హస్తం, దేశం పొత్తు కొలిక్కి?

TDP and Congress alliance finalized? - Sakshi

     టీడీపీకి 15 అసెంబ్లీ.. ఒక ఎంపీ సీటు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్న టీ కాంగ్రెస్‌

     ముందస్తు ఖరారైతే ఈ నెలలోనే అంగీకారం?

     రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీట్లకు ఆఫర్‌

     సెటిలర్ల ప్రభావిత అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధం?

     ఖమ్మం లోక్‌సభ... అనివార్యమైతే మల్కాజ్‌గిరి సీటు కూడా

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే దిశగా కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తు పొడుస్తోందా? ఇరు పార్టీల మధ్య పొత్తు కసరత్తు కొలిక్కి వస్తోందా? ఈ ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. తమకు 30 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు కావాలని తొలుత ప్రతిపాదించిన టీడీపీ నేతలు చివరకు టీపీసీసీ 15 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంతో సరిపెట్టుకునేందుకు అంగీకరించారని, కాంగ్రెస్‌ కూడా ఈ మేరకు సానుకూలంగానే ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖరారైతే ఇరు పార్టీలు ఈ నెలలోనే ఓ అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. 

సెటిలర్ల స్థానాల్లో సీట్లిచ్చేందుకు కాంగ్రెస్‌ మొగ్గు 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల ఆధారంగా 30 చోట్ల తమ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశమివ్వాలని టీడీపీ నేతలు చర్చల్లో ప్రతిపాదించారు. అయితే ప్రధాన ప్రతిపక్షంగా తాము చాలా మంది నేతలను సర్దుబాటు చేయాల్సి వస్తుందని, అన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్‌ తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనేక తర్జనభర్జనల తర్వాత టీడీపీకి 15 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పెద్దలు సుముఖంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. అందులో ప్రధానంగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొన్ని సీట్లు ఉండగా నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనూ ఒకటి, రెండు స్థానాల చొప్పున ఉన్నాయి. ముఖ్యంగా సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ శివారు నియోజకవర్గాలను టీడీపీకి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ మొగ్గుచూపుతోంది. అందులో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్‌గిరితోపాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాలున్నాయి.

వాటికితోడు తెలుగుదేశం పార్టీలో మిగిలిన నేతలను సర్దుబాటు చేసేందుకు కూడా కాంగ్రెస్‌ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో సండ్ర వెంకట వీరయ్య ఎలాగూ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కనుక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి అసెంబ్లీని తప్పకుండా వదులుకోవాల్సి వస్తుందని టీపీసీసీ నేతలే చెబుతున్నారు. అలాగే ఎల్‌.రమణ (జగిత్యాల), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (వనపర్తి లేదా దేవరకద్ర), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మక్తల్‌), మండవ వెంకటేశ్వరరావు (నిజామాబాద్‌ రూరల్‌), అన్నపూర్ణమ్మ (బాల్కొండ లేదా ఆర్మూరు), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (నర్సంపేట లేదా పరకాల)లకు అవకాశం కల్పించాలని టీడీపీ గట్టిగా కోరుతోంది. టీడీపీ కోరుతున్న స్థానాల్లో కాంగ్రెస్‌ కీలక నేతలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డి సీట్లు కూడా ఉండటం గమనార్హం.

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జడ్చర్ల స్థానాన్ని కూడా కోరుతున్నా అక్కడి నుంచి టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి టికెట్‌ ఆశిస్తున్న నేపథ్యంలో ఆయన్ను నాగర్‌ కర్నూల్‌ పార్లమెంటుకు పంపాల్సి వస్తేనే అది సాధ్యమవుతుందని టీపీసీసీ నేతలు అంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ స్థానాన్ని కూడా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లం మల్లయ్య యాదవ్‌ కోసం టీడీపీ పట్టుపడుతోంది. అయితే అక్కడ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కూడా టీడీపీకి ఇవ్వాల్సివచ్చే పక్షంలో పద్మావతిని నల్లగొండ పార్లమెంటు నుంచి పోటీ చేయించనున్నట్టు సమాచారం. ఇక జగిత్యాల నుంచి సీనియర్‌ ఎమ్మెల్యే టి. జీవన్‌రెడ్డి (కాంగ్రెస్‌) ప్రాతినిధ్యం వహిస్తుండడంతో ఈ నియోజకవర్గంపై తుది నిర్ణయం అంత ఈజీ కాదని, చివరి దశ చర్చల్లోనే తేలుతుందని అంటున్నారు.  

ఖమ్మం లోక్‌సభకు ఓకే... 
లోక్‌సభకు ఐదు చోట్ల అవకాశమివ్వాలని టీడీపీ కోరినా... ఖమ్మం లోక్‌సభ విషయంలో ఇరువర్గాల్లోనూ అభ్యంతరాలు లేకపోవడంతో ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్‌ దాదాపుగా వచ్చింది. అక్కడ టీడీపీ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు గట్టి అభ్యర్థి అవుతారనే అంచనాతోనే ఇరువర్గాలు ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. లోక్‌సభ రెండో స్థానం కింద మల్కాజ్‌గిరి స్థానాన్ని కూడా టీడీపీ ఆశిస్తోంది. అక్కడ బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచన ఉన్నా సెటిలర్ల ఓట్లు, కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి లేదా మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిని బరిలో దించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో తుది దశ చర్చల వరకు ఈ అంశం పెండింగ్‌లోనే ఉండే అవకాశాలున్నాయి.

పొత్తు పొడుస్తోందిలా...! 
జాతీయ స్థాయిలో క్రమంగా మారిన పరిణామాలు, రాష్ట్రస్థాయిలో నెలకొన్న అనివార్యత రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తుకు దారితీస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలంటే తక్కువే అయినా... కొన్ని చోట్ల కేడర్‌ ఉన్న టీడీపీతో జతకడితేనే బాగుంటుందనే అభిప్రాయానికి టీపీసీసీ ముఖ్యులు ఎప్పుడో వచ్చారు. ఆ కోణంలోనే పొత్తుల చర్చ ఎక్కడ వచ్చినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలెవరూ ఇంతవరకు ఖండించలేదు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్, టీడీపీలు కలిసే పోటీ చేస్తాయనే అంచనాకు రాజకీయ వర్గాలు వస్తున్నాయి. చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ పొత్తు చర్చల్లో కాంగ్రెస్‌ నుంచి ఢిల్లీ పెద్దలు, ఒకరిద్దరు రాష్ట్ర ముఖ్య నేతలే భాగస్వాములవుతున్నారు.

టీడీపీ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయనకు అత్యంత ఆప్తుడైన ఓ మీడియా గ్రూపు యజమాని, ఓ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెద్దలు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్‌గాంధీ కార్యాలయం బాధ్యత అప్పగించిన ఓ కేంద్ర మాజీ మంత్రి, మరో ముఖ్య నాయకుడితో టీడీపీ వర్గాలు ఇప్పటికే చర్చలు జరిపాయి. ఆ చర్చల్లోనే ఏయే స్థానాలు టీడీపీకి కేటాయించాలనే ప్రతిపాదనలపై చర్చలు జరిగి కసరత్తు తుది దశకు వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు ‘ముందస్తు’సంకేతాల నేపథ్యంలో పరిస్థితులనుబట్టి ఇరు పార్టీల రాష్ట్ర నేతల భేటీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top