ఓవైసీ కంటే పెద్ద ముస్లిం కేసీఆర్‌: లక్ష్మణ్‌

Telangana BJP Chief K Laxman Fire On KCR In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు యాగాలు చేసిన మీరు(కేసీఆర్‌) హిందువా.. ఏ విధంగా హిందువో మీరు చెప్పాలి..వక్రబుద్ధితో నువ్వు చేసే యజ్ఞం.. యజ్ఞం కాదు.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ కంటే  పెద్ద ముస్లిం కేసీఆరే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కె.లక్ష్మణ్‌ తీవ్రంగా విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ విలేకరులతో మాట్లాడారు. బీజీపీకి 150 సీట్లు కాదు.. 300 సీట్లు వస్తే నువ్వు రాజకీయ సన్యాసానికి సిద్ధమా అని కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఎన్టీయే అధికారంలోకి రాగానే దేశంలో రాజకీయంగా పెనుమార్పులు రాబోతున్నాయని అన్నారు. మోదీ వచ్చాక కేసీఆర్‌ ప్రభుత్వంపై అవినీతి విచారణ చేపడతామని చెప్పారు. నిన్నటి మోదీ సభ కేసీఆర్‌కు వణుకు పుట్టిస్తోందని ఎద్దేవా చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా జనం భారీ స్థాయిలో మోదీ సభలకు వచ్చారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ నేతల్లో అంతర్మధనం

 టీఆర్‌ఎస్‌ నేతల్లో అంతర్మధనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. అహంకారంతో, అధికార మదంతో విర్రవీగే నాయకులకు నిన్నటి ఎల్బీస్టేడియం సభ అట్టర్‌ ప్లాప్‌ కావడంతో ఎటూ పాలుపోవడం లేదన్నారు. నోటి దురుసు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే జనం చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు ఓడిపోగానే కేసీఆర్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి వేడుకుంటున్న ఈ కుటుంబ పాలన నుంచి దేశాన్ని రాష్ట్రాన్ని విముక్తుల్ని చేయాలని కోరారు. 

ఫాం హౌస్‌ నుంచి సచివాలయానికి

టీఆర్‌ఎస్‌ ఎంపీలను ఓడగొడితేనే కేసీఆర్‌ ఫాం హౌస్‌ నుంచి సచివాలయా​నికి వస్తాడని వ్యాఖ్యానించారు. సారు కారు పదమారు సర్కారు కాదు.. బారు, బీరు సర్కారు అన్న చందంగా ఈ ప్రభుత్వ తీరు ఉందని తీవ్రంగా దుయ్యబట్టారు. మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రి, గిరిజన మంత్రి కూడా లేరని మండిపడ్డారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ఉంటే ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తారనుకుంటే విచ్చిలవిడిగా డబ్బులకు పదవులకు అమ్ముడుపోతూ పార్టీ మారుతున్నారని విమర్శించారు. 

శతకోటి లింగాల్లో బోడి లింగం

శతకోటి లింగాల్లో బోడి లింగం కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. 16 ఎంపీలు గెలిపిస్తే ఏం చేస్తారో కేసీఆర్‌ చెప్పాలన్నారు. సైనికులను అవమాన పర్చిన కేసీఆర్‌ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో ఎన్ని గెలుస్తామో చెప్పడానికి తాను జ్యోతిష్కుడిని కాదన్నారు. కచ్చితంగా అత్యధిక స్థానాలు గెలుస్తామని, వోటింగ్‌ శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 1న మోదీ పర్యటన ఉంటుందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top