దశల వారీగా దగా!

TDP Cheats Outsourcing Employees in 2014 Elections - Sakshi

క్రమబద్ధీకరణపై ఉద్యోగులకు టీడీపీ సర్కారు మోసం

ఉద్యోగుల వివరాలు, లెక్కల  పేరుతో కాలయాపన

నెలలోపే నివేదిక ఇస్తామని ఐదేళ్లుగా ఉలుకూ పలుకూ లేని మంత్రుల కమిటీ

ఉన్న హక్కులనూ హరించేలా జీవోలు

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ఉద్యోగులందరినీ దశలవారీగా క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రతకల్పిస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మినందుకు 50 వేల మందికిపైగా సిబ్బంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా  ఒక్క కాంట్రాక్టు ఉద్యోగిని కూడా క్రమబద్ధీకరించకపోగా జీవో 27 ద్వారా తమహక్కులను సైతం కాలరాశారని ఆక్రోశిస్తున్నారు. బాబు వస్తే జాబుకు భద్రత ఉండదని మరోసారి రుజువైందనిచెబుతున్నారు. క్రమబద్ధీకరణపై నెలలోపే నివేదిక ఇస్తామని 2014 సెప్టెంబర్‌ 9న ప్రకటించిన మంత్రుల కమిటీ  ఐదేళ్లుగా మభ్యపెడుతూ వచ్చింది. వాస్తవానికి ఈ లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కమిటీ నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ™ öక్కి పెట్టిందనే అనుమానాలను ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

న్యాయ సలహాకు రెండేళ్లు..
2016లో ఈ అంశం మరోసారి తెరపైకి రావడంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించలేమని, నిబంధనలు అలా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో కనీసం తమనైనా క్రమబద్ధీకరిస్తారని కాంట్రాక్టు ఉద్యోగులు ఆశపడ్డా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకుండానే కాలం వెల్లదీసింది. తొలి మూడేళ్లు మోసపూరిత మాటలతో నెట్టుకొచ్చిన సర్కారు 2017లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై న్యాయ సలహా కోసం అడ్వకేట్‌ జనరల్‌కు పంపినట్లు పేర్కొన్నా రెండేళ్లుగా స్పందన లేదు.  

 వైఎస్‌ హయాంలో ఏం జరిగింది?
వైఎస్సార్‌ సీఎంగా ఉన్న సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేసేలా పలు జీవోలిచ్చారు. రెగ్యులర్‌ ఉద్యోగుల తరహాలోనే టైం స్కేల్‌ ఇచ్చినప్పుడల్లా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని జీవో ఇచ్చారు. దీనివల్ల 2005 నాటి పీఆర్‌సీ వర్తించడంతో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు భారీ లబ్ధి చేకూరింది. 2011లో విడుదలైన అనుబంధ జీవో 3 ద్వారా కూడా 2010 పీఆర్‌సీని కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తింప చేశారు. ఎరియర్స్, మానిటరీ బెనిఫిట్స్‌ కూడా ఇవ్వడంతో అప్పట్లో ఉద్యోగులంతా సంతృప్తి వ్యక్తం చేశారు.

జీవోలు ఏం చెబుతున్నాయంటే?
2008లో సీఎం వైఎస్సార్‌ హయాంలో జారీ అయిన జీవో నెం.4279 ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం టైమ్‌ స్కేలు వర్తింప చేయాలి. దీని ఆధారంగానే 2005 పీఆర్‌సీని వర్తింపచేశారు. దీంతోపాటు 6 ఎరియర్లు, మానిటరీ బెనిఫిట్స్‌ కూడా ఇచ్చారు.
దీనికి అనుబంధంగా 2011లో జీవో నెం.3 విడుదలైంది. దీని ఆధారంగా 2010 పీఆర్‌సీ ప్రకారం వేతనాలు పెంచారు.
2017లో టీడీపీ సర్కారు ఇచ్చిన జీవో నెం.95 ప్రకారం గతంలో మాదిరిగా పేస్కేలు వర్తింప చేయకుండా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ 50 శాతమే వేతనాలు పెంచడంతో నష్టపోయారు.
2018లో ఇచ్చిన జీవో 27 ద్వారా పేస్కేలు లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులు అనే పేరు స్థానంలో కన్సాలిడేటెడ్‌ అని చేర్చారు. వేతనం పెంచినప్పుడు తీసుకోవడమే గానీ మిగతా బెనిఫిట్స్‌ ఉండవని సర్కారు పేర్కొంది.  

కోర్టు తీర్పులు ఇలా
నియామక సమయంలో రాజ్యాంగ విధివిధానాలు పాటించిన ఉద్యోగాలకు క్రమబద్ధీకరణ హక్కు ఉన్నట్లు ఉమాదేవి–వర్సెస్‌ కర్నాటక స్టేట్‌ గవర్నమెంట్‌ కేసు విషయంలో సుప్రీంతీర్పు చెప్పింది.
రాజ్యాంగంలోని అధికరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొంది. దీన్ని అనుసరించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించడం, అనుభవజ్ఞులతో కూడిన సెలక్షన్‌ కమిటీ  ద్వారా చేపట్టిన నియామకాలైతే క్రమబద్ధీకరణకు అర్హత ఉందని చెప్పింది.
మంజూరైన పోస్టుల్లో విధివిధానాలను పాటిస్తూ ఎంపికైన వారైతే బీసీ సంక్షేమశాఖలో పదేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఉమాదేవి కేసును ఉటంకిస్తూ ఉమ్మడి ఏపీ హైకోర్టు 2010 నవంబర్‌ 2న తీర్పు ఇచ్చింది.
వైద్యాధికారులు జారీ చేసిన ప్రకటన ద్వారా దరఖాస్తు చేసుకుని పదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఉంటే వారిని క్రమబద్ధీకరించాలని ఏఎన్‌ఎంలకు సంబంధించి రాజస్థాన్‌ హైకోర్టు తీర్పునిచ్చింది.     మూడేళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని క్రమబద్ధీకరించాలని బాంబే హైకోర్టు (డబ్లు్యపీ నం.2046/10) తీర్పు ఇచ్చింది.  

కోర్టు కేసులు సాకు మాత్రమే
కోర్టులో కేసుల వల్లే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించలేకపోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని పేర్కొంటున్నారు. ఒకవేళ నిజంగానే కేసులుంటే తమను క్రమబద్ధీకరిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో ఎలా టీడీపీ హామీ ఇచ్చిందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పలు రాష్ట్రాలు క్రమబద్ధీకరణను అమలు చేశాయని స్పష్టం చేస్తున్నారు.  

టీడీపీ దారుణంగా మోసగించింది...
అధికారంలోకి రాగానే దశలవారీగా క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. చివరకు పీఆర్‌సీ ప్రకారం కూడా వేతనాలు పెంచకుండా వంచించారు. జీవో నెం.27 విడుదల చేసి ఉన్న హక్కులను కాలరాయడంపై కాంట్రాక్టు ఉద్యోగులు ఆవేదనతో రగిలిపోతున్నారు.      –మేసా ప్రసాద్‌ (ఏపీ హెల్త్‌ మెడికల్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top