దాష్టీకం

tdp leaders attack on colony people - Sakshi

సమస్యలపై రోడ్డెక్కిన ముద్దిరెడ్డిపల్లి వాసులు

ఆగ్రహించిన అధికార పార్టీ నేతలు, కౌన్సిలర్లు

ఆందోళనకారులపై విచక్షణారహితంగా దాడి

దుర్భాషలాడుతూ కర్రలతో తరిమికొట్టేయత్నం

పోలీసుల ప్రేక్షకపాత్ర.. ‘ఛీ’దరించుకున్న జనం

ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్తతోపాటు ఇద్దరు కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, వారి అనుచరులు రౌడీల్లా వ్యవహరించారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ.. ఆందోళనకారులపై ప్లకార్డులు, కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తే ఎవరికైనా ఇంతే అంటూ తమ హావభావాలతో భయపెట్టారు.

హిందూపురం అర్బన్‌: హిందూపురం మునిసిపాలిటీలో ముద్దిరెడ్డిపల్లి ప్రాంతం కీలకమైనది. ఇక్కడ చేనేత కార్మికులు, వ్యాపారులు అధికంగా ఉంటారు. ఇక్కడి ప్రజలు ఇంటిగుత్తలు, ఇతర పన్నులతో ప్రతి ఏటా రూ.50 లక్షలకు పైగా చెల్లిస్తున్నా సరైన రోడ్లు, అవసరమైన డ్రెయినేజీలు లేవు. మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి ఆధ్వర్యంలో ముద్దిరెడ్డిపల్లి కాలనీవాసులు సోమవారం మేళాపురం క్రాస్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ సర్థిచెప్పడానికి ప్రయత్నించారు. తమకు చైర్‌పర్సన్, అధికారులు గట్టి హామీ ఇస్తేగానీ ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. ఆందోళన చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే మేళాపురం ఆటో స్టాండ్‌ వద్ద (33వ వార్డు) ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమానికి చైర్‌పర్సన్‌ వచ్చారని, ఆమెతో మాట్లాడిస్తామని వారిని అక్కడి నుంచి పక్కకు పంపించారు.

దుర్భాషలాడుతూ కాలనీవాసులపై దాడి..
తమ సమస్యలపై నినాదాలు చేసుకుంటూ వస్తున్న ముద్దిరెడ్డిపల్లి వాసులను గమనించిన చైర్‌పర్సన్‌ రావెళ్ల లక్ష్మి భర్త అయిన టీడీపీ నేత నాగరాజు, ఆ పార్టీ కౌన్సిలర్‌ నంజప్ప, నింకంపల్లి రామాంజి, మరికొందరు నాయకులు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురెళ్లి దుర్భాషలాడారు. అడ్డువచ్చిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌ నాగభూషణంపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు. కాలనీవాసులు నారాయణ, తిప్పన్న మరికొందరిపై విరుచుకుపడి దాడి చేశారు. ప్లకార్డు కర్రలతో చితకబాదారు. ‘మాకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే..’ అంటూ నాలుక మడతపెట్టి.. వేలు చూపుతూ వీరంగం వేశారు. రౌడీలను తలపించిన వీరి తీరును చూసి ముద్దిరెడ్డిపల్లివాసులు, స్థానికులు చీదరించుకున్నారు.  విషయం తెలుసుకున్న ఇన్‌చార్జి సీఐ వెంకటేశులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ముద్దిరెడ్డిపల్లివాసులను వెనక్కు పంపించేశారు. అధికార పార్టీ నేతలు దుర్భషలాడుతూ దాడికి పాల్పడుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది.

ఆందోళనకారులపైకి దూసుకొస్తున్న టీడీపీ నేతలు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top