అన్నా.. ఒక్కచాన్స్‌!

Telangana MPTC And Elections Notifications - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: రాజకీయ పునరేకీకరణ పేరిట టీఆర్‌ఎస్‌ నాయకత్వం అమలు చేసిన వ్యూహం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను ఎంపిక చేయడం వారికి సవాల్‌గా మారింది. గతంలో ఒక మండలంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులంతా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో బహు నాయకత్వం తయారైంది. గ్రామాల్లో కూడా దాదాపుగా అదే పరిస్థితి ఎదురైంది.

దీంతో ఎవరికి టికెట్‌ కేటాయించాలో నిర్ణయించుకోవడం శాసనసభ్యులకు ఇబ్బందిగా తయారైంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండగా, మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్, ధర్మపురితోపాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లల్లో పరిస్థితి తీవ్రతంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీలో ఉన్న మండల స్థాయి ముఖ్య నాయకులు కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో టికెట్ల కేటాయింపు ప్రక్రియ నేతలకు ఇబ్బందిగా మారింది. పెద్దపల్లి, మానకొండూరు, జగిత్యాల, వేములవాడలలో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్యేలను కలిసి, సీటు ఖాయం చేసుకునేందుకు నాయకులు పోటీ పడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరే గీటురాయి...
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్న చోట పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు టికెట్ల కోసం పోటీ పడ్డారు. కేసీఆర్‌ సర్వేల ప్రకారం ఎమ్మెల్యే పనితీరుపై వ్యతిరేకత వ్యక్తమైతే సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉందనే ప్రచారంతో పలువురు నాయకులు ఎమ్మెల్యే టికెట్ల రేసులో పోటీపడ్డారు. అయితే సిట్టింగులకే ప్రాధాన్యత అంటూ కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాలో కేవలం చొప్పదండి సిట్టింగ్‌ అభ్యర్థి బడిగె శో¿¶ కు మాత్రమే సీటివ్వలేదు.

మిగతా సిట్టింగులందరూ పోటీ చేయగా, రామగుండం, మంథని మినహా అంతటా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ధర్మపురి, పెద్దపల్లి, కరీంనగర్, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో ఆశించిన మెజారిటీ రాలేదు. పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు తమకు వ్యతిరేకంగా పనిచేసినట్లు ఎన్నికల తరువాత గెలిచిన ఎమ్మెల్యేలు నిర్ధారించుకున్నారు. అలాగే మెజారిటీ రాని గ్రామాల్లో పార్టీ నాయకులు ఎవరు వెన్నుపోటు పొడిచారనే అంశాన్ని పరిశీలించారు. ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి అలాంటి నాయకులతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి ప్రయత్నించారని అనుమానించిన సిట్టింగ్‌ జెడ్పీటీసీ, ఎంపీపీలకు ఈసారి మొండిచేయి చూపుతున్నారు. అదే సమయంలో తమ వెన్నంటి ఉన్న నాయకులకు అవకాశాలు కల్పించేందుకు ఇప్పటికే పావులు కదిపారు.

సీనియారిటీ కన్నా సిన్సియారిటీకే ప్రాధాన్యత
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నాయకుల కన్నా ఎన్నికల సమయంలో వేరే పార్టీల నుంచి వచ్చి చిత్తశుద్ధితో పనిచేసిన వారికే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన జెడ్పీటీసీ ఆశావహులైన నాయకులతో ఇటీవల ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సమావేశమయ్యారు. విడివిడిగా ఒక్కొక్కరితో మాట్లాడి, ఎవరెవరికి గెలిచే అవకాశాలున్నాయి... ఎవరికి సీటివ్వాలని భావిస్తున్నారో కూలంకుశంగా చర్చించారు. ముందుగా జెడ్పీటీసీల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి, ఎంపీపీగా ఆయా సామాజిక సర్దుబాట్ల ఆధారంగా పేర్లను నిర్ణయించారు. జనరల్‌ సీట్లలో బీసీ, ఎస్సీ కేటగిరీ ఆశావహులకు టికెట్లు ఇవ్వలేమని కూడా ఖరాకండిగా చెప్పినట్లు తెలిసింది.

మంథనిలో జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి పుట్ట మధు తనకు అనుకూలురైన గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లనే ఖరారు చేస్తున్నారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, మానకొండూరులో రసమయి బాలకిషన్‌ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన వర్గానికి చెందిన నాయకులకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎంపీపీగా నిర్ణయించిన అభ్యర్థుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగే స్థానాలకు సోమవారం అభ్యర్థుల పేర్లు అధికారికంగా ఖరారు చేయనున్నారు.

పక్క చూపు చూస్తున్న సిట్టింగ్‌లు, నాయకులు
ఉమ్మడి కరీంనగర్‌లోని ప్రతీ మండలంలో జెడ్పీటీసీ టికెట్టు కోసం ముగ్గురు అంత కన్నా ఎక్కువ మందే టీఆర్‌ఎస్‌ నాయకులు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే విచక్షణ మీదనే అభ్యర్థిత్వం ఆధారపడి ఉండడంతో చాలా మంది సిట్టింగులకు ఈసారి అవకాశాలు గల్లంతు కానున్నాయి. జెడ్పీటీసీలతోపాటు ఎంపీపీలుగా కీలకంగా వ్యవహరించిన నాయకులకు ఎంపీటీసీ టికెట్టు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు ఆసక్తి చూపడం లేదు. రిజర్వేషన్‌ కేటగిరీలో అవకాశాలు కోల్పోయిన వారు కొంత సంయమనం పాటిస్తుండగా, అవకాశం ఉన్నా, టికెట్లు రాదని రూఢీ అయిన నాయకులు కాంగ్రెస్, బీజేపీవైపు చూస్తున్నారు. ప్రధానంగా జెడ్పీటీసీ టికెట్లు ఆశిస్తున్న కొందరు నాయకులు తమకు టికెట్‌ రాకపోతే వేరే పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ‘ప్లాన్‌–బి’ని సిద్ధం చేసుకున్నారు. రెండోశ్రేణి నాయకులకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థిత్వాలు రాజకీయ భవిష్యత్తుకు సవాల్‌గా మారాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top