పనికిమాలిన దొంగలంతా జమైతుండ్రు! 

Talasani Srinivas Yadav fires on Opposition - Sakshi

విపక్షాలపై మంత్రి తలసాని ఆగ్రహం

సాక్షి, కామారెడ్డి: ‘అధికారంలో ఉన్నన్ని దినాలు ప్రజలకు మేలు చేసే ఒక్కపని గూడ జెయ్యని పనికిమాలిన దొంగలంతా ఒక్కతాన జమైతుండ్రు.. సీఎం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. వాళ్ల ఆటలు ఇక సాగయి. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధికి జై కొడుతుండ్రు. యావత్‌ దేశం మొత్తం మనదిక్కే జూస్తున్నది’అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం కామారెడ్డిలో రెండో విడత గొర్రెలు, గేదెల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాలవారు ఆసక్తిగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ కొమురవెల్లి మల్లన్న, బీరప్పల స్వరూపమని మంత్రి కీర్తించారు. 45 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేయని కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు కొత్తబిచ్చగాళ్ల లెక్క తిరుగుతున్నారని విమర్శించారు.  

మరో 6వేల కోట్ల పెట్టుబడి సాయం: పోచారం  
సమైక్య పాలనలో వలసలు పోయిన ప్రజలంతా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్లకు తిరిగి వస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రైతుబంధు కింద రాష్ట్రంలోని రైతులకు రూ. 5,778 కోట్లు పెట్టుబడి సాయంగా అందించామని, వచ్చే యాసంగి కోసం మరో రూ. 6 వేల కోట్లు సిద్ధంగా ఉంచామన్నారు. కాగా, మంత్రి తలసాని మాట్లాడుతున్నప్పుడు తమకు పాసుబుక్కులు ఇవ్వడం లేదని మొరపెట్టుకున్నారు. మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లికి చెందిన రైతులు తమది అటవీ భూమి అంటూ అధికారులు పాసుబుక్కులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top