురువారం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తొలి జాబితాలో తెలంగాణలో 10 మంది 
 

బీజేపీ అభ్యర్థులు ఖరారు..

అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వరంగల్, మహబూబా బాద్‌ లోక్‌సభ స్థానాల నుంచి ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ జిల్లాకు చెందిన చింత సాంబమూర్తి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. హస్సేన్‌ నాయక్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబా బాద్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి చింత సాంబమూర్తితో పాటు మాజీ ఎమ్మెల్యే ఒంటేరు జయపాల్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుబాసి వాసుదేవ్, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ టికెట్‌ ఆశించారు. పార్టీ జాతీయ అధిష్టానం చివరకు చింత సాంబమూర్తిని ఎంపిక చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top