తలమునకలు..! 

Telangana State ZPTC And MPTC Elections TRS Party - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ప్రాదేశిక పోరులో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తలమునకలయ్యారు. మండుటెండల్లోనూ పార్టీ నుంచి బరిలో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోరునే తలపించే విధంగా పగలు ప్రచారం.. రాత్రివేళ పార్టీ క్యాడర్‌తో భేటీ అవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చాలా చోట్ల అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధం కావడం.. వారిలో అధిష్టానం పలువురిని మాత్రమే పార్టీ అభ్యర్థులుగా బరిలో దించడంతో మిగతా ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఆశావహులను బుజ్జగించి రెబల్స్‌ బెదడ లేకుండా చూడాలన్న పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులందరూ పని చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి మాత్రమే బరిలో ఉండేటట్టు మిగతా వారిని బుజ్జగిస్తున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నుంచి బలమైన అభ్యర్థి లేని స్థానాలపై దృష్టి సారించిన గులాబీ నేతలు సంప్రదింపులు చేస్తూ నామమాత్రం పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులను సైతం బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎమ్మెల్యే నుంచి సర్పంచ్‌ వరకు దాదాపు అన్ని స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఉండడం.. రాష్ట్రంలో అదే పార్టీ ప్రభుత్వం కొలువుదీరి ఉండడంతో దాన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని గులాబీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10 ఎంపీటీసీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. బలమైన ప్రత్యర్థులున్న చోట ప్రత్యేక దృష్టిసారించి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి తమ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సలహాలు, సూచనల మేరకు అవసరమున్న చోట ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఐదేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
 
మిగిలింది మలి, తుది పోరు.. 
ఈ నెల ఆరో తేదీన ప్రాదేశిక ఎన్నికల తొలి పోరు ముగిసింది. ఈ నెల 10న మలి, 14న తుది పోరు మిగిలి ఉంది. తొలి పోరులో 24 జెడ్పీటీసీ.. 291 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో దాదాపు అన్ని స్థానాలూ తమవే అనే ధీమాతో ఉన్న గులాబీ నేతలు మిగిలిన రెండో, మూడో విడత ఎన్నికలపైనా అదే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మిగిలిన ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రులిద్దరూ తమ నియోజకవర్గాలతో పాటు ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా గులాబీ అధినేత కేసీఆర్‌ మన్ననలు పొందాలనే యోచనతో ఉన్నారు.

  • జోగుళాంబ గద్వాల జిల్లాలో తొలి విడత ఎన్నికల్లో గద్వాల మండలం మేల చెర్వు ఎంపీటీసీగా దామోదర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో విడతలో అయిజ మండలం ఏక్లాస్‌పురం ఎంపీటీసీగా నాగేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్‌పల్లి ఎంపీటీసీగా దీపిక ఎన్నికయ్యారు. అలాగే పెంట్లవెల్లి మండలం గోప్లపూర్‌ ఎంపీటీసీగా శిరీష ఎన్నికయ్యారు. నాగర్‌కర్నూల్‌ మండలం గగ్గల్‌పల్లి–1 ఎంపీటీసీగా ఈశ్వర్‌రెడ్డి ఏకగ్రీవం అయినట్లు ప్రకటించినా.. రూ.10లక్షలు ఇచ్చి నామినేషన్‌ను ఉపసంహరించేలా ప్రత్యర్థిని బెదిరించినట్లు తేలడంతో ఆ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.  
  • వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెనికి తండా ఎంపీటీసీగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన క్రిష్ణానాయక్‌ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన  సిట్టింగ్‌ ఎంపీపీగా కొనసాగుతున్నారు. 
  • నారాయణపేట జిల్లా, మండల పరిధిలోని బండగుండ ఎంపీటీసీ అభ్యర్ధిగా రేణుక, బోయిన్‌పల్లి ఎంపీటీసీగా బాలామణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మరికల్‌ మండలం పెద్దచింతకుంట ఎంపీటీసీగా మంజుల, ఉట్కూరు మండలం కొల్లూరు ఎంపీటీసీగా విజయలక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
  • మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నవాబ్‌పేట మండలం గురుకుంట ఎంపీటీసీ అభ్య  ర్థిగా అనిత ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top