పోరాటాల నుంచే జనసమితి పుట్టింది

Telangana Janasamithi have come from struggles - Sakshi

     టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం 

     ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు 

     కాంట్రాక్టులు, భూ దందాలపైనే అధికార పార్టీ నేతల దృష్టి 

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పోరాటాల నుంచే తెలంగాణ జనసమితి ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని ప్రాథమిక ఉద్దేశాలను మరచిన అధికార పార్టీ నాయకులు.. కాంట్రాక్టులు, భూ దందాల వైపు మళ్లారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి అని ప్రశ్నిస్తే తెలంగాణ వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ ప్రారంభం నుంచే ప్రభుత్వం తమను ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.

ముఖ్యంగా ఈనెల 29న పార్టీ ఆవిర్భావ సభ కోసం అనుమతి కోరగా శాంతిభద్రతల కారణంగా ఇవ్వడం కుదరదని చెప్పిందన్నారు. కోర్టుకు వెళ్తే సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా చెప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో గతంలో పోరాడితే ఇప్పడు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు మళ్లీ జనసమితి ఏర్పాటు కోసం కూడా పోరాడాల్సి వచ్చిందన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని కాలరాసే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, అలాంటి వారికోసం ఇప్పటి వరకు ఒక స్థూపం కట్టించే పరిస్థితి లేదని అన్నారు. అందుకోసం ఈనెల 29న జరిగే పార్టీ ఆవిర్భావ సభకు వచ్చే ప్రతి ఒక్కరూ ఒక ఇనుప ముక్కను ప్రతి గ్రామంలో పూజలు చేయించి సభకు తీసుకురావాలని కోరారు. దాన్ని కరిగించి అమరవీరుల స్థూపం నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top