‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంపై సర్కారు వణుకు

TDP Govt In Shock With Avineethi Chakravarthy Book - Sakshi

ప్రభుత్వంలో, టీడీపీలో తీవ్ర ప్రకంపనలు

నష్టనివారణ చర్యలకు దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు

పుస్తకంలోని అంశాలకు వివరణలు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులకు ఆదేశం 

సీఎం తీరుపై అధికారుల ఆగ్రహం

వాస్తవాలను ఎలా వక్రీకరిస్తామని మండిపాటు 

‘అవినీతి చక్రవర్తి’ పుస్తకంలోని అంశాలన్నీ అక్షర సత్యాలని స్పష్టీకరణ 

తమను బలిపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం

తప్పుడు వివరణలు ఇవ్వడం తమ వల్ల కాదంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగించిన రూ.6.17 లక్షల కోట్ల దోపిడీపై ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం ప్రభుత్వంలో, అధికార తెలుగుదేశం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పుస్తకాన్ని ఆమూలాగ్రం చదివిన ప్రజలు చంద్రబాబు దోపిడీ తీరును తెలుసుకుని ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. గ్రామాల్లో రచ్చబండలపై ఇదే అంశంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ చంద్రబాబుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు అవినీతిని సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్‌సీపీ బయటపెట్టడంతో ఏం మాట్లాడాలో తెలియక గింజుకుంటున్నారు. ‘అవినీతి చక్రవర్తి’ పుస్తకం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలిశాయని, ప్రభుత్వ పెద్దల అవినీతిపై మండిపడుతున్నారని నిఘా వర్గాలు, టీడీపీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. అవినీతి చక్రవరి పుస్తకంలోని అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో వివరణలు(రిజాయిండర్లు) తయారు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆ పుస్తకంలోని ఆయా అంశాలను సంబంధిత శాఖలకు పంపించి, వివరణలు రూపొందించాలని లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. 

మేమేనా బలిపశువులం.. 
ముఖ్యమంత్రి ఆదేశాలపై ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు చేసిన దోపిడీకి తామెలా బాధ్యత వహిస్తామని ప్రశ్నిస్తున్నారు. తమను బలిపశువులను చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అవినీతిపై తమను వివరణ ఇవ్వాలని ఆదేశించడం ఏమిటని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు నిలదీశారు. అవినీతి చక్రవర్తి పుస్తకంలోని అంశాలన్నీ వాస్తవాలేనని, అందుకు సాక్ష్యాలుగా జీవోలు కూడా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో తాము వాటికి వివరణ ఇవ్వడం ఎలా సాధ్యమని అధికారులు అంటున్నారు. ఇప్పుడు వివరణలు ఇస్తే భవిష్యత్తులోతమకు ఇవన్నీ తలనొప్పిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పుస్తకంలోని అంశాలన్నీ అక్షర సత్యాలు 
తాము అధికారంలోకి రాగానే టీడీపీ పెద్దల అవినీతిపై విచారణ జరిపిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులతో వివరణల పేరిట సీఎం చంద్రబాబు కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగున్నరేళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని ఏకంగా ప్రభుత్వ అధికారులతోనే చెప్పిస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అధికారులతో వివరణలు ఇప్పించాలని ఆదేశించినట్లు ప్రభుత్వ యంత్రాంగం అనుమానిస్తోంది. ఈ వ్యవహారంలో తమను ఇరికించి, ప్రభుత్వ పెద్దలు తప్పించుకోవాలని చూస్తున్నారని అధికారులు ఆరోపిస్తున్నారు. అవినీతి చక్రవర్తి పుస్తకంలో పేర్కొన్న అంశాలన్నీ అక్షర సత్యాలేననే, సంబంధిత ఫైళ్లు, జీవోలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పుస్తకంలోని అంశాలన్నీ తప్పు అంటూ వివరణలు ఇవ్వడం సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు.   

నిజాలు ఆ ఫైల్‌లోనే ఉన్నాయి..
ఉదాహరణకు విశాఖపట్నంలో ప్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ సంస్థకు తక్కువ ధరకే భూమిని కేటాయించిన విషయం వాస్తవమేనని, రూ.400 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించవద్దంటూ సంబంధిత ఫైలులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) స్పష్టంగా పేర్కొన్నారని, అంతే కాకుండా అమెరికాలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయం 10 ఎకరాల్లోనే ఉందని, విశాఖపట్నంలో 25 ఎకరాలు ఎందుకని సీఎస్‌ పేర్కొన్నారని, ఇప్పుడు అది నిజం కాదంటూ వివరణ ఎలా ఇస్తామని ఒక అధికారి ప్రశ్నించారు. వాస్తవానికి ఆ ఫైలులో పేర్కొన్న అంశాలతోనే రిజాయిండర్‌ రూపొందించాల్సి ఉంటుందని, తక్కువ ధరకు భూమి కేటాయించలేదని వివరణ ఇస్తే.. ప్రభుత్వం మారిన తరువాత విచారణ జరిగితే తమకు ఇబ్బందులు తప్పవని అన్నారు. 

అవినీతి జరగలేదని చెప్పాలా? 
పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో రూ.376 కోట్లు, పోలవరం ప్రాజెక్టులో రూ.1,819 కోట్ల అవినీతి జరిగినట్లు సాక్షాత్తూ ‘కాగ్‌’ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అందులో ఏమాత్రం అవినీతి జరగలేదని వివరణ ఎలా ఇవ్వాలో ఇక ప్రభుత్వ పెద్దలే చెప్పాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు. నీరు–చెట్టు కార్యక్రమంలో ఇప్పటిదాకా రూ.16 వేల కోట్లకు పైగా విలువైన పనులు చేయగా, ఇవన్నీ నామినేషన్‌ విధానంలో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. ఈ వ్యవహారంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది. దీనిపై రిజాయిండర్‌ ఎలా తయారు చేస్తామని అధికారులు అంటున్నారు. ఇలా అన్నీ అంశాలపై తప్పుడు వివరణలు ఇవ్వడం తమ వల్ల కాదని తేల్చిచెబుతున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top