పది అంశాలపై శ్వేతపత్రాలు

TDP Govt Decision about to release Whitepapers on Ten topics  - Sakshi

విభజన చట్టం అమలు,ఆర్థిక పరిస్థితి, రైతుల సంక్షేమం 

తదితరాలపై విడుదలకు రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం

ఐదు ప్రైవేట్‌ వర్సిటీలకు ఆమోదం 

610 మంది లాంగ్వేజ్‌ పండిట్లు, 262 మంది పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

భీమవరంలో ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ యూనివర్సిటీ

ఆదరణ–2 సబ్సిడీ 90 శాతానికి పెంపు

రూ.2,046 కోట్లతో పెట్టుబడిలేని ప్రకృతి సాగు ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు తీరుతో సహా మొత్తం పది అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కాలవ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఆర్ధిక పరిస్థితి– వృద్ధి రేటు, రైతుల సంక్షేమం, సహజ వనరుల నిర్వహణ, గ్రామాలు–పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యుత్‌–ట్రంక్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సుపరిపాలన తదితర అంశాలపై 10 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆదరణ–2 పథకం కింద ఇచ్చే సబ్సిడీని 70 నుంచి 90 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. మంత్రివర్గ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవీ... 

పదోన్నతులు...
రాష్ట్రంలో 2,585 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లకు (సివిల్‌) హెడ్‌ కానిస్టేబుళ్లుగా, 566 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు (సివిల్‌)గా పదోన్నతి కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం. మునిసిపల్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 610 మంది గ్రేడ్‌ –2 లాంగ్వేజ్‌ పండిట్లు, 262 మంది పీఈటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి. చిత్తూరు జిల్లా కుప్పంలో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఫస్ట్‌ క్లాసు కోర్టు) పోస్టు మంజూరు, 20 పోస్టుల భర్తీకి నిర్ణయం.

కొత్తగా ఐదు ప్రైవేట్‌ వర్సిటీలు...
రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రైవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా మురకం బట్టులో అపోలో యూనివర్సిటీ, తిరుపతిలో గ్లోబల్‌ డిజిటల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో టెక్నో ఇండియా యూనివర్శిటీ, విశాఖపట్నంలో ‘అనీషా రుబికా యునైటెడ్‌ వరల్డ్‌ యూనివర్శిటీ ఇన్‌ ఇంటెలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌ ఫర్‌ డిజిటల్‌ పెడగోగియస్‌’తోపాటు ఒంగోలులో ఓం శ్రీ గాయత్రి విశ్వకర్మ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

పార్వతీపురం హార్టికల్చర్‌ కళాశాలకు పది పోస్టులు..
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ అనుబంధ  వ్యవసాయ కళాశాలల నుంచి అఫిలియేషన్‌ ఫీజు కింద ఏటా రూ.5 లక్షల చొప్పున వసూలు ప్రతిపాదనకు ఆమోదం లభించింది. భీమవరంలో ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌ మ్యారిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. పోలవరం ప్రాజెక్టు తొలి గేట్‌ను ఈ నెల 27న ఎరక్ట్‌ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పెట్టుబడి లేని ప్రకృతి సాగు కార్యక్రమం చేపట్టేందుకు రూ.2,046 కోట్లతో కేంద్ర వ్యవసాయ శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం. విజయనగరం జిల్లా పార్వతిపురంలోని హార్టీకల్చర్‌ కళాశాలలో రెండో విద్యా సంవత్సరం కోసం 10 పోస్టులు మంజూరు. రాజమండ్రిలోని ఏసీబీ స్పెషల్‌ కోర్టులో 5 పోస్టుల భర్తీకి నిర్ణయం. 

‘పతంజలి’కి గడువు పెంపు.....
పతంజలి ఆయుర్వేద సంస్థ 452.9959 మెట్రిక్‌ టన్నుల ఎర్రచందనం నిల్వల్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30వ తేదీ వరకు నిల్వ చేసుకునేలా గడువు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ విండ్, సోలార్, హైబ్రీడ్‌ పవర్‌ పాలసీ–2018 ప్రతిపాదనకు ఆమోదం. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లిలో జీన్స్‌ గార్మెంట్స్‌ అండ్‌ ఫ్యాబ్రిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అరవింద్‌ లిమిటెడ్‌కు 130 ఎకరాల భూమి కేటాయించేందుకు ఆమోదం. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం దర్గా హొన్నూరులో పీహెచ్‌సీ ఏర్పాటుకు అనుమతి లభించింది. 

భూముల ధర తగ్గింపు...
సీఆర్‌డీఏ పరిధిలో పలు సంస్థలకు గతంలో ఇచ్చిన భూముల ధరలను తగ్గించడం, లీజు నిబంధనలు సడలించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థకు 7.5 ఎకరాలు, ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు 57 సెంట్లు, ద ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆల్టర్‌నేటివ్‌ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ సంస్థకు ఎకరం, ఏపీ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌ డిపార్టుమెంట్‌కు 4.23 ఎకరాలు, ఏపీ పబ్లిక్‌ లైబ్రరీస్‌ డిపార్టుమెంట్‌కు 4 ఎకరాలు, ఏపీ ఉన్నత విద్యామండలికి 3 ఎకరాలు, ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌కు మూడు ఎకరాలు కేటాయించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top