సర్కారుకు చరమగీతం పాడాలి

tammineni veerabhadram commented over trs

గిరిజన గర్జనలో తమ్మినేని, జీవన్‌రెడ్డి, పొన్నం, ఆరెపల్లి పిలుపు

కరీంనగర్‌: మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఎన్నికల హామీలను విస్మ రిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కారుకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌ పిలుపునిచ్చారు.

ఆదివారం గిరిజన సంఘాల జేఏసీ చైర్మన్‌ జి.భీమాసాహెబ్‌ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో గిరిజన గర్జన సభలో పాల్గొన్న వారు మాట్లాడారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చి ఎన్నికలయ్యాక చేతులెత్తేసిన కేసీఆర్‌ వైఖరిని ప్రజలు గ్రహించారని, రానున్న రోజుల్లో ప్రజల చేతిలో చీత్కారం తప్పదని హెచ్చరించారు.

500 జనాభా ఉన్న గిరిజన తండాలన్నింటినీ పంచాయతీలుగా మారుస్తానని, 12 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తానని, గిరిజన యూనివర్సిటీలను నెలకొల్పి, ఐటీడీఏలను బలోపేతం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. 12 శాతం రిజర్వేషన్‌ సాధ్యా సాధ్యాలపై చెల్లప్ప కమిటీ పేరిట అధ్యయనం చేసేందుకు చెల్లని కమిషన్‌ వేసి కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

కేజీ టూ పీజీ విద్య, డబుల్‌ బెడ్‌రూం పథకం, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూ పంపిణీ పథకం, దళిత గిరిజనులకు సంక్షేమ పథకాలను అమలుచేస్తానని ఎరవేసి అధికారంలోకి వచ్చాక దగా చేస్తున్నాడని మండిపడ్డారు. కార్పొరేట్‌ సంస్థలకు ఊడిగం చేస్తూ సంపన్నవర్గాలకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తూ పేద ప్రజల నడ్డివిరిచే విధానాలు అవలంభిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు రానున్న రోజుల్లో పుట్టగతులు లేకుండా చేయాలని వారు పిలుపునిచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top