నవరత్నాలతో పేదలకు చేయూత

Support to the poor people with Navaratnalu says YS Jagan - Sakshi

వీటి గురించి అందరికీ మీరే తెలియజెప్పాలి 

అక్కచెల్లెమ్మలతో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : దేవుడు ఆశీర్వదించి, ప్రజలందరి దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవర్గాల సంక్షేమం కోసం మనమేం చేయబోతున్నామో అందరికీ విçస్తృతంగా తెలియ జెప్పాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలను కోరారు. ఆదివారం 84వ రోజు ప్రజా సంకల్ప యాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం బోడగుడిపాడు శివారు నుంచి ప్రారంభమైంది. ఉదయగిరి నియోజకవ ర్గంలోని కొత్తపాళెం (జలదంకి మండలం) గ్రామానికి చేరుకున్నప్పుడు జగన్‌తో మాట్లాడేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉన్నారు. అక్కడ కొద్ది సేపు ఆగిన జగన్‌ వారితో ముఖాముఖి మాట్లాడారు. ‘రేపు మనందరి ప్రభుత్వం రాగానే ఏం చేయబోతామో ఇప్పటికే చెప్పాను. నవరత్నాల ద్వారా అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం.నవరత్నాల గురించి ఇంకా ఎవరైనా తెలియని వారుంటే.. వారందరికీ మీరు విస్తృతంగా తెలియజేయాలి. ఊర్లో ఎవరెవరికి తెలియదో తెలుసుకుని వారికి నవరత్నాల గురించి గట్టిగా చెప్పండి. అద్దో.. ఆ (చిన్న పిల్లల వైపు చేయి చూపిస్తూ...) ఆ చిట్టి పిల్లలను బడికి పంపితేనే మన తల రాతలు మారతాయి. వారు పెద్ద చదువులు చదువుకుంటేనే పేదరికం నుంచి బయట పడేందుకు వీలవుతుంది. అందుకోసం ఆ చిట్టి పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ సంవత్సరానికి రూ.15 వేలు జగన్‌ ఇస్తాడని చెప్పండి. ఈ చిట్టి పిల్లలు రేపు ఇంజినీర్లు, డాక్టర్లు అయితేనే మన కుటుంబాలు బాగు పడతాయి. అలా వారు పెద్ద పెద్ద చదువులు చదవడానికి ఎన్ని లక్షలు ఖర్చు అయినా మన ప్రభుత్వం భరిస్తుందని చెప్పండి. అంతేకాదు హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తారని కూడా చెప్పండి’ అని మహిళలకు పిలుపునిచ్చారు. 

ఆగి మాట్లాడుతూ.. వేగంగా నడుస్తూ..
పాదయాత్రలో  జగన్‌.. తనకు ఎదురుపడిన చిన్న పిల్లలు మొదలు అవ్వాతాతల వరకు అందరితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. వారు సమస్యలు చెప్పుకుంటుంటే ఓపికగా వింటున్నారు. వారికి ధైర్యం చెబుతున్నారు. ఒక్కోసారి ఒక్కో గ్రామం దాటడానికి గంట నుంచి రెండు గంటలు కూడా పడుతోంది. దీంతో ఆ గ్రామం దాటాక ఆయన నడక  వేగం అందుకుంటోంది. ‘జగనన్న చూడన్నా.. ఎలా నడుస్తున్నాడో.. ఆయన వెంట నడవలేక చాలా మంది పరుగు పెడుతున్నారు చూడు’ అంటూ ఆదివారం జలదంకి మండలం కేశవరం గ్రామానికి చెందిన మాలకొండయ్య తన మిత్రులతో అంటుండటం వినిపించింది. 

పలకరింపులో ఎంత ప్రేమో..
వరి పొలాల వద్ద కాపలా పనికి ఉన్న తూర్పు గుడ్లదొన గ్రామానికి చెందిన పున్నమ్మ అనే మహిళ పాదయాత్రగా వస్తోన్న జగన్‌ను చూసేందుకు రోడ్డు వారగా నిలుచుంది. జగన్‌తో మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని ఒకింత ఆందోళనతో ఉంది. జగన్‌ ఆమెను గమనించి అక్కడకు రాగానే ఆగిపోయారు. ఆమెను దగ్గరకు పిలిపించుకుని ఆప్యాయంగా మాట్లాడారు. ‘జగన్‌ ఎంత బాగా మాట్లాడారయ్యా.. ఇంట్లో మనిషిలా కష్టసుఖాలు అడిగారు.. ఎంత కలుపుగోలుగా ఉన్నారంటే మాటల్లో చెప్పలేను’ అని ఆమె జగన్‌ అక్కడి నుంచి వెళ్లిన తర్వాత వ్యాఖ్యానించింది. దారి పొడవునా జననేతతో మాట కలపాలని ఎదురు చూస్తున్న వారు కొందరైతే, తమ కష్టాలు చెప్పుకోవాలనుకునే వారు మరి కొందరు. కొత్తపాళెం గ్రామంలో పలువురు వృద్ధ మహిళలు కేవలం రాజకీయ కారణాలతో తమకు ప్రభుత్వం పింఛన్‌ మంజూరు చేయడం లేదని జగన్‌కు ఫిర్యాదు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారంటూ గ్రామంలోని జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు 70 మంది నిరుపేదలకు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని కన్నీటి పర్యంతమ య్యారు. గ్రామంలో ఇళ్ల మధ్య ఉన్న మద్యం దుకాణం తొలగించాలని అధికారులపై ఒత్తిడి తీసుకరావాలని కోరారు. తమ గ్రామంలో సాగునీటి అవసరాలకు ప్రత్యేక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం చేపట్టాలని తూర్పుగుడ్లదొన రైతులు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top