చర్చ.. రచ్చ

TDP And BJP Leaders Conflicts on Devolopment Works Meeting - Sakshi

అభివృద్ధిపై చర్చకు కాలుదువ్వుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు

యుద్ధ వాతావరణం ఏర్పడటంతో భారీగా మోహరించిన పోలీసులు

జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు, ఎమ్మెల్యే మాణిక్యాలరావుల గృహ నిర్బంధం

ఇంటి గోడ దూకిన ఎమ్మెల్యేను బలవంతంగా లోపలికి పంపిన వైనం

సాయంత్రానికి శాంతించిన ఇరువర్గాలు

టైం నువ్వు చెప్పినా సరే – నన్ను చెప్పమన్నా సరే...  ప్లేస్‌ నువ్వు చెప్పినా సరే – నన్ను చెప్పమన్నా సరే... ఎక్కడికి రమ్మంటే అక్కడికే వస్తా అంటూ ఒకరు...గురువారం ఉదయం పది గంటలు, స్థలం వెంకట్రామన్నగూడెం. ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, మరో వందమంది కార్యకర్తలతో వస్తానని మరొకరు...ఓకే ఆల్‌రైట్‌. కాని ఉదయం పది కాదు. మధ్యాహ్నం మూడు గంటలు అంటూ మరొకరు. ఇలా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ఒకరిపై మరొకరు అభివృద్ధిపై చర్చ అంటూ తాడేపల్లిగూడెంలో హైడ్రామాను రక్తి కట్టించారు.

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి, ఏలూరు, తాడేపల్లిగూడెం: కమలాన్ని సైకిల్‌పై ఎక్కించుకొని ఊరేగించినప్పుడు అందరూ కమ్మని కబుర్లు చెప్పారు. కలలుగన్న అభివృద్ధికి మా కలయికే నిదర్శనమన్నారు. నాలుగేళ్లపాటు కలిసి కాపురం చేశారు. మంత్రి పదవి కూడా నిర్వహించారు. నీ తొలిచూపులోనే అన్న విధంగా సార్వత్రిక ఎన్నికల సంబరం ముగిసే వరకు నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం నాయకులు ఇదే తరహా కలరింగ్‌ ఇచ్చారు. ఆ రంగుల కల వెలిసిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కమలం రేఖలు విచ్చుకున్నాయంటే మేం కొట్టిన గాలి, మా సైకిల్‌ పవరే కారణమన్నారు. ఎన్నికల కల కరిగిపోగానే ముచ్చటగా మూడు నెలలు కూడా నిండకుండానే బీజేపీ, తెలుగుదేశం నాయకుల మధ్య సయోధ్య లేకుండా పోయింది. ఒకే ప్రభుత్వం జీఓలిచ్చినా. ఆ జీఓలను స్వయంగా రాష్ట్ర మంత్రి హోదాలో తీసుకువచ్చినా క్షేత్రస్థాయిలో అమలుకాని దుర్భర పరిస్థితి ఎదురైంది. పనులు కాకున్నా మాణిక్యాలరావు తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగారు. నాలుగేళ్ల క్రితం స్వయానా ముఖ్యమంత్రి నిట్‌ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. గూడెం అభివృద్ధికి చాలా హామీలు ఇచ్చారు.

నిట్‌ను గూడెంలో ఏర్పాటు కాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారంటూ పట్టణంలో పెద్ద అలజడి లేచింది. దీనికి టీడీపీ ప్రజాప్రతినిధులు కారణమని వారిపై పదవిని అలంకరించిన ఏడాదికే మాణిక్యాలరావు యుద్ధం ప్రకటించారు. ఈ పోరులో మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాసు మొదట్లో మాణిక్యాలరావుకు సంపూర్ణ సహకారం అందించారు. నిట్‌ వేదికపై ప్రోటోకాల్‌ వివాదం బొలిశెట్టి, పైడికొండల మధ్య అంతరాన్ని పెంచింది. గ్యాప్‌ పెరిగింది. మునిసిపల్‌ చైర్మన్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బాపిరాజుకు చేరువయ్యారు. అక్కడి నుంచిప్రతిసారి ప్రోటోకాల్‌ వివాదం రెండు పార్టీలను వెంటాడి వేడి రగులుస్తూనే ఉంది. క్యాబినెట్‌ క్యాడర్‌ మంత్రిగా మాణిక్యాలరావు అభివృద్ధి పనులకు సంబంధించి జీఓలు తీసుకొచ్చినా, క్షేత్రస్థాయిలో అమలుకాని పరిస్థితి. లేదంటే స్థానిక సంస్థలు తీర్మానాలు ఇవ్వని వాతావరణం నెలకొంది. ఇదే క్రమంలో దేశంలో మోడల్‌ రైతుబజారును ఇక్కడ ఏర్పాటు చేయాలన్న మాణిక్యాలరావు కల నెరవేరలేదు.

సకాలంలో తీర్మానం కాక రైతు బజారు వేరే రాష్ట్రం తరలివెళ్లింది. ఎడ్యుకేషన్‌ హబ్‌కు సంబంధించి జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలలకు భూ కేటాయింపుల వ్యవహారంలో కూడా ఇదే తంతు సాగింది. అప్పటికే ఈ వ్యవహారాలు మిత్రధర్మాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే దీనిపై పంచాయతీలు సీఎం వరకు వెళ్లాయి. తాడేపల్లిగూడెం పట్టణంలో దీర్ఘకాలంగా సమస్యగా ఉన్న విమానాశ్రయ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం జీఓ ఇవ్వడం, పట్టాల పంపిణీకి రంగం సిద్ధం కావడం, ఇదే తరుణంలో ఎన్‌డీఏ నుంచి టీడీపీ వైదొలగడంతో ఇక్కడ అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ, టీడీపీ బంధాలు పూర్తిగా చెడిపోయాయి. మంత్రివర్గం నుంచి బయటకొచ్చాక మాణిక్యాలరావుకు అధికారులు దూరమయ్యారు. ప్రోటో కాల్‌ లేదు. శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే అ«ధికారపార్టీ నాయకులు మాణిక్యాలరావు కంటే ముందువెళ్లి ఆ తంతు కాస్తా పూర్తిచేసేవారు. ఇటీవల పెంటపాడు మండలంలో మాణిక్యాలరావు కార్యక్రమానికి హాజరుకాకుండా అధికారులంతా అనారోగ్యంగా ఉందంటూ సామూహికంగా సెలవుపెట్టడం ఇక్కడి పరిస్థితికి దర్పణం పడుతోంది. ప్రోటోకాల్‌ విషయంలో ప్రివిలైజేషన్‌ కమిటీకి ఫిర్యాదు చేసినా కూడా మాణిక్యాలరావుకు అందాల్సిన గౌరవం దక్కడం లేదు. ఇదే తరుణంలో అభివృద్ధిపై మీడియాలో టీడీపీ, బీజేపీ మధ్య ప్రకటనల యుద్ధం బహిరంగ చర్చకు సవాలు చేసుకునే వరకూ వచ్చింది.

హైడ్రామా సాగిందిలా
గురువారం ఉదయం ఆరు గంటలకు ఎమ్మెల్యే మాణిక్యాలరావును హౌస్‌ అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఉదయం 8.30 నుంచి ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు. ఉదయం 10 గంటల సమయానికి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడిì బాపిరాజుని, తాడేపల్లిగూడెం మునిసిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాసును, ఎమ్మెల్యే మాణిక్యాలరావును హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జెడ్పీ చైర్మన్‌ ముందురోజు రాత్రే వెంకట్రామన్నగూడెం చేరుకుని తమ పార్టీ నేత ఇంట్లో బస చేయడంతో అక్కడ గృహనిర్బంధం చేశారు.  ఉదయం 10.30కు ప్రజాపక్షాన పోరాటం చేస్తాను. పనులు చేయకుంటే టీడీపీ నాయకులను రోడ్డుపై తిరగనివ్వం అంటూ మాణిక్యాలరావు ప్రకటించారు. జిల్లాపరిషత్‌ చైర్మన్‌ను నల్లజర్ల నుంచి వెంకట్రామన్నగూడెం ఎలా అనుమతించారు. ఎమ్మెల్యేను మాత్రం గుమ్మం కదలనివ్వరా అంటూ ఆయన ప్రశ్నించారు.

ఉదయం 10.35 శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధపడిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వేచి చూసిన మాణిక్యాలరావు గేట్లు దూకి రోడ్డుపైకి చేరారు. రోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బలవంతంగా ఎమ్మెల్యేను ఇంట్లోకి తరలించారు. మ««ధ్యాహ్నం 12.20  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మాణిక్యాలరావు ఇంటికి బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి అదనపు బలగాలని దింపారు. ముఖ్యనేతలను రానివ్వకుండా జిల్లా సరిహద్దులలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. మరోవైపు వెంకట్రామన్నగూడెంలో బయటకు వచ్చిన ముళ్లపూడి బాపిరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు.

మరోవైపు గృహనిర్బంధంలో ఉన్న మున్సిపల్‌ చైర్మన్‌ తాడేపల్లిగూడెం నుంచి వెంకట్రామన్న గూడెం చేరుకోవడానికి పోలీసులు సహకరించారన్న ఆరోపణలు వినిపించాయి. సాయంత్రానికి తాడేపల్లిగూడెం చేరుకున్న బీజేపీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ బాపిరాజుకు దమ్ముంటే పోలీసు పికెట్స్‌ ఎత్తివేయించి పోలీసు వాహనంలో చర్చకు ఎమ్మెల్యేను తీసుకెళ్లాలని ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్న మహిళలను పోలీసులు తప్పించే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్యే గోడదూకి రోడ్డుపైకి వచ్చి నిరసన చేయబోతుండగా ఆయనను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయనకు ఊపిరి ఆడని పరిస్ధితి నెలకొంది. ఈ దశలో పోలీసులు ఆయనను బలవంతంగా ఎత్తి ఇంట్లోకి చేర్చారు. వెంకట్రామన్నగూడెం నుంచి బాపిరాజును నల్లజర్లకు, బొలిశెట్టి శ్రీనివాస్‌ను తాడేపల్లిగూడెంకు పోలీసులు చేర్చడంతో బీజేపీ శ్రేణులు శాంతించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top