సర్వేలు, పబ్లిక్‌ టాక్‌తో తమ్ముళ్ల బెంబేలు

TDP Leaders Are In Shock With Surveys and Public Talk - Sakshi

ఓటమి తప్పదని అన్ని సర్వేల్లో తేలుతుండడంతో ఆందోళన

క్యాడర్‌లో స్థైర్యం నింపేందుకు టీడీపీ నేతల తంటాలు

సాక్షి, అమరావతి: పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న సర్వేలు, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తితో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. ఎంత హడావుడి చేసినా క్షేత్రస్థాయిలో సానుకూలత కనిపించకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నాయి. అన్నిచోట్లా పబ్లిక్‌ టాక్‌ టీడీపీకి వ్యతిరేకంగా ఉండడంతో ముఖ్య నాయకులు సైతం లోలోన ఆందోళనకు గురవుతున్నారు. జాతీయ చానళ్లు చేస్తున్న సర్వేలు, పలు సర్వే సంస్థలు ఇస్తున్న నివేదికలన్నీ ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, జగన్‌కు ఒక్క చాన్స్‌ ఇవ్వాలనే ట్రెండ్‌ ప్రజల్లో బలంగా ఉన్నదనే విషయాన్ని స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల నియమావళి ప్రకారం ఈ సర్వేలు బయటకు రాకపోయినా అనధికారికంగా ఆ వివరాలు ప్రధాన పార్టీలు, నాయకులకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని స్పష్టంగా అంచనా వేసి చెప్పిన ఒక నమ్మకమైన సంస్థ తాజాగా ఏపీలో చేసిన సర్వేలోనూ జగన్‌కు సానుకూల వాతావరణం ఉందని, చంద్రబాబు మాటల్ని ప్రజలు నమ్మట్లేదని, ప్రజల్ని నమ్మించేందుకు టీడీపీ అనుసరించిన వ్యూహాలేవీ ఫలించట్లేదని తేల్చింది. ఈ సర్వే వివరాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతుండడంతో టీడీపీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డీలాపడుతున్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు పెరట్లోని తోక పత్రిక లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సంస్థ ఇటీవల సర్వే చేసి టీడీపీ అద్భుత విజయం సాధిస్తుందని చెప్పినట్లు ప్రచురించింది. కానీ తాము అసలు సర్వే చేయలేదని సీఎస్‌డీఎస్‌ సంస్థ ప్రకటించి తమ పేరుతో సర్వేను ప్రచురించిన ఆ పత్రికపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు సర్వేలన్నీ ఏపీలో జగన్‌ ప్రభంజనం ఖాయమని చెబుతుండడం, దాన్ని అడ్డుకునేందుకు తోక పత్రిక టీడీపీకి అనుకూలంగా దొంగ సర్వేను ప్రచురించి అభాసులపాలవడంతో ఆ పార్టీ శ్రేణులు మరింత కుంగిపోయాయి.

క్యాడర్‌ నీరుగారిపోకుండా నాయకుల ప్రయత్నాలు.. 
ఈ పరిస్థితుల్లో క్యాడర్‌ నీరుగారిపోకుండా చూసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. పబ్లిక్‌ టాక్‌ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నా పోల్‌ మేనేజ్‌మెంట్‌తో చివరి రెండు రోజులు ట్రెండ్‌ మారుతుందని క్యాడర్‌కు ధైర్యం చెప్పి నియోజకవర్గాల్లో పనిచేయిస్తున్నారు. డబ్బు పంపిణీ మొదలు పెట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో కొంత అనుకూలత ఉంటుందని, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని పార్టీ ముఖ్య నాయకులు క్యాడర్‌కు సందేశం పంపుతున్నారు. చంద్రబాబు చివర్లో ఏదో ఒక మాయ చేస్తారని, అప్పుడు ఒక్కసారిగా సీను రివర్స్‌ అవుతుందని జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రచారం చేస్తున్నారు.

అయితే ఎన్నికలకు ఇంకా ఎనిమిది రోజులే సమయం మిగిలి ఉండడంతో ఇంకా ఏం చేస్తారని, చేయాల్సినవన్నీ చేసేశారు కదా అని టీడీపీ శ్రేణులు ఆందోళనతో చర్చించుకుంటున్నాయి. చంద్రబాబు చేసే మ్యాజిక్‌ ఏముంటుందా? అని మల్లగుల్లాలు పడుతున్నాయి. రైతులకు రెండోవిడత అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు రెండో విడత పసుపు కుంకుమ సొమ్ములు వారి అకౌంట్‌లో జమయ్యాక కొంత మార్పు వస్తుందని చెప్పినా దాని ప్రభావం ఉండే అవకాశం తక్కువగా ఉందని పార్టీ దిగువశ్రేణి నాయకత్వం వాపోతోంది. పార్టీ ముఖ్య నాయకత్వం ధైర్యం చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితులు, వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆదరణతో పార్టీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top