‘ప్రజా సంకల్పం’ నుంచే ప్రజా సంక్షేమ మంత్రం 

Study on public issues in Prajasankalpa Yatra - Sakshi

     పాదయాత్రతో ప్రజా సమస్యలపై అధ్యయనం 

     పరిష్కారానికి శాస్త్రీయ విధానం 

     నిపుణులతో ప్రత్యేక వ్యవస్థ  

     పాదయాత్రలోనే విధాన నిర్ణయాల ప్రకటన 

సాక్షి, అమరావతి బ్యూరో: పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవ్వడం.. సమస్యలను గుర్తించడం.. శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఆచరణయోగ్యమైన పరిష్కార మార్గాలను రూపొందించడం.. తద్వారా దివంగత మహానేత వైఎస్సార్‌ సంక్షేమ రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడం.. ఈ లక్ష్యాలతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర స్ఫూర్తిదాయకంగా సాగుతోంది.  

పాడి రైతులపై దృష్టి 
పాదయాత్రలో రోజూ తన దృష్టికి వచ్చే సమస్యల స్థాయిని బట్టి మూడు కేటగిరీలుగా విభజించారు. తక్షణ పరిష్కార సమస్యలను వెంటనే  పరిష్కరిస్తున్నారు. అధికారులతో చర్చించాల్సిన సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ నేతలకు అప్పగిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమస్యలపై నిపుణులతో చర్చిస్తున్నారు.  ఇతర రాష్ట్రాల్లో విధానాలను సరిపోల్చి, నిపుణులతో విశ్లేషించి ఒక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఆ విధాన నిర్ణయాలను పాదయాత్రలోనే ప్రకటిస్తున్నారు. వాటిని పార్టీ మ్యానిఫెస్టోలో పొందుపరచనున్నారు.

అందుకు పాడి రైతులను ఆదుకునేందుకు ఆయన రూపొందించిన విధానమే ఓ మచ్చుతునక. రాయలసీమ జిల్లాలో పాదయాత్రలో పెద్ద ఎత్తున పాడి రైతులు ఆయను కలిసి తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన జగన్‌ ఇతర రాష్ట్రాల్లో విధానాలు, జాతీయ పాడి పరిశోధనా కేంద్రం(ఎన్‌డీఆర్‌ఐ) నివేదికలను అధ్యయనం చేశారు. వీటిపై నిపుణులతో చర్చించారు. అనంతరం ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సహకార డెయిరీలకు సరఫరా చేసే పాలపై లీటరుకు రూ.4 ప్రభుత్వం ప్రోత్సాహకం చెల్లిస్తామని ప్రకటించారు. దాంతో సహకార డెయిరీలు బలోపేతమవుతాయి. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పాడి రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది.   

రైతు, చేనేతల శ్రేయస్సే లక్ష్యం : బోర్లు వేసేందుకు అప్పులు చేసి...నీళ్లు పడక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న దుస్థితిని అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తూ గుర్తించారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేశాక.. తమ ప్రభుత్వం రాగానే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తుందని ప్రకటించారు. చేనేత కార్మికుల సమస్యలను చూసి ఆయన చలించిపోయారు. శాస్త్రీయ అధ్యయనం అనంతరం రాష్ట్రంలో 5 లక్షల చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలిగించే విధానాలు రూపొందించారు. చేనేత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందిస్తామని వెల్లడించారు. మగ్గం ఉన్న ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు. చేనేత కార్మిక మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తామన్నారు.  

‘పశ్చిమ’పై వైఎస్సార్‌ కుటుంబం పాదముద్రలు 
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2003లో నాటి దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్ర చేయగా, 2013లో నాటి కుటిల రాజకీయాలను ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పేరిట పాదయాత్ర చేశారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో కొనసాగుతున్న దుష్టపాలనను అంతమొందించేందుకు.. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. ఈ ముగ్గురి పాదయాత్రలకు సంబంధించి కీలక ఘట్టాలకు పశ్చిమ గోదావరి జిల్లా సాక్షిగా నిలిచింది. దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ చేపట్టిన  పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో చింతలపూడి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరు మండలాల మీదుగా 123.5 కిలోమీటర్లు సాగింది. 46 గ్రామాల్లో వైఎస్సార్‌ పాదముద్రలు పడ్డాయి. ఆ తర్వాత సరిగ్గా పదేళ్లకు తాను జగన్‌ అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3వేల కిలోమీటర్ల మేరకు సాగిన ఈ పాదయాత్ర   ఖమ్మం జిల్లా సరిహద్దు గురుభట్లగూడెం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామం వద్ద 2 వేల కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. పస్త్రుతం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర   దెందులూరు నియోజకవర్గంలోని మాదేపల్లి సమీపంలో 2వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించనుంది.  
    –సాక్షి ప్రతినిధి, ఏలూరు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top