నేతలకూ కోట్లు... టీడీపీ ఫీట్లు

TDP Leaders Threats to YSRCP Voters in Visakhapatnam - Sakshi

ఓటమి భయంతో మంత్రుల కొనుగోళ్లు రాజకీయం

ఓటమి భయంతో మంత్రుల కొనుగోళ్ల రాజకీయం

నర్సీపట్నంలో అయ్యన్న.. విశాఖ సిటీలో గంటా..

రూ.కోట్లు కుమ్మరించి ప్రత్యర్థి పార్టీల నేతల కొనుగోళ్లు

సాక్షి, విశాఖపట్నం: కుట్రలు.. కుతంత్రాలు.. కుయుక్తులు.. కొనుగోళ్లు.. ప్రలోభాలు.. వెరసి ఎలాగైనా సరే దొడ్డిదారిన మళ్లీ అందలం ఎక్కాలని అధికార టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం కోట్లు కుమ్మరించి సంతల్లో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలుచేసిన చందంగానే మళ్లీ పోలింగ్‌ ముంగిట కొనుగోళ్ల రాజకీయం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని ఈ ఓట్ల వ్యాపారం విశాఖ సిటీలో గడిచిన రెండు మూడు రోజులుగా సాగుతోంది. ఇదిగో వచ్చేస్తున్నారు.. అదిగో వచ్చేస్తున్నారంటూ ప్రచారం చేయడం.. రాత్రి పూట రూ.కోట్లు ఎరజూపి బేరాలు సాగించడం... తెల్లారేసరికి కండువాలు కప్పడం చేస్తున్నారు. ఓటమి భయంతో ప్రత్యర్థి పార్టీలోని నేతలను కోట్ల రూపాయలు వెదజల్లి కొనుగోళ్లు సాగిస్తున్నారు. నేతలు అమ్ముడు పోతున్నప్పటికీ ఎవరికి ఓటు వేయాలో తమకు బాగా తెలుసునని ఓటర్లు తెగేసి చెబుతున్నారు.

ఓటుకు రూ.5 వేలు వరకు...
సాధారణంగా టికెట్ల ఖరారు సమయంలో పార్టీ ఫిరాయింపులు జరుగుతాయి. టికెట్లు దక్కని అసంతృప్తివాదులు అటూ ఇటూ మారుతుండడం సహజం. కానీ పోలింగ్‌కు 48 గంటలున్న సమయంలో పార్టీలు మారడాలు ఎక్కడా జరగవు. కానీ విశాఖ జిల్లాలో ఈ తరహా విష సంస్కృతికి అధికార పార్టీ నేతలు తెరతీశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా విశాఖ జిల్లా అంతటా ఫ్యాన్‌ గాలి బలంగా వీస్తోంది. మూడు లోక్‌సభ స్థానాలతో పాటు మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో ఈసారి ఓటమి తప్పదన్న భయం అధికార తెలుగుదేశం పార్టీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ కారణంతోనే పోలింగ్‌ ముందు రోజు సాగించే ప్రలోభాలకు వారం రోజుల ముందుగానే తెరతీశారు. కోట్లు కుమ్మరించి ఓట్లు కొనుగోలు సాగిస్తున్నారు. ఓటుకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు పంచి పెడుతున్నారు. మరోవైపు అడిగిన వారికి.. అడగని వారికి కూడా సామాజిక వర్గాలు, మత సంస్థలకు రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు పంపకాలు సాగిస్తున్నారు. అయినా సరే ఈసారి ఓటర్లు తమను నమ్మరని తేలిపోవడంతో ప్రత్యర్థి శిబిరంలోని నేతల కొనుగోళ్లకు తెగపడుతున్నారు.

ఇద్దరు మంత్రులదీ ఒకటే దారి
రాష్ట్ర మంత్రులు సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు  మరో అడుగు ముందుకేసి ప్రత్యర్థి పార్టీలోని నేతలను సంతల్లో పశువుల్లా బేరాలు పెట్టి మరీ కొనుగోలు సాగిస్తున్నారు. నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన రుత్తల ఎర్రాపాత్రుడు వద్దకు కాళ్లబేరానికి వెళ్లి మరీ అయ్యన్న పార్టీలోకి తీసుకున్నారు. యలమంచలి నియోజకవర్గంలో కూడా ఇదే రీతిలో అధికార పార్టీ నేతలు వైఎస్సార్‌సీపీకి చెందిన బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావులను కోట్లు ఎరచూపి పార్టీలోకి తీసుకున్నారు. ఇక సిటీలో మంత్రి గంటా శ్రీనివాసరావు పగటి పూట బేటీలు.. రాత్రి పూట బేరసారాలు సాగిస్తూ ప్రత్యర్థి పార్టీలో నేతల కొనుగోళ్లకు తెగపడుతున్నాడు. వార్డు స్థాయి నేతల నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు కోట్లు కుమ్మరించి కొనుగోళ్లు సాగిస్తున్నారు. సిగ్గులేకుండా సాగిస్తున్న ఈ కొనుగోళ్ల పర్వం చూస్తుంటే ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. వైఎస్సార్‌ సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, డాక్టర్‌ పీవీ రమణమూర్తిలను ఇదే రీతిలో ఎరవేసి పార్టీ కండువాలు కప్పారు. ఒక్కొక్కరికి రూ.5కోట్లు ఎర చూపి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. చాలా మందిని కొనుగోలు చేయబోతున్నామంటూ సంకేతాలిస్తూ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు.

మరో 48 గంటల్లో పోలింగ్‌కు వెళ్లే సమయంలో ప్రత్యర్థుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా టీడీపీ పెద్దలు ఆడుతున్న కుట్ర రాజకీయాలను ప్రజలు ఇట్టే అర్థం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం లేదని... అధికార పార్టీకి అది వాపే తప్ప బలుపు ఎంతమాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. నేతలు అమ్ముడుపోయినా పర్వాలేదు... తాము వైఎస్సార్‌ సీపీ వెంటే ఉన్నామని పార్టీ శ్రేణులు ఓ వైపు తెగేసి చెబుతుంటే... మరోవైపు అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలను అర్ధం చేసుకోలేని అమాయకులం కాదని, ఈ నెల 11న వీచే ఫ్యాన్‌ గాలిలో అధికార పార్టీ ఎత్తులు చిత్తుకాక తప్పదని సామాన్య ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top