సీటు ఫైటు

TDP Party Leaders Conflicts For Tickets Prakasam - Sakshi

జిల్లాలో అభ్యర్థుల మార్పునకు టీడీపీ కసరత్తు

వచ్చే ఎన్నికల్లో కొత్త వారిని బరిలో దింపే ప్రయత్నం

వై.పాలెం, కనిగిరి, కొండపి అభ్యర్థుల మార్పు..?

మార్కాపురం, ఎస్‌.ఎన్‌.పాడులోనూ ఇదే దారి

లీకులిస్తున్న పార్టీ     అధిష్టానం

తిరుగుబాటుకు సిద్ధమవుతున్న సిట్టింగ్‌ అభ్యర్థులు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం జిల్లాలో పలుచోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో బాగా వెనుకబడి పోయిన టీడీపీ అభ్యర్థుల మార్పునకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పశ్చిమలో ప్రధానంగా యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాలు, అదేవిధంగా కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ కరణం బలరాంలు రెండు వర్గాలుగా విడిపోయి చెరికొంత మంది అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారు. దీంతో అధికార పార్టీలో వర్గ విబేధాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలే అభ్యర్థుల మార్పుపైప్రచారం చేస్తుండడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్లు దక్కవని స్వపక్ష నేతలే ప్రచారం చేస్తుండడంతో సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ జిల్లా నేతల్లో పతాకస్థాయికి చేరిన విబేధాలే ఇందుకు కారణమని, çస్వపక్షం నేతలే టికెట్లు రాకుండా అడ్డకుంటున్నారని పాత నేతలు మండి పడుతున్నారు. తమకు మొండిచేయి చూపితే తామేంటో చూపిస్తామని టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు పంపుతున్నట్లు తెలుస్తోంది. 

వై.పాలెంలో మార్పు ఖాయం..
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యే డేవిడ్‌రాజును పక్కన పెట్టడం ఖాయంగా తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచి, ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌ రాజుకు రాబోయే ఎన్నికల్లో జనం ఓట్లేయరని టీడీపీ అధిష్టానం నిర్ణయానికొచ్చింది. ఇక  నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతలు ఈ దఫా డేవిడ్‌ రాజుకు టికెట్‌ ఇస్తే తాము పనిచేయమని అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు డేవిడ్‌రాజును పక్కన పెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీన్ని పసిగట్టిన డేవిడ్‌రాజు తనకు సంతనూతలపాడు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. 

బీఎన్‌కు మోకాలడ్డు..
సంతనూతలపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ విజయకుమార్‌ను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి సామాజికవర్గం నేతలు ఎలాగైనా విజయకుమార్‌ను తప్పించాలని ఇప్పటికే సీఎంతో పాటు మంత్రి లోకేష్‌కు సైతం పలుమార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గం విజయకుమార్‌కు మద్దతు పలుకుతుండగా దామచర్ల జనార్దన్‌ విజయకుమార్‌ను తప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత సామాజికవర్గాన్ని అడ్డుపెట్టి విజయకుమార్‌ను అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో దామచర్ల ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే దామచర్ల వర్గం విజయకుమార్‌కు టికెట్‌ లేదని ప్రచారం చేస్తోంది.

‘డోలా’యమానంలో కొండపి..
కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామికి రాబోయే ఎన్నికల్లో టికెట్‌ దక్కదనే ప్రచారం సాగుతోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తుండగా ఆయన సోదరుడైన దామచర్ల సత్య మద్దతు పలుకుతున్నారు. దీంతో దామచర్ల జూపూడి ప్రభాకర్‌రావును వచ్చే ఎన్నికల్లో కొండెపి అభ్యర్థిగా నిలపాలని పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సైతం జూపూడికి హామీ ఇచ్చినట్లు  ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిలో డోలా మార్పు ఉంటుందన్న  ప్రచారం ఉంది. అదే జరిగితే ఇక్కడ టీడీపీ పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లే!

కనిగిరిలో కన్ఫూజన్‌..
ఇక కనిగిరి ఎమ్మెల్యే బాబూరావుకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ రాదన్న ప్రచారం సాగుతోంది. సామాజికవర్గాల సమీకరణల నేపథ్యంలో బాబూరావుకు కాకుండా మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి టీడీపీ టికెట్‌ అభిస్తుందన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉగ్రకు హామీ ఇచ్చినట్టు సమాచారం. బాబూరావుకు ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే బాబూరావు వర్గం ఉగ్ర నరసింహారెడ్డికి  సహకరించడం సందేహమే.

కందులకూ అవకాశంఅనుమానమే..
మార్కాపురంలోనూ ఈ దఫా టీడీపీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం సాగుతోంది. కందుల నారాయణరెడ్డిని తప్పించి, రెడ్డి సామాజికవర్గం మరో నేతకు టీడీపీ టికెట్‌ ఇస్తారని, ఇందులో భాగంగా అధిష్టానం కసరత్తు సాగిస్తోందని టీడీపీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. మొత్తంగా  రాబోయే న్నికల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు ప్రచారం స్వపక్ష నేతల మధ్య అగ్గి రాజేస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top