అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి

tammineni on tribals problems - Sakshi

గిరిజన సమస్య పరిష్కారానికి తమ్మినేని డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: సున్నితమైన గిరిజన తెగల వివాదం పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఇందుకు ఇటీవల జరిగిన రెండు ఘటనలు ఉదాహరణగా కనపడుతున్నాయని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన హింసాత్మక సంఘటనలు ఒకటికాగా, జయంశంకర్‌ జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగిన విధ్వంస ఘటన మరొకటని పేర్కొన్నారు.

గిరిజన సమస్య మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసి పరిష్కారాలు వెదకాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉండగా, దీన్ని శాంతిభద్రతల సమస్యగా చూపుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన శనివారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. గిరిజన సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, తక్షణం శాంతిని నెలకొల్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివాసీల సమ్మక్క–సారలమ్మ జాతర నిర్వహణ విషయాల్లో కూడా రాష్ట్ర మంత్రి చందూలాల్, ఆయన కుమారుడి వ్యవహారశైలి మేడారంలో 12 వాహనాల ధ్వంసానికి దారి తీసిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top