వీవీప్యాట్‌ల లెక్కింపుపై సుప్రీం కీలక ఉత్తర్వులు

Supreme Court Issues Key Orders Over Counting Of Paper Slips - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చుతుండగా, ఐదు ఈవీఎంలలో ఈ ప్రక్రియను చేపట్టాలని సుప్రీం కోర్టు ఈసీని ఆదేశించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీవీప్యాట్‌ లెక్కింపునకు ర్యాండమ్‌గా ఈవీఎంలను ఎంపిక చేస్తారు.

సుప్రీం ఆదేశాలతో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 35 ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాల్సి ఉంటుంది. 50 వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాగా ఎన్నికల లెక్కింపును పారదర్శకంగా చేపట్టాలంటే కనీసం 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ప్రతిపక్షాలు సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు 50 శాతం వీవీప్యాట్‌లను లెక్కించాలంటే ఎన్నికల ఫలితాల ప్రకటన ఐదు రోజులకు పైగా ఆలస్యమవుతుందని ఈసీ పేర్కొన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా చేపడితే ఎన్నికల ఫలితాల్లో జాప్యం చోటుచేసుకున్నా ఇబ్బంది లేదని పిటిషన్‌ దాఖలు చేసిన 21 విపక్ష పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top